Peddapalli: అన్నను చూసేందుకు..
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:55 AM
(పెద్దపల్లి, ఆంధ్రజ్యోతి) నలభైనాలుగేళ్ల అజ్ఞాత జీవితం.. అనంతరం ఆయుధాలతో సహ పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు.. పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోనూ దాదా తన స్వస్థలం అయిన పెద్దపల్లిలో అడుగుపెట్టారు.
- నలభైనాలుగేళ్ల తర్వాత.. స్వస్థలానికి సహచరి తారకతో కలిసి పెద్దపల్లికి వచ్చిన మల్లోజుల వేణుగోపాల్
- ఆయనను చూసి భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు
- పెద్దన్న అంజన్న ఆరోగ్యం గురించి ఆరా..
- అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేయాలని కోరిన స్నేహితులు
- మార్చి31 తర్వాత మళ్లీ వస్తా.. అప్పుడే అన్నీ మాట్లాడతా..
- పోలీసులు తొందర పెట్టడంతో అన్నం తినకుండానే గడ్చిరోలికి..
(పెద్దపల్లి, ఆంధ్రజ్యోతి)
నలభైనాలుగేళ్ల అజ్ఞాత జీవితం.. అనంతరం ఆయుధాలతో సహ పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు.. పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోనూ దాదా తన స్వస్థలం అయిన పెద్దపల్లిలో అడుగుపెట్టారు. ఆయనను చూసి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. తనపెద్దన్న అంజన్నను ఆలింగనం చేసుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. మహారాష్ట్ర పోలీసుల భద్రతలో వచ్చిన ఆయనను పోలీసులు తొందర పెట్టడంతో భోజనం చేయకుండానే వెళ్లారు.
అక్టోబర్ 14న అరవై మందితో కలిసి లొంగుబాటు..
ఆపరేషన్ కగార్‌తో ప్రజా పోరాటాల ద్వారా లక్ష్యాలను సాధించాలని భావించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోనూ దాదా తన సహచరులు 60మంది మావోయిస్టులతో కలిసి గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట ఆయుధాలతో సహ లొంగిపోయారు. అంతకుముందు గత ఏడాది జనవరిలో తన ఉద్యమ సహచరి సిడాం విమలచంద్ర అలియాస్ తారక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. మల్లోజుల లొంగిపోయిన తర్వాత ఆయన పెద్దపల్లికి ఎప్పుడెప్పుడు వస్తాడా అని కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. తన పెద్దన్న మల్లోజుల ఆంజనేయులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆయన మహారాష్ట్ర డీజీపీ అనుమతి తీసుకుని తన భార్య సిడాం విమల చంద్ర అలియాస్ తారకతో కలిసి ఆదివారం ఉదయం పెద్దపల్లిలోని వారి నివాసానికి మహారాష్ట్ర పోలీసుల భద్రత మధ్య వచ్చారు. దీంతో ఆయనను ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులు చూసి భావోద్వేగానికి గురై ఆనంద భాష్పాలు కార్చారు. ఒక సోదరుడు, వదిన తప్ప వారి కుమారులు, కూతురు, ఇతర బంధువులను ఆయన గుర్తు పట్టలేకపోయారు. వేణుగోపాల్ అన్న అరోగ్యం గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే హైదరాబాద్‌కు వెళ్లి చూపించుకోవాలని సూచించారు. తన కొడుకులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసిన తన తల్లి మల్లోజుల మధురమ్మ(99) మూడున్నరేళ్ల క్రితం మృతి చెందగా, అప్పుడు అజ్ఞాతంలో ఉన్న సోనూ ‘మన్నించు అమ్మ’ అంటూ లేఖ రాసిన విషయం తెలిసిందే. అమ్మ మరణం గురించి అన్నదమ్ములిద్దరు చర్చించుకున్నారు. ఆయన పెద్దపల్లికి వస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరుని కుమార్తె దీప తన పిల్లలతో కలిసి పెద్దపల్లికి ముందే చేరుకున్నారు. తన సోదరుని కుమారుడు, కుమార్తె, మనవలతో, వదినతో ముచ్చటించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మల్లోజుల వచ్చారని తెలుసుకున్న తన చిన్ననాటి స్నేహితులు, ఇతర బంధువులు, ఇరుగు పొరుగు అంత ఆయన నివాసానికి చేరుకోగా, వారితో మల్లోజుల ముచ్చటించారు.
- నలభై నాలుగు ఏళ్ల క్రితం అడవుల్లోకి..
నలభై నాలుగేళ్ల సంవత్సరాల క్రితం తన చిన్నన్న అయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తాడిత, పీడిత ప్రజల కోసం విప్లవోద్యమ బాట పట్టగా, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని వేణుగోపాల్‌రావు సైతం అడవులబాట పట్టారు. కొద్దిరోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని సాగించిన ఆయన అంచలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి దండకారణ్యానికి పరిమితం అయ్యారు. 2011నవంబర్ 24నతన సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో వేణుగోపాలరావు కీలకంగా మారారు. అభయ్ పేరిట అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాదిన్నర క్రితం కగార్ ఆపరేషన్ చేపట్టి వేలాదిమంది భద్రత బలగాలతో కర్రెగుట్టలు, అబూజ్‌మాడ్ దండకారణ్యం మొత్తం జల్లెడపట్టి అనేక మందిని ఏరేశారు. దీంతో చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ రావు సైతం నాలుగున్నర నెలల క్రితం లొంగిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన గడ్చిరోలిలోనే ఉంటున్నా పెద్దపల్లిలో అడుగు పెట్టలేదు.
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి..
మల్లోజుల రాకతో అనేకమంది వారి నివాసానికి చేరుకున్నారు. తనను కలిసిన మిత్రులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి శాసనసభ్యుడిగా పోటీచేయాలని కోరగా.. ఆయన చిరునవ్వు చిందించాడు. పోలీసులు కొందరిని మాత్రమే మల్లోజులను కలిసేందుకు అనుమతించారు. మీడియాను సైతం అనుమతించ లేదు. ఫొటోలు, వీడియోలు తీయకుండా నిలువరించారు. అయితే మల్లోజుల వేణుగోపాల్‌రావు మాత్రం ‘తాను ఇప్పుడే మీతో ఏమీ మాట్లాడలేను.. అంజన్న ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తనని పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చాను. మార్చి 31 తర్వాత మళ్లీ పెద్దపల్లికి వస్తాను. అప్పుడు కూలంకషంగా మీతో అన్ని విషయాలు మాట్లాడతాను.’ అని స్పష్టం చేశారు. తిరిగి మధ్యాహ్నం తన సహచరితో కలిసి గడ్చిరోలికి వెళ్లి పోయారు.
- మహారాష్ట్ర పోలీసుల భద్రత మధ్యనే..
మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయిన నాటి నుంచి మహారాష్ట్ర పోలీసుల భద్రత మధ్యనే ఉంటున్నారు. ఆయన ఆయుధాలతో సహ 60మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ ఆయన లొంగుబాటును తీవ్రంగా ఖండించడంతోపాటు చర్యలు తీసుకుంటా మంటూ హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనకు మహారాష్ట్ర పోలీసులు భద్రత కట్తుదిట్టం చేశారు. గడ్చిరోలి నుంచి ఎటు వెళ్లకుండా చూస్తున్నారు. తన సోదరుడి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మహారాష్ట్ర డీజీపీ అనుమతితో భద్రతా సిబ్బందితో కలిసి ఆదివారం పెద్దపల్లికి వచ్చారు. ఆయన తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి కేవలం నాలుగు గంటలు మాత్రమే పెద్దపల్లిలో ఉన్నారు. అప్పటికే మల్లోజుల పెద్దపల్లికి వచ్చారనే సమాచారం అందుకున్న అనేక మంది అక్కడికి చేరుకున్నారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు ఆయనను తొందర పెట్టడంతో అన్నం కూడా తినకుండానే తిరిగి గడ్చిరోలికి వెళ్లారు. ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఆ తర్వాత ఆయన మళ్లీ పెద్దపల్లికి రానున్నారు.