Share News

peddapally : మారుతున్న రాజకీయ సమీకరణాలు..

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:30 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం వేడెక్కడంతో పాటు రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

peddapally :  మారుతున్న రాజకీయ సమీకరణాలు..

- నాలుగింటిని క్లీన్‌ స్వీప్‌ చేసే లక్ష్యంతో కాంగ్రెస్‌

- ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ప్రతిపక్షాలు అతలాకుతలం

- మూడవ స్థానంలో నిలిచే అభ్యర్థుల ఓటర్లపై దృష్టి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం వేడెక్కడంతో పాటు రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఓటరు దేవుళ్ల ఆశీర్వాదం ఎవరికి ఉంటుందోననే చర్చ నడుస్తుండగా, పోటీలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు మాత్రం గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తు కాగా, చివరి రెండు రోజుల్లోనే అభ్యర్థుల గెలుపు ఓటములపై ఒక అంచనా రానున్నది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాల నేతలు రంగంలోకి దిగారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగిస్తూనే, ఓటర్ల నాడీ ఎలా ఉందో తెలుసుకునేందుకు సర్వేలు చేయిస్తున్నారు. వాటి ఆధారంగా వ్యూహాలు పన్నుతూ ముందుకు సాగుతు న్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెర లేపి ఆయా పార్టీలకు చెందిన నాయకులను తమ వైపునకు తిప్పుకుంటు న్నారు. ఎన్నికల వేళ పార్టీలు మారుతుండడంతో ఆయా పార్టీల నాయకులు పరేషాన్‌ అవుతున్నారు. జిల్లాలో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 124 డివిజన్లు, వార్డులు ఉండగా, 581 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ప్రధానంగా పోటీ నడుస్తుండగా, అక్కడక్కడ ఆల్‌ ఇం డియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టి పోటీనిస్తున్నారు. కార్పొరేషన్‌ సహ మూడు మున్సి పాలి టీలను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుం డం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌లు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతూ అభ్యర్థులను ముందుకు నడిపిస్తున్నారు. వారికి దీటుగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, పుట్ట మధూకర్‌, దాసరి మనోహర్‌రెడ్డిలు ప్రచా రం సాగిస్తున్నారు. బీజేపీ నాయకులు సైతం అభ్యర్థు లతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఫ ఎవరి వ్యూహాల్లో వారే..

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు ప్రతిపక్షాలను గుక్క తిప్పుకోనివ్వకుండా డివిజన్లు, వార్డుల వారీగా ఎప్పటికప్పుడు వారి కదలికలు తెలుసుకుంటూ కార్యా చరణ రూపొందిస్తున్నారు. నెల రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల సందర్భంగా ఒక్కో డివిజన్‌, వార్డులకు సర్పం చులు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వారంతా అక్కడ తిరుగుతూ పరిస్థితి అంతా ఎమ్మెల్యే లకు రిపోర్టు చేస్తున్నారు. ఆ వెంటనే వాళ్లు రంగంలోకి దిగి కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న మాజీ కార్పొ రేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులతో మంతనాలు సాగించి పార్టీ కండువాలు కప్పుతున్నారు. రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకున్నారు. అంతేగాకుండా సుల్తానాబాద్‌, మంథనిలో అప్పటి చైర్‌ పర్సన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టి హస్తగతం చేసుకు న్నారు. రామగుండం మేయర్‌ సహ పలువురు కార్పొరే టర్లు కాంగ్రెస్‌లోల చేరడంతో అవిశ్వాసం పెట్టలేదు. మున్సిపల్‌ ఎన్నికలు ఆరంభం కాగానే రామగుండంలో మాజీ కార్పొరేటర్లు పీచర శ్రీనివాసరావు, జనగామ నర్సయ్య, పాముకుంట్ల భాస్కర్‌, సింహాచలం మాధవి, శ్రీనివాస్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యులు రఫీక్‌, వంగ శ్రీనివాస్‌, పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. పెద్దపల్లిలో మాజీ కౌన్సిలర్‌ ఇల్లందుల కృష్ణమూర్తి, రజనీ, పెద్ది గీతాంజలి, వెంకటేష్‌, బీజేపీ నాయకుడు అక్కపాక క్రాంతి సుజాత, తదితరులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో సైతం సీనియర్‌ నాయకులు డాక్టర్‌ ఐల రమేష్‌, తదిత రులు కాంగ్రెస్‌లో చేరారు. మంథని మున్సిపాలిటీలో కూడా పలువురు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఒక్కసా రిగా రాజకీయ సమీకరణాలు మారాయి. ఇంకా పలు వురు నాయకులను పార్టీలోకి తీసుక వచ్చే ప్రయ త్నాలను కొనసాగిస్తున్నారు.

ఫ మూడో స్థానంలో నిలిచే అభ్యర్థికి పడే ఓట్లపై దృష్టి

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా తో ఉన్న అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన నాయకులు మూడో స్థానంలో నిలిచే అభ్యర్థికి పడతాయనుకున్న ఓట్లపై దృష్టి సారించారు. ఎలాగైనా వారి ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క డివిజన్‌, వార్డుల్లో ముగ్గురు ఆ పైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో నాయ కులు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ప్రతి ఓటరును కలుస్తున్నారు. ఒకవైపు ప్రచారం కొనసాగిస్తూనే విం దులు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన రోజు నుంచి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు అభ్య ర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని డివిజన్లు, వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఓడ గొట్టేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన నాయకులు ఒకరికొకరు సహకరించుకుంటున్నట్లుగా కనబడుతు న్నది. మొత్తంగా జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

Updated Date - Feb 09 , 2026 | 01:30 AM