Share News

Peddapalli: మున్సిపల్‌ ఎన్నికల్లో ‘సోషల్‌ వార్‌’

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:31 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సోషల్‌ మీడియాను ప్రధాన ప్రచారఅస్త్రంగా వాడుకుంటున్నారు.

Peddapalli:   మున్సిపల్‌ ఎన్నికల్లో ‘సోషల్‌ వార్‌’

- రిజర్వేషన్ల ఖరారుతో ఓటర్ల నంబర్లతో గ్రూపులు

- వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలుగా ప్రచారం

- పోటాపోటీగా వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటు

- టిక్కెట్లు ఖరారు కాకున్నా ముమ్మర ప్రచారం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సోషల్‌ మీడియాను ప్రధాన ప్రచారఅస్త్రంగా వాడుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, చైర్మన్లు, డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమకు టిక్కెట్లు ఖరారు కాకున్నా సోషల్‌మీడియా వేదికల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ‘వస్తున్నా మీ కోసం.. నన్ను ఆశీర్వదించండి..’ ‘నన్ను గెలిపిస్తే డివిజన్‌, వార్డును అద్దం తునకలా అభివృద్ధి చేస్తా..’ ‘మీకు 24 గంటలు అందుబాటులో ఉంటా.. అవినీతి రహితంగా మున్సిపాలిటీల్లో మీకు కావాల్సిన పనులు చేయిస్తా..’ అంటూ ఇలా అనేక కొటేషన్లు, వాగ్ధానాలతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు అధికార కాంగ్రెస్‌పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ,. తదితర పార్టీలు ఆయాడివిజన్లు, వార్డుల్లో పోటీచేసే తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేదు. అధికార కాంగ్రెస్‌ పార్టీతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానా బాద్‌, మంథనిలో మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 124డివిజన్లు, వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగనుండడంతో ఆశావహులు టిక్కెట్లకోసం పార్టీనాయకుల చుట్టూ తిరుగుతూనే పనిలో పనిగా తమ డివిజన్‌, వార్డుల్లోని ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ వారి వాట్సాప్‌ నంబర్లు సేకరిస్తూ ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి’ అంటూ ప్రచారం చేస్తున్నారు. సేకరించిన నంబర్లను అన్నింటినీ మొబైల్‌లో నమోదు చేసుకుని డివిజన్‌, వార్డు నంబర్‌తో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రూపుల్లో ఫొటోషాప్‌లో పార్టీనాయకుల బొమ్మలు, తమ బొమ్మలు పెట్టి డిజైన్‌ చేపించిన పోస్టర్లతో ప్రచార మోత మోగిస్తున్నారు. కొందరు రీల్స్‌ తయారు చేసి సైతం ఆ లింకులను గ్రూపుల్లో తోసి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులే కాకుండా అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీనాయకులు వార్డుకు ఒక ఇన్‌చార్జీని నియమించి కూడా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. అనుబంధ సంఘాల పేరిట కూడా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి ఆ గ్రూపుల ద్వారా పరోక్షప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను హైలెట్‌ చేస్తూ వార్డుల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌పార్టీ నేతలు కూడా ఇదేతరహా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈసారి జరగబోతున్న మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో సోషల్‌మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారబోతోందని, ఈ ప్రచారమే ప్రధాన అస్త్రం అవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఓటరు వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉండడం అలాగే వీరంతా సోషల్‌మీడియాను విస్తృతంగా ఫాలో అవుతున్న కారణంగా వాట్సాప్‌ గ్రూపులకు ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే ఫేస్బుక్‌, ఇన్‌స్టాగ్రామ్తో పాటు టెలిగ్రామ్‌ లాంటి సోషల్‌మీడియా వేదికలను సైతం తమ ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటున్నారు.

ఫ పల్లెల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువ ప్రభావం..

గత నెలలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అక్కడి ఓటర్లపై సోషల్‌మీడియా ప్రభావం ఎక్కువగా చూపనప్పటికీ, పట్టణాల్లో దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఆయా కుటుంబాల్లోని ప్రతి కుటుంబ సభ్యుడి వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉండడంతో ప్రతిఒక్కరు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటివి వాడుతున్నారు. ఇటు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూనే సోషల్‌వార్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రచారం చేయాలని అభ్యర్థులు భావిస్తున్నారు. ఇప్పటివరకు వీధుల్లో తమ బొమ్మలతో ముద్రించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, వాటిద్వారా మంచి మైలేజీ వస్తుందని పోటీదారులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే కోడ్‌అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు వీధుల్లో ఉన్న పార్టీ జెండాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తారు. టిక్కెట్లు ఖరారైన తర్వాత అభ్యర్థులు చేసే ప్రతిఖర్చును ఎన్నికల అధికారులు లెక్కిస్తారు. వార్డుకౌన్సిలర్‌, డివిజన్‌ కార్పొరేటర్‌కు పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితి ఉంటుంది. దానికి లోబడి ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో సోషల్‌మీడియాను ప్రచార అస్త్రంగా వాడుకోవాలని పోటీదారులు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేవరకు తమసెల్‌ నంబర్‌ ద్వారా ప్రచారం చేయాలని, ఆ తర్వాత ఇతరుల నంబర్లతో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తంమీద ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో సోషల్‌మీడియాను విస్తృతంగా వాడుకోవాలని పోటీచేసే అభ్యర్థులు నిర్ణయించుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో సంబంధిత అభ్యర్థులకు ఖర్చు కూడా తగ్గనున్నది.

Updated Date - Jan 23 , 2026 | 01:31 AM