Peddapalli: మహిళలు, బాలికల భద్రతలో షీటీమ్స్ కీలకపాత్ర పోషించాలి
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:35 AM
కోల్‌సిటీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పించడంతోపాటు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడంలో షీ టీమ్స్ కీలకపాత్ర పోషించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
సీపీ అంబర్ కిశోర్ ఝా
కోల్‌సిటీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పించడంతోపాటు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడంలో షీ టీమ్స్ కీలకపాత్ర పోషించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం కమిషనరేట్‌లో షీ టీమ్స్, మహిళలు, పిల్లల రక్షణ, భరోసా కేంద్రాల సేవలపై సంబంధిత అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిష నరేట్ పరిధిలోని అన్నిప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా 12నుంచి 18ఏళ్ల బాలికలకు వేధింపులు, సైబర్‌నేరాలు, సామాజిక మాద్యమాల దుర్వినియోగం, మంచి స్పర్శ, చెడు స్పర్శ వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిం చారు. బాధితుల పట్ల సానుభూతి, మానవతా దృక్ప థంతో వ్యవహరిస్తూ వారికి ధైర్యం, భరోసా కల్పించా లన్నారు. బాధితుల ఫిర్యాదులపై కేసుల నమోదు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, ఫిర్యాదులో నేరం ఉన్నట్లు తేలితే ముందుగా కేసు నమోదు చేసి అనంతరం దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. బాధితుల పట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సమావేశంలో అదనపుడీసీపీ(అడ్మిన్) కే శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, షీ టీమ్ ఎస్‌ఐలు హైమా, ఉషారాణి, లావణ్య, షీ టీమ్ సిబ్బంది, భరోసా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.
మహిళలకు సురక్షితమైన
పనిప్రదేశాలను కలించడమే లక్ష్యం..
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్ర దమైన పని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ) పనితీరు, విధులు, బాధ్యతలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, కార్యాల యాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 (పోష్‌యాక్ట్) నిబంధనలను రామగుండం కమిషనరేట్‌లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. మహిళలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చేలా విశ్వసనీయమైన వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ అధ్యక్షురాలు, సభ్యులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్)కే శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, సీపీఓ రామగుండం సూపరింటెండెంట్ సీహెచ్ సంధ్య, శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బీ సత్యనారాయణ, మంచిర్యాల షీటీమ్ ఎస్‌ఐ వీ హైమ, రామగుండం పీసీఆర్ ఎస్‌ఐ ఎన్ ఓబులమ్మ, సీఏఆర్ ఆర్‌ఎస్‌ఐ పీ సరిత, పెద్దపల్లి భరోసా కేంద్రం న్యాయ సలహాదారు కే నవ్యకృష్ణ, మంచిర్యాల సఖి కేంద్రం అడ్మినిస్ర్టేటర్ ఏ శ్రీలత పాల్గొన్నారు.