Peddapalli: నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది
ABN , Publish Date - May 31 , 2026 | 12:45 AM
కోల్‌సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా అన్నారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
కోల్‌సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం పోలీస్‌కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టుడ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేరస్తులకు శిక్షపడేలా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగేలా మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు. కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్‌హౌస్ ఆఫీసర్‌కు తెలియజేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలు, సలహాలను పాటించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే పోలీసులపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. టీఎస్‌కాప్ (టీఎస్‌సీఓపీ) అప్లికేషన్‌లోని సీసీడీ (సీసీడీ) మాడ్యూల్‌కు సంబంధించిన సమన్లు, వారెంట్ల నమోదు, జారీ ప్రక్రియ, సర్వీస్ వివరాల నమోదు, పెండింగ్ వారెంట్ల పర్యవేక్షణ, కోర్టు ప్రక్రియల నిర్వహణ అంశాలపై పోలీస్ సిబ్బందికి శిక్షణ అందించారు.
కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలి..
ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు ఇకపై తమ కుటుంబ సభ్యులకోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామ గుండం పోలీస్‌కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా శనివారం ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌ఐ కే వేణుగోపాల్, ఏఎస్‌ఐ ఎం సురేందర్ రెడ్డిలను పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కే శ్రీనివాస్, స్పెషల్‌బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రగౌడ్, ఏఓ శ్రీనివాస్, ఆర్‌ఐ రమేష్, రామగుండం పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.