Peddapalli: తొలి ముద్దకు సన్నాహాలు..
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:53 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మరింత పౌష్టికాహారాన్ని అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తొలి ముద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
- అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం
- పౌష్టికాహార లోపాన్ని అధిగమించేలా చర్యలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మరింత పౌష్టికాహారాన్ని అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తొలి ముద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాల్య దశలోనే చిన్నారులకు వయస్సుకు తగిన పౌష్టికాహారం అందిస్తే చిన్నారులు పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఎదుగుతారు. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి, స్త్రీ శిశు సంక్షేముశాఖ మంత్రి సీతక్కతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోనూ ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 706అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, పెద్దపల్లి, రామగుండం, మంథనిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 3,916 మంది గర్భిణులు, 3,710మంది బాలింతలు, ఒకటి నుంచి మూడేళ్ల చిన్నారులు 15,307మంది, మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులు 8,199మంది, మొత్తం 34,877మంది ఉన్నారు. అంగన్ వాడీకేంద్రాల్ల్లో నమోదైన ఏడునెలల నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న చిన్నారులకు ఇప్పటికే బాలామృతం, నెలకు 16కోడిగుడ్లు అందజేస్తుండగా, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు, మధ్యాహ్నం ఒకపూట భోజనం పెడుతున్నారు. భోజనంలో అన్నంతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, సాంబారు ఉండేలా చూస్తున్నారు. ఇదిలాఉంటే కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో కొందరు ఉదయం వేళ ఇంట్లో తిని వస్తుండగా, మరికొందరు తినకుండానే వచ్చి నీరసించి పోతున్నారు. దీంతో మధ్యాహ్నం భోజనం వరకు నిరీక్షించాల్సి వస్తోంది. అలాగే చిన్నారులు తీసుకునే ఆహారంలో అవసరమైన పోషకాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వయసుకు తగిన విధంగా ఎదుగుదల లేకపోవడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొం టున్నారు. కేంద్రాల్లో అందే భోజనంతో పిల్లలకు వారి వయస్సుకు తగిన పోషకాలు అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం చిన్నప్పటి నుంచే వారికి సరిపడా పోషకాలు ఉండే విధంగా తొలిముద్ద బ్రేక్‌ఫాస్ట్ అమలు చేసేలా రూపకల్పన చేసి అమలు చేయడానికి నిర్ణయించింది.
ఫ పోషక లోపాలు అధిగమించేందుకు..
ఈ పథకం ద్వారా చిన్నారుల్లో రక్తహీనత తగ్గడమే కాకుండా అవసరమైన పోషకాలతో వారిలో ఎదుగుదల చురుగ్గా కొనసాగనుంది. పోషక లోపాలను అధిగమించేందుకు అవకాశం ఏర్పడనున్నది. అంతేకాకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు ఆదరణ పెరిగి ఇక్కడికి వచ్చే చిన్నారుల సంఖ్య మరింత పెరగనుంది. పేదకుటుంబాలపై ఆర్థికభారం తగ్గనున్నది. జిల్లాలో పౌష్టికాహార లోపంతో బాధపడు తున్న ఎంతోమంది చిన్నారులకు తొలిముద్ద పథకం ఎంతగానో దోహదపడనున్నదని అధికారులు భావిస్తున్నారు. ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, వివిధ పోషకాల లోపాల సమస్యను ఎదు ర్కొంటున్న పిల్లలకు తొలిముద్ద బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రయోజనం కలిగించనున్నది. చిన్నారులు ఎంతో ఇష్టంగా తినేవిధంగా తినే దాంతో వారికి పోషకాలు అందేవిధంగా ప్రభుత్వం తొలి ముద్ద బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖరారు చేశారు. అవసరమైన పోషకాలు ఉండే విధంగా ఉప్మా, కిచిడీ తదితర ఆహార పదార్థాలు అందజేస్తారు. ఆంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు రోజూ ఉదయమే వేడివేడి ఉప్మా, కిచిడీ అందిస్తారు. పోషకాల మిశ్రమం కలిగిన ఆహారం అందిస్తారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్లు, ప్రొటీన్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోను న్నారు. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది. ఆ తదనంతరం తొలి ముద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తామని సంబంధిత స్త్రీశిశుసంక్షేమ శాఖాధికారులు పేర్కొంటున్నారు.