Share News

Peddapalli : కబ్జాకోరల్లో యాతల చెరువు

ABN , Publish Date - May 18 , 2026 | 01:19 AM

ముత్తారం, మే 17 (ఆంధ్రజ్యోతి): భూకజ్జాదారుల కన్ను చెరు వులు, కుంటలపై పడింది. నీరు నిండి, పచ్చని పంటలకు జీవనా ధారంగా నిలవాల్సిన చెరువు కబ్జాదారుల కోరల్లో చిక్కుకొంది.

Peddapalli :  కబ్జాకోరల్లో యాతల చెరువు

- సుమారు 20 ఎకరాల్లో స్వాహా

- చెరువు మధ్యలో కాలువ తవ్వకం

- కొన్నేళ్ళుగా సాగు

- పట్టించుకోని అధికారులు

ముత్తారం, మే 17 (ఆంధ్రజ్యోతి): భూకజ్జాదారుల కన్ను చెరు వులు, కుంటలపై పడింది. నీరు నిండి, పచ్చని పంటలకు జీవనా ధారంగా నిలవాల్సిన చెరువు కబ్జాదారుల కోరల్లో చిక్కుకొంది. పారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని యాతల చెరువులో కొందరు కొన్నేళ్ళుగా సాగుచేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కబ్జాకు గురవుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోక పోవడంతో ఎకరాలకు ఎకరాలు మాయమవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. చెరువు శివారులో నుంచి ఎత్తుగా మట్టిపోసి సాగుచేస్తున్నారు. సాగు కోసం ఏకంగా చెరువులో కాలువను తవ్వారు. దీంతో చెరువులో నీరు నిల్వ ఉండకుండా మత్తడి ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చెరువులో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. కబ్జాదారుల నుంచి చెరువును కాపాడి, ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

150.13 ఎకరాల చెరువు.. 20 ఎకరాలు స్వాహా!

పారుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 653లో గల యాతల చెరువు 150.13 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఈ చెరువు చుట్టుప క్కల వందలాది ఎకరాల ఆయకట్టుకు ఆసరాగా నిలిచేది. ప్రస్తు తం ఈ చెరువులో సుమారు 20 ఎకరాల మేర భూమి కబ్జాదా రుల పాలైంది. గ్రామాల్లో భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతుం డటంతో, ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు చెరువు శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించేశారు. హద్దులు లేకపోవడంతో చెరువును నలుమూలలా స్వాహా చేస్తున్నారు.

చెరువు మధ్యలో కాలువ తవ్వకం..

కబ్జాదారులు ఏకంగా చెరువు మధ్యలో తాము ఆక్రమించుకున్న భూమి వరకు కాలువ తవ్వారు. చెరువు నీటిని భారీ మోటార్లు ఏర్పాటు చేసి మళ్లించుకుంటూ, చెరువు సహజ స్వరూపాన్నే మార్చేస్తున్నారు.

ఎండిపోతున్న ఆయకట్టు..

ఈ చెరువు నీటితో రెండు పంటలు పండించేవాళ్లమని, ఇప్పుడు చుక్క నీరు లేక చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని వాపోతున్నారు. కబ్జాదారుల దౌర్జన్యంతో పొలాలకు నీరు అందకుండా పోతుందని యాతల చెరువు ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు.

నగరాల్లో చెరువుల ఆక్రమణలపై హైడ్రా విరుచుకుపడుతోంది. కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ కబ్జాలపై ’హైడ్రా‘ తరహా యాక్షన్‌ ఎప్పుడు మొదలవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముత్తారం మండలంలో చాలా వరకు చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి. చెరువుల చుట్టూ ఆక్రమణలు జరుగుతున్న నీటిపారుదల శాఖ అధికారులు కనిపించనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు

మధుసూదన్‌ రెడ్డి, తహసీల్దార్‌

ఎవరైనా చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. పారుపల్లి యాతల చెరువు భూ ఆక్రమణపై విచారణ జరిపి త్వరలో సర్వే చేస్తాం. చెరువు భూమి ఆక్రమణకు గురైతే భూమిని స్వాధీనం చేసుకొని, భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 18 , 2026 | 01:19 AM