Peddapalli : సింగరేణికి కాయకల్ప చికిత్స...
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:15 AM
గోదావరిఖని, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): కొన్నేళ్ళుగా గాడి తప్పిన సింగరేణి వ్యవహారాలను గాడిన పెట్టేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- వారంలో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం భేటీ
- అదనపు కార్మికుల తొలగింపుపైనే దృష్టి
- మెడికల్ కేసులకు రూ.35లక్షల చెల్లింపుపై ఆలోచన
- అవసరమైతే గోల్డెన్ హ్యాండ్ షేక్
- మోయలేని భారంగా బకాయిలు, అవినీతి
గోదావరిఖని, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): కొన్నేళ్ళుగా గాడి తప్పిన సింగరేణి వ్యవహారాలను గాడిన పెట్టేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేరుకుపోయిన రూ.50వేల కోట్ల బకాయిలు, మితిమీరిన రాజకీయ జోక్యంతో పెరిగిపోయిన అవినీతి, చేయిదాటిపోయిన కార్యనిర్వహణ, అదనపు కార్మికుల భారం సింగరేణికి గుదిబండగా మారాయి. వీటన్నీంటికి శాశ్వత చికిత్స చేయకుండా, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా సింగరేణి మనుగడ సాధ్యం కాదని యాజమాన్యానికి అవగతమైంది. కొత్తగా వచ్చిన సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్(పా) గౌతం పొట్రు ప్రభుత్వానికి నివేదిం చినట్టు తెలిసింది. ఈ అంశాలపై వారంలోపు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం భేటీ అయి చర్చిం చనున్నట్టు సమాచారం. ఇప్పటికే సింగరేణి పరిస్థితిపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సంఘాల ఆందోళన
ప్రభుత్వం రూ.50వేల కోట్ల బకాయిలు చెల్లించ కుండా కొత్త గనులు, ఓసీపీలు ప్రారంభించకుండా అదనపు కార్మికులు ఉన్నారని, వేలాది మంది కార్మికు లను ఏదో రకంగా సింగరేణికి దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వ రంగ సంస్థకు మంచిది కాదని సంఘాలు పేర్కొంటున్నాయి. సింగరేణిలో అదనపు కార్మికులు ఉంటే అవుట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్టు కార్మికులను ఎందుకు పెంచుకుంటూ పోతున్నదని ప్రశ్నిస్తున్నాయి. ఓపెన్‌కాస్టు టెండర్లలో ఎక్సెస్ బిడ్ల ద్వారా జరుగుతున్న అవినీతి వేల కోట్లలో ఉన్నదని, ఎక్స్‌ప్లోరేషన్ టెండర్లలో రూ.500కోట్ల అవినీతి జరిగినా, కోల్ ఇండియాలో కన్నా ఎక్కువ ధరలకు టెండర్లను ఎలా ఆమోదిస్తున్నదని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇల్లందు ఆర్‌కేపీ ఓపెన్ కాస్టులకు అనుమతులు తేకుండా, కొత్త గనులు ప్రారం భించకుండా నైనీ ప్రాజెక్టును గాలికి వదిలేసి కార్మికులు అదనంగా ఉన్నారని యాజమాన్యం తప్పిదాలను కార్మి కుల జీవితాలపై రుద్దడం సమంజసం కాదంటున్నాయి.
మెడికల్ అన్‌ఫిట్, అదనపు కార్మికులే పెద్ద సమస్య
సింగరేణిలో అదనపు కార్మికులను తొలగించాలనే అంశంపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలు స్తోంది. ఇప్పటికే మెడికల్ అన్‌ఫిట్ కోసం 2000 మందికిపైగా కార్మికులు దరఖాస్తులు చేసుకోనున్నారు. సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు జరుగడం లేదు. మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్ అర్హత కలిగిన 300మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మరో 200మంది ధ్రువపత్రాల పరిశీలన పేరు మీద ఆగి ఉన్నారు. ఇలా జఠిలంగా మారిన కారుణ్య నియా మకాల ఒత్తిడి, అదనపు కార్మికుల భారాన్ని తొలగిం చేందుకు యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.35లక్షలు చెల్లించి కారుణ్య నియామకాల సంఖ్యను తగ్గించేందుకు యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో రూ.10లక్షలు, ఆ తరువాత రూ.25 లక్షలు యాజమా న్యం చెల్లించింది. ఇప్పుడు రూ.35 లక్షలు కూడా ఇవ్వ డానికి యాజమాన్యం సంసిద్ధమైనట్టు తెలుస్తున్నది. అదనపు కార్మికులను తగ్గించేందుకు యజమాన్యం గోల్డెన్ హ్యాండ్ షేక్ వంటి పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ద్వారా స్వచ్ఛంద పదవీ విరమణ పొందే కార్మికులకు మూడేళ్ల బేసిక్ వేతనంతోపాటు డీఏ కలిపి చెల్లించారు. ఇప్పుడు ఏ రకమైన పథకంతో యాజమా న్యం అదనపు కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తుందో చూడాలి.
అయితే ప్రభుత్వం మాత్రం సింగరేణికి సంబంధిం చిన అంశాన్ని రాజకీయ కోణంలో కూడా అంచనా వేసుకునే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజ యం సాధించింది. సింగరేణి కార్మికులకు నష్టం కలి గించే విషయంలో, అందులో ఉద్యోగ, ఉపాధి అవకా శాల అంశంపై ప్రభుత్వం కూడా సున్నితంగా ఆలోచిం చే అవకాశాలున్నాయి.
తగ్గించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యం
సంస్థ అంతర్గత కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే కఠినమైన నిర్ణయాలు తీసుకుని కాయకల్ప చికిత్సకు నడుం బిగించింది. 74మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని ఒకేసారి 60మిలియన్లకు కుదించింది. యేటా రెండు మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి పెంచుకోవాల్సిన యాజమాన్యం ఒకేసారి 14మిలియన్ టన్నుల ఉత్పత్తిని కుదించుకున్నది. అండర్ గ్రౌండ్‌లో ఉత్పత్తి జరుగుతున్న బొగ్గు టన్నుకు రూ.10వేలకు పైగా వ్యయం అవుతున్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్ గనులను వీలైనంత త్వరగా మూసివేసి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో విలీనం చేసుకునే ఆలోచన చేస్తున్నది. ఈ ప్రక్రియ కొనసాగాలంటే ముందుగా అదనపు కార్మికులను తగ్గించుకోవడం సింగరేణి ముందున్న అత్యవసర పరిస్థితి.
డివిజన్ల సంఖ్య కుదింపు..
సింగరేణిలో ఇప్పుడు 11డివిజన్లుగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. డివిజన్ల సంఖ్యను కూడా కుదించడం ద్వారా జీఎం కార్యాలయాలు, సిబ్బంది, మెయింటనెన్స్ తగ్గించవచ్చనే ఆలోచన యాజమాన్యం చేస్తున్నది. ఈ అంశాలన్నీంటిపై ప్రభుత్వంతో చర్చించి కార్యాచరణకు అనుమతి పొందే ప్రయత్నంలో యాజమాన్యం తలమునకలైంది. ఈ వారంలో జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. వీటన్నింటితో పాటు సింగరేణిలో ఎమ్మెల్యేలు, మంత్రుల రాజకీయ జోక్యం, ట్రాన్స్‌ఫర్లు, క్వార్టర్ల అలాట్‌మెంట్లు, భారీ టెండర్లు తదితర విషయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ విషయంపై కూడా చర్చించే అవకాశం ఉన్నప్పటికీ అందుకు ప్రభుత్వ పెద్దలు ఏ మేరకు సానుకూలత వ్యక్తం చేస్తారనేది ప్రశ్నలా మిగిలి ఉన్నది. ఏది ఏమైనా సింగరేణిలో భారీ మార్పులకు అనివార్యం ఏర్పడింది.