peddapally : చేప.. చేప.. పెరిగేదెప్పుడు?
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:40 AM
పెద్దపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారు లకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ముం దుకు సాగడం లేదు.
- ముందుకు సాగని చేప పిల్లల పంపిణీ
- జిల్లాలో 1054 చెరువులు, కుంటలు, 2 రిజర్వాయర్లు
- వీటిలో కోటి 80 లక్షల చేపలు సరఫరా లక్ష్యం
- సకాలంలో నిధులు విడుదల చేయని ప్రభుత్వం
- రెండేళ్లుగా నత్తనడకన కార్యక్రమం
- మత్స్యకారులకు చేకూరని ప్రయోజనం
పెద్దపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారు లకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ముం దుకు సాగడం లేదు. అధికారులకు ముందు చూపు లేకపోవడం, సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా రెండేళ్లుగా లక్ష్యం మేరకు చేప పిల్లలను పంపిణీ చేయక పోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్‌లోనే చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వేయాల్సి ఉండగా, సీజన్ ముగిసినా రాష్ట్రంలో సగం కూడా చేప పిల్లల పంపిణీ జరగలేదని తెలుస్తున్నది. చేప పిల్లలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మే, జూన్ మాసాల్లోనే సంబంధిత శాఖాధికారులు చేప పిల్లల కోసం టెం డర్లను ఆహ్వానిస్తే జూలై, ఆగస్టు మాసాల్లో సకా లంలో పంపిణీ పూర్తయి మత్స్యకారులకు ప్రయోజన కరంగా ఉండేది. ఆలస్యంగా పంపిణీ చేయడం వల్ల మత్స్యకారులకు ఎలాంటి లాభం ఉండదనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండ డంతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
జిల్లాలో 1054 చెరువులు, కుంటలు, రెండు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో కోటి 80 లక్షల చేప లు పెంచాలని నిర్ణయించారు. జిల్లాలో రెండుసార్లు టెండర్లు నిర్వహించినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇతర జిల్లాల్లో చేప పిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించినా కూడా ఇప్పటి వరకు ఒక్క చేప పిల్ల కూడా పంపిణీ చేయలేదు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఆయా జిల్లాల్లో టెండర్లను దక్కించుకున్న కాంట్రా క్టర్లు లక్ష్యం మేరకు చేప పిల్లలను పంపిణీ చేయ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్ధేశించిన లక్ష్యంలో ఇప్పటి వరకు 50 శాతం చేప పిల్లలను కూడా మత్స్యకా రులకు పంపిణీ చేసినట్లుగా కనబడడం లేదు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015 నుంచి మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగా గడిచిన వర్షాకాలంలో నీటి వనరుల్లో 92 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికి 90 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని రాష్ట్ర మత్స్య శాఖాధికారులు అంచనా వేశారు. చిన్న చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు గలవి. పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 85 నుంచి 100 ఎంఎం సైజ్ చేప పిల్లలు వేయాల్సి ఉంటుంది. యేటా వర్షాలు పడి నీటి వనరులు నిండిన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో చేప పిల్లలను నీటి వనరుల్లో పోయాల్సి ఉంటుంది. కానీ గడిచిన రెండేళ్లుగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రహసనంగా జరుగుతున్నది. గతేడాది కూడా 2 నెలలు ఆలస్యంగా టెండర్లను పిలిచారు. అప్పుడు కాంట్రాక్టర్లు నాణ్యత లేని, తక్కువ సైజు గల చేప పిల్లలను పంపిణీ చేయడంతో చాలా ప్రాంతాల్లో మత్స్యకారులు వాటిని తిరస్కరించారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ముందుగానే చేప పిల్లలను పంపిణీ చేస్తారని భావించినప్పటికీ, ఈ ఏడాది కూడా ప్రభుత్వం తేరుకోలేదు. వర్షాకాలం సీజన్ ముగిసే సమయానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చేప పిల్లల పంపిణీ కోసం జిల్లాల వారీగా టెండర్లను ఆహ్వానించారు. కానీ చాలా జిల్లాల్లో చేప పిల్లలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.
వాస్తవానికి యేటా జూలై నెలాఖరు వరకు చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఆ సమయంలో వాటిల్లో చేప పిల్లలు పోస్తేనే పెరుగుతాయని, వేసవి కాలంలో చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటే సమయానికి ఒక కిలో వరకు పెరుగుతాయని
ముందుకు సాగని చేప పిల్లల పంపిణీ
మత్స్యకారులు చెబుతున్నారు. ఆలస్యంగా పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుందే తప్ప తమకు కలిగే ప్రయోజనం ఏమి లేదని పేర్కొంటున్నారు. తమకు నగదు పంపిణీ చేస్తే, సకాలంలో నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసి నీటి వనరుల్లో పెంచుకుంటామని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని వర్షాకాలం ముగిసినా చేప పిల్లల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదని మత్స్యకారులు అంటున్నారు. ప్రస్తుతం చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల తమకు ప్రయోజనం ఉండదని, వేసవి వచ్చిందంటే పిల్లలు చనిపోతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖాధికారులు ముందుచూపుతో వ్యవహరించని కారణంగానే తమకు రెండేళ్లుగా నష్టం జరుగుతున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేప పిల్లల పంపిణీకి బదులు నగదు పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.