Peddapally : పూర్తయిన విస్తరణ పనులు
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:29 AM
సుల్తానాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణంలో రద్దీగా ఉండే ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి.
ఐబీ చౌరస్తాలో కొనసాగుతున్న డివైడర్ల పనులు
త్వరలో రెండు చోట్ల ఐలాండ్‌ల నిర్మాణాలు
ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల ఏర్పాటు
సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై తొలగిన ట్రాఫిక్ ఇబ్బందులు
సుల్తానాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణంలో రద్దీగా ఉండే ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. రెండేళ్ల కిందట పనులు ప్రారంభించినా అనేక అవాంతరాలు అడ్డంకుల నేపథ్యంలో ఇటీవల రోడ్డు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం డివైడర్ల నిర్మాణం కొనసాగుతున్నది. ఈ రోడ్డు మధ్యలో రెండు ఐలాండ్స్ ను కూడా నిర్మించనున్నారు. ఇందుకుగాను రోడ్డు మధ్యలలో రెండు చోట్ల సర్కిల్ నిర్మించారు. దశాబ్దాలుగా ఇరుకు రోడ్డు మూలంగా, రోడ్లను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. రాజీవ్ రహదారి పట్టణం నుంచి ఉండడంతో ఐబీ చౌరస్తా మీదుగా నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి.
ఫ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ రోడ్డులోనే...
సుల్తానాబాద్ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ రోడ్డులోనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, జూనియర్ కళాశాల, కోర్టులు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే సబ్ ట్రెజరీ, సబ్ రిజి ష్ట్రార్, వ్యవసాయ, ఎక్సైజ్ శాఖ అధికారుల కార్యాలయాలున్నాయి. దాని పక్కనే మండల పరిషత్ కార్యాలయం, అందులోనే ఈజీఎస్, ఐకేపీ ఆఫీసులున్నాయి. రోడ్డును అనుకుని ప్రభుత్వ ఆసుపత్రి, మండల విద్యా ధికారి కార్యాలయం ఉన్నాయి. దీంతో నిత్యం కార్యాలయాలకు విద్యాల యాలకు, ఆసుపత్రులకు వచ్చే వారితో రద్దీ ఉంటుంది.
ఫ పలు మండలాలకు ప్రధాన రోడ్డు
ఐబీ చౌరస్తా మీదుగానే కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జమ్మికుంట, హుజురాబాద్ వంటి ఉమ్మడి జిల్లాలకు చెందిన పలు మండలాలకు ప్రధాన రోడ్డుగా ఉంది. వరంగల్ హన్మకొండ వంటి ప్రధాన నగరాలకు కూడా ఈ రోడ్డుగుండా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నీరుకుళ్ల మానేరు వంతెన మీదుగా వీణవంక, మానకొండూరు వంటి మండలాలకు కూడా చాలా దగ్గర దారిగా ఉంది. నిత్యం అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ఫ గోదాములు, రైసుమిల్లులు, క్వారీలు
సుల్తానాబాద్ పరిధిలో అనేక గోదాములు ఉన్నాయి. ప్రతీ వ్యవసాయ సీజన్‌తో పాటు అనేక రైసుమిల్లుల నుంచి బియ్యం లారీలు గోదాములకు వస్తుంటాయి. పలు గ్రానైట్ క్వారీల నుంచి పెద్ద పెద్ద బండలను ట్రాలీ లలో ఈ రోడ్డు గుండా తరలిస్తుంటారు. నిత్యం ఎంతో రద్దీతో ఉండే ఈ రోడ్డును దాదాపు రెండున్నర కోట్ల వ్యయంతో బీటీ రోడ్డుగా మార్చారు. డబుల్ రోడ్డు చేశారు. మధ్యలో డివైడర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఫ ఐబీ షటర్ల కూల్చి కొత్త నిర్మాణాలు
రహదారి విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే విజయరమణా రావు అధికారులతో మాట్లాడి ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరగ కుండా సూచనలు తీసుకున్నారు. ఇరుకుగా ఉన్న ఐబీ చౌరస్తా వద్ద ఉన్న పాత గదులను కూల్చి వేయించారు. వాటిని ఐబీ ఆవరణ లోపల కొత్త గదులు నిర్మించి ఇచ్చారు. దాంతో చౌరస్తాకు కొత్త కళ ఏర్పడింది.
ఫ తొలగిన ట్రాఫిక్ సమస్యలలు
రోడ్డు విస్తరణతో రహదారి విశాలంగా మారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంది. చౌరస్తా వద్ద రోడ్డు వెడల్పు చేయడంతో వాహనాలు ప్రమాదాలకు లోనుకాకుండా వెలుతున్నాయి. దానికి తోడు రాజీవ్ రహదారిపై సిగ్నల్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోయినట్లయింది.