Share News

Peddapallly : సంచులు లేవు.. కొనుగోలు లేదు...

ABN , Publish Date - May 16 , 2026 | 12:29 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) యాసంగి సీజన్‌లో మక్కలను విక్రయించుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు.

Peddapallly :  సంచులు లేవు.. కొనుగోలు లేదు...

- పదిహేను రోజులుగా తూకం వేయక కేంద్రాల్లోనే పడిగాపులు

- హమాలీల కొరత, రవాణా ఇబ్బందులు

- 4 లక్షల గన్నీ సంచులకు లక్ష సరఫరా

- చేతులెత్తేసిన సంచుల కాంట్రాక్టర్‌

- సంచికి రూ.21, మక్కల రవాణాకు క్వింటాలు రూ.14 నుంచి 16 ఇస్తామంటున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

యాసంగి సీజన్‌లో మక్కలను విక్రయించుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. పది, పదిహేను రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు గాస్తున్నారు. గన్నీ సంచులు, హమాలీల కొరత, మక్కల రవాణాకు సరిపడా వాహనాలు లేకపోవడంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతులు ఆశించిన దాని కంటే అధిక దిగుబడులు రావడంతో కేంద్రాలకు పెద్దఎత్తున మక్కలను తీసుకవచ్చారు. అవి కాం టాలు కాక, డబ్బులు చేతికి రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు కేంద్రాల నుంచి మక్కలను తీసుకుని వెళ్లి మఽధ్య దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. జిల్లాలో గల మక్కల కొనుగోలు కేంద్రాల్లో 2 లక్షల క్వింటాళ్ల వరకు మక్కల కుప్పలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రాలకు రైతులు పంటను తీసుకరాగానే సీరియల్‌ నంబర్ల ప్రకారం టోకెన్లను జారీ చేస్తున్నారు. మక్కలు కొనుగోలు చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు కనబరచలేదు. సాధారణంగా ప్రతీ సీజన్‌లో మార్క్‌ఫెడ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈసారి మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా స్పందించ లేదు. దీంతో అప్పటికే కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అవుతాయనే ఆశతో ఎదురు చూసి, చివరకు క్వింటాలుకు 1800 నుంచి 1900 రూపాయల చొప్పున ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర 2,400 రూపాయలు కాగా, క్వింటాలుకు రైతులు 500 నుంచి 600 రూపా యల వరకు నష్టపోయారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుని కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఓదెల మండలం ఓదెల, పొత్కపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, కూనారం, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు, రేగడిమద్దికుంట, ధర్మారం, జూలపల్లితోపాటు మియాపూర్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దాదాపు 50 వేల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారు. కేంద్రాల్లో 2 లక్షల క్వింటాళ్ల వరకు మక్కలు ఉన్నాయి.

ఫ గన్నీ సంచులు, హమాలీల కొరతే కారణం..

జిల్లాలో మక్కల కొనుగోళ్లలో జాప్యానికి గన్నీ సంచులు, హమాలీల కొరతతోపాటు రవాణాలో ఇబ్బందులే కారణమని చెబుతున్నారు. ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా ఈ యాసంగి సీజన్‌లో అత్యధికంగా 18,191 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. వాతావరణ పరిస్థి తులు అనుకూలించడంతో ఎకరానికి 35 క్వింటాళ్లకు పైగా దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో వస్తున్న దిగుబడు లను లెక్కించి సగటు దిగుబడి ఎకరానికి 32.6 క్వింటాళ్లుగా అధికారులు నిర్ణయించారు. అయినా మార్క్‌ఫెడ్‌ ఎకరానికి 25 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయమని తేల్చి చెప్పింది. ఆ లెక్కన జిల్లా వ్యాప్తంగా 4,54,775 క్వింటాళ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో కొంత పంటను రైతులు వ్యాపారులకు విక్రయించుకోగా, కొంత విత్తనోత్పత్తి కోసం ఆయా విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇవి పోనూ 2 లక్షల క్వింటాళ్ల వరకు మక్కలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 50 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. 2 లక్షల క్వింటాళ్ల మక్కలకు 4 లక్షల గన్నీ సంచులు అవసరం ఉంటాయి. జిల్లాకు లక్ష గన్నీ సంచులు మాత్రమే సరఫరా చేశారు. ఇంకా 3 లక్షల సంచులు కావాలి. సంచుల కోసం ప్రభుత్వం టెండర్‌ నిర్వహించగా, టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడని, సంచులు సరఫరా కావడం లేదని మార్కెటింగ్‌ శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే పది రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. కాంటా పెట్టిన మక్కలు కూడా గోదాములకు తరలించేందుకు లారీల కొరత వల్ల కేంద్రాల్లోనే మక్కలు మూల్గుతున్నాయి. రైతులే స్వయంగా గన్నీ సంచులు, వాహనా లను సమకూర్చుకున్నట్లయితే చార్జీలు చెల్లిస్తామని అధికారులు చెబుతు న్నారు. సంచికి 21 రూపాయలు, ఒక బస్తా మక్కల రవాణాకు దూరాన్ని బట్టి 14 నుంచి 16 రూపాయలు చెల్లిస్తామని చెబుతున్నారు. వీటిని రైతులు సమకూర్చుకున్నా కూడా హమాలీల కొరతతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం వెంటనే సమర్పించి గన్నీ సంచులు, హమాలీలు, వాహ నాల కొరత తీర్చి కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.

ఫ పన్నెండు రోజులుగా కేంద్రంలోనే మక్కలు..

- కలవేన కుమార్‌, కొత్తపల్లి రైతు

సొంతంగా ఉన్న 5 ఎకరాలు, కౌలుకు 10 ఎకరాలు తీసుకుని మొత్తం 15 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, 250 క్వింటాళ్లకు పైగా మక్కలను పెద్దపల్లి మార్కెట్‌ యార్డులో గల కేంద్రానికి తీసుకవచ్చా. ఇప్పటి వరకు మార్కెట్‌కు 320 మంది రైతులు మక్కలు తీసుక రాగా, 40 మంది రైతుల మక్కలే తూకం వేశారు. గన్నీ సంచులు లేవనే కారణంగా మక్కలు కాంటాలు వేయడం లేదు. హమాలీల కొరత, వాహనాల కొరత బాగానే ఉంది. తామే స్వయంగా గన్నీ సంచులు తీసుకవస్తే డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. కానీ అవి కూడా బయటి మార్కెట్‌లో దొరకడం లేదు. ప్రభుత్వం తక్షణమే గన్నీ సంచులను సరఫరా చేసి కొనుగోళ్లు వేగంగా జరపాలని కోరుతున్నాను.

Updated Date - May 16 , 2026 | 12:29 AM