Peddapally : వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్
ABN , Publish Date - Feb 02 , 2026 | 01:44 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) వికసిత్ భారత్-2047 లక్ష్యంగా యువత అత్యాధునిక సాంకేతికతలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సాధించడం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపేలా పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడం, డిజిటల్ - గ్రీన్ ఎకానమీ రంగాల్లో నాయత్వం వహించేలా 2026-27 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
- యువతను స్వయం సమృద్ధి దిశగా నడిపేలా చర్యలు
- ప్రతీ జిల్లాకు ఒక మహిళా వసతి గృహం
- బడ్జెట్‌పై ప్రతిపక్షాల భిన్నాభిప్రాయాలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వికసిత్ భారత్-2047 లక్ష్యంగా యువత అత్యాధునిక సాంకేతికతలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సాధించడం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపేలా పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడం, డిజిటల్ - గ్రీన్ ఎకానమీ రంగాల్లో నాయత్వం వహించేలా 2026-27 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాత్రం ఎప్పటిలాగానే ఎన్‌డీఏ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలను విస్మరించి కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారుల కొమ్ము కాసే విధంగా రూపొదించారని విమర్శిస్తున్నారు. ఈ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరొక అడుగు ముందుకు వేయనున్నదని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు.
ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి గాను 53,47,315 రూపాయల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లో పలు కొత్త పథకాలతోపాటు భవిష్యత్‌లో కీలకంగా మారబో తున్న రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనబడుతోంది. పశు సంవర్థక శాఖలో భారీగా పోత్సాహాకాలతో పాటు సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థినులకు ప్రతీ జిల్లాకు ఒక హాస్టల్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. వైద్య రంగంలో ఆయుర్వేద చికిత్సను ప్రోత్సహించేందుకు ఆయుష్ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయిం చారు.
వేతన జీవులకు నిరాశే
ఆదాయ పన్ను తగ్గింపుపై ఆశగా చూసిన వేతన జీవులకు నిరాశే ఎదురైంది. కొత్తగా పన్నులు పెంచడం, తగ్గించక పోయినా, గత ఏడాది ప్రతిపాదించిన పన్నులను యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించింది. 75 వేల నుంచి 12.5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ పైన ఆదాయం ఉంటే 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు 5 శాతం, 8 నుంచి 12 లక్షల రూపాయల వరకు 10 శాతం, 12 నుంచి 16 లక్షల రూపాయల వరకు 15 శాతం, 16 నుంచి 20 లక్షల రూపాయల వరకు 20 శాతం, 20 నుంచి 24 లక్షల రూపాయల వరకు 25 శాతం, 24 లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి కొత్త ఐటీ చట్టాన్ని అమల్లోకి తీసుక రానున్నారు. ఈ చట్టం ద్వారా కొన్ని నిబంధనలను సవరించి సరళతరం చేయడం, ప్రజలే నేరుగా ఫైలింగ్ చేసుకునే విధానాన్ని తీసుక రాను న్నారు. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేసే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31వ తేదీ వరకు పెంచడం ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట లభించింది.
ముంబైలోని ఐఐసీటీ సహకారంతో దేశ వ్యాప్తంగా 15 వేల సెకండరీ స్కూళ్లు, 500 కాలేజీల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి వల్ల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే యానిమేషన్, గ్రాఫిక్స్, గేమ్ డిజైనింగ్ వంటి సృజనాత్మక రంగాల్లో శిక్షణ లభించనున్నది. దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార్ యోజన పథకాలను ప్రవేశ పెడతామని ప్రకటించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును వీబీజీ- రామ్‌జీ పథకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి 95,692 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 7 వేల కోట్లకు పైగా పెంచినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా 40 శాతం చెల్లిస్తేనే, ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే బడ్జెట్ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బడ్జెట్ ద్వారా సోలార్ పరికరాలు, లెదర్, బీడీలు, బ్యాటరీలు, సీఎన్‌జీ, బయోగ్యాస్, 17 రకాల క్యాన్సర్ మందులు, తోట ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్‌లు, ఎలక్ర్టికల్ వాహనాల బ్యాటరీలు, సౌర ఫలకాల ధరలు తగ్గనున్నాయి. విదేశాల నుంచి ఎగుమతి చేసుకునే విదేశీ మద్యం, లగ్జరీ వాచీలు, చెప్పులు, దుస్తుల ధరలు పెరగనున్నాయి.
ఫ దేశం సమృద్ధి సాధించేలా బడ్జెట్..
- గుజ్జుల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశం సమృద్ధి సాధించేలా ఉంది. యువతను ఉపాధి రంగాల వైపు మళ్లించేందుకు నైపుణ్య శిక్షణ కల్పించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రానికి హైదరాబాద్- పూణే,. చెన్నై, బెంగుళూర్‌కు మూడు కారిడార్ల నిర్మాణానికి శుభసూచకం. రైతులకు పలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు మహిళలకు షీ మార్టులను ఏర్పాటు చేయనున్నది. గ్రామీణ, పట్టణాభివృద్ధికి, వైద్య రంగానికి పెద్దపీట వేశారు. ఆయుర్వేద చికిత్సను ప్రోత్సహించేందుకు ఆయుష్ కేంద్రాల అప్‌గ్రేడ్ చేయనున్నది. జిల్లాకు ఒక వసతి గృహాన్ని నిర్మిస్తామని ప్రకటించడం వారికి ఎంతగానో ఉపయోగపడనున్నది. వేతన జీవులపై భారం వేయకుండా గత ఏడాది ప్రతిపాదించిన ఆదాయ పన్నుల విధానాన్ని కొనసాగించడం, ఆదాయ పన్నుల రిటర్న్స్‌ను మార్చి 31వరకు పెంచడం ఊరటనివ్వనున్నది.
ఫ తెలంగాణకు బడ్జెట్‌లో గుండు సున్నా..
- సీహెచ్ విజయరమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది బీజేపీ ఎంపీలను ప్రజలు గెలిపించినా, బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేకించి నిధుల కేటాయింపు గుండు సున్నా. తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చేలా బడ్జెట్ లేదు. రీజినల్ రింగు రోడ్డు, హైవేలు, రేడియల్ రోడ్లకు నిధులు నిలిచి పోయాయని, మెట్రో ఫేజ్ 2కు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. పెండిం గ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులను నిఽధులు ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును వీబీజీ- రామ్‌జీగా పేరు మార్చి రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించా లని భారం మోపింది. గత ఏడాది కంటే కేవలం 7 వేల కోట్లు అదనంగా పెంచి మొసలి కన్నీళ్లు కార్చింది. 40 శాతం నిధులు రాష్ట్రాలు భరిస్తేనే ఆ నిధులు ఖర్చు అవుతాయి. ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రే జరుగుతున్నది.
ఫ తెలంగాణ ప్రయోజనాలను కాలరాసేలా బడ్జెట్..
- కోరుకంటి చందర్, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాలరాసేలా కేంద్ర బడ్జెట్ ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడం లేదు. ఇక్కడి ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చినా పన్నెండేళ్లయినా విభజన హామీలు నెరవేరడం లేదు. ఐఐఎం, 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలకు దిక్కు లేదు. కొత్త రైల్వే లైన్‌లకు క్లియరెన్స్ ఇవ్వక పోగా, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన నవోదయ విద్యాలయం ఊసు లేకపోవడం విచారకరం.
ఫ తెలంగాణకు మొండి చెయ్యి..
- ఈద శంకర్ రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మరోసారి తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. పన్నెండేళ్లయినా విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడం లేదు. రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. తమ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు, తమకు మద్దతు పలికే పార్టీల పాలిత రాష్ట్రాలకు మాత్రం పెద్దపీట వేస్తున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షలా ఉంది బడ్జెట్, గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సహకాలు లేవు. పీఎం కుసుం ద్వారా రైతులు సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలంటున్న కేంద్రం బడ్జెట్‌లో మాత్రం 17,500 కోట్లు మాత్రమే కేటాయించిందని, కనీసం 40 వేల కోట్లయినా కేటాయించాల్సి ఉండేది. విభజన హామీలను నెరవేర్చేలా బడ్జెట్‌ను సవరించాలి.
ఫ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను సవరించాలి
- ఎరవెల్లి ముత్యం రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా కార్పొరేట్ సంస్థలకు లాభం చేసేదిగా ఉంది. ఎన్‌డీఏ ప్రభుత్వం పన్నెండేళ్లుగా పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు, కార్మికులు, కర్షకులు, కూలీల హక్కులను కాలరాస్తూ, వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నది. కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకే పెద్దపీట వేస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను పరాధీనం చేసే విధంగా ఉన్న ఈ బడ్జెట్‌కు సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా సవరించాలి.
ఫ కార్పొరేట్ శక్తులకే అనుకూలంగా బడ్జెట్..
- తాండ్ర సదానందం, సీపీఐ జిల్లా కార్యదర్శి
కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకే అనుకూలంగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమి లేదు. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ మాటలకే పరిమితం అయ్యింది. కార్పొరేట్‌కా వికాస్ అన్నట్లు బడ్జెట్ ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అరకొర నిధులు కేటాయించి ఆ రంగాలను నిర్లక్ష్యం చేశారు. ధరల నియంత్రణ బడ్జెట్‌లో ప్రస్తావించక పోవడం విచారకరం. ఆదాయ పన్ను తగ్గింపుపై ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు నిరాశ మిగిల్చింది. బడ్జెట్‌లో నిర్మాణాత్మక సంస్కరణలు లేవు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం బీజేపీకి రాష్ట్రంపై ఉన్న చిన్న చూపునకు నిదర్శనం.