Share News

Peddapalli: ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:57 AM

గోదావరిఖని, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): సింగరేణి పరిశ్రమలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక రకమైన ఆర్థిక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొన్నది.

 Peddapalli:  ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు

- సింగరేణికి పేరుకుపోతున్న ప్రభుత్వ బకాయిలు

- సంస్థను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా కార్మిక సంఘాలు

- 28న విద్యుత్‌ సౌధ ముట్టడికి పిలుపు

- ఉత్పత్తి లక్ష్యం కుదించడంపై అనుమానాలు

- ఆందోళన కలిగిస్తున్నఅదనపు కార్మికుల అంశం

గోదావరిఖని, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): సింగరేణి పరిశ్రమలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక రకమైన ఆర్థిక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొన్నది. ఈ ఒత్తిడిలో యాజమాన్యం నిర్ణయాలు, ప్రభుత్వ ఉదాసీనత సింగరేణీయులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో బాధ్యతాయుత కార్మిక సంఘాలు కార్మిక హక్కుల అంశం కంటే ప్రధానంగా సింగరేణిని పరిరక్షించుకోవడం అనే విషయంపైనే దృష్టిసారించాయి. ఎంత ప్రభుత్వరంగ సంస్థ అయినా ఒక్క సింగరేణిని మాత్రమే ఎందుకు ప్రభుత్వం ఇంతగా వాడుకుంటున్నదని, నిర్లక్ష్యం చేస్తున్నదని కార్మికవర్గం రగిలిపోతున్నది. ఈ ఒత్తిడి కార్మిక సంఘాలను ఆందోళన కార్యక్రమాల వైపు నడిపిస్తున్నది. సింగరేణి సంస్థకు జెన్‌కో, ట్రాన్స్‌కోలు డిసెంబర్‌ 2025వరకే రూ.46వేల కోట్లకు పైగా బాకాయిపడ్డట్టు సింగరేణి అధికారికంగా ప్రకటించింది. ఇందులో జెన్‌కో నుంచి రూ.18,828కోట్లు, ట్రాన్స్‌కో రూ.27,378కోట్లు సింగరేణికి బకాయి పడ్డాయి. ఈ మొత్తం రూ.46వేలతో పాటు 2026 గడిచిన నాలుగు మాసాల్లో రూ.50వేల కోట్ల మేరకు బకాయిలు పడ్డాయి. ఈ రెండు విద్యుత్‌ సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వరంగానివే. సింగరేణి సంస్థ నిర్వహణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేతులో ఉండడం మూలంగా సింగరేణి అధికారులు విద్యుత్‌ సంస్థలను ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఈ బకాయిలు వసూలు కాని కారణంగా సింగరేణి ప్రతి నెల బ్యాంకుల నుంచి అప్పులుతీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్న సింగరేణి ఈ పరిస్థితులు కొనసాగించే క్రమంలో సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని కార్మికవర్గం ఆందోళనకు గురవుతున్నది. ఈ నేపథ్యంలో సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(సీఐటీయూ) ఈనెల 28న హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ ముందు నిరసన తెలిపేందుకు పిలుపునిచ్చింది. సింగరేణిలోని 11డివిజన్ల నుంచి ఈ నిరసనకు కార్మికవర్గం హాజరు కావాలని కోరింది. సింగరేణి సంస్థకు సంబంధించిన రూ.50వేల కోట్ల బాకాయిలను వసూలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం శ్రద్ధ చూపకపోవడం, కోల్‌బెల్ట్‌ ప్రాంత ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం కూడా సింగరేణికి నష్టం కలిగించే విధంగా పరిణమించింది. గతంలో కేవలం బొగ్గు బకాయిలు మాత్రమే విద్యుత్‌ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సి ఉండేది. సింగరేణి సంస్థ జైపూర్‌ ఎస్‌టీపీని నిర్మించడం, సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణం చేయడం, ఇందుకోసం వేలకోట్లు అప్పులు తీసుకురావడం, అవన్నీ రూ.15వేల కోట్లకుపైగా చెల్లిస్తూ రావడం సంస్థకు భారంగా మారింది. సింగరేణి విద్యుత్‌ తయారీ కోసం రోజుకు 15వేల టన్నుల బొగ్గును ఎస్‌టీపీపీకి సరఫరా చేస్తున్నది. టన్ను బొగ్గు ధర సుమారు రూ.4వేలు. ఈ బొగ్గుకు కూడా ఎస్‌టీపీపీ నుంచి చెల్లింపులు లేవు. ఎస్‌టీపీపీ, సోలార్‌ ప్లాంట్ల ద్వారా తయారయ్యే విద్యుత్‌ యూనిట్‌కు రూ.4.95ఖర్చు అవుతుంటే సింగరేణి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు యూనిట్‌కు రూ.5.42లకు అమ్ముతుంది. అయితే సింగరేణి అవసరాల కోసం నార్తన్‌ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ నుంచి ఇదే తెలంగాణ్ర పభుత్వం యూనిట్‌కు రూ.8.65లకు అమ్ముతున్నది. సింగరేణి బొగ్గు, విద్యుత్‌ అమ్మిన డబ్బులు రాష్ట్ర విద్యుత్‌ సంస్థల నుంచి రావడం లేదు. అదేసంస్థల నుంచి సింగరేణి అవసరాల కోసం కొంటున్న విద్యుత్‌కు మాత్రం నెలకు రూ.42కోట్లు చెల్లిస్తున్నది. ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్న సింగరేణి కార్మికసంక్షేమం, రక్షణ విషయంలో పొదుపు సూత్రాలను పాటించడం వల్ల కార్మికవర్గానికి నష్టం కలుగుతున్నదనేది సంఘాల వాదన.

ఇదిలా ఉండగా ఇన్ని వేల కోట్ల రూపాయల పెండింగ్‌ కారణంగా కొత్త బావులు, ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునేందుకు సింగరేణి సాహసించడం లేదు. కారణంగా సంస్థలో ఉన్న కార్మికులు అదనంగా ఉన్నారని కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం చేస్తున్న సమాలోచనలు కార్మిక వర్గాన్ని, సంఘాలను ఆవేశానికి గురిచేస్తున్నాయి. గత ఏడాదిగా మెడికల్‌బోర్డు నిర్వహించకపోవడం, వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్‌ వేయడాననికి కారణాలు కూడా బకాయిలకు ముడిపడి ఉన్నదని సంఘాలు వాదిస్తున్నాయి. దీనికితోడు సింగరేణి యాజమాన్యం 2026-27 ఆర్థిక సంవత్సరం సింగరేణి ఉత్పత్తిని 14మిలియన్‌ టన్నులకు కుదించుకుని కేవలం 60మిలియన్‌ టన్నులకే పరిమితం చేసింది. ఈ ఉత్పత్తి కుదింపు వెనుక కూడా సింగరేణిలోని అండర్‌గ్రౌండ్‌ బొగ్గు గనులను వీలైనంత త్వరగా మూసివేసేందుకు జరుగుతున్న కుట్రగా కార్మికవర్గం అభిప్రాయపడుతున్నది. వీటన్నింటిపై యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడం, ప్రభుత్వం కూడా వీటిని ఆమోదిస్తున్నట్టుగా వ్యవహరించడం కార్మికుల్లో ఆగ్రహావేశాలు పెరిగేందుకు కారణమవుతున్నది. ఇంతకాలం ఈ అంశాలపై విడివిడిగా పోరాటాలు నిర్వహించిన కార్మికసంఘాలు త్వరలో ఐక్య ఉద్యమాలకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కార్మికసంఘాల నాయకులు సింగరేణిపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో ఐక్య కార్యచరణను ప్రకటించాలని, అందుకోసం సమావేశాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నాయి. నిన్న జరిగిన ఆర్‌టీసీ సమ్మె విజయవంతం స్ఫూర్తితో సింగరేణి కార్మిక అంశాలు, సంస్థ పరిరక్షణ కోసం ప్రభుత్వం, యాజమాన్యంపై ఒత్తిడి తేవాలనే సమాలోచను సింగరేణిలో సంఘాలు చేస్తున్నాయి.

Updated Date - Apr 27 , 2026 | 12:57 AM