Share News

Peddapalli : రోగులు ఫుల్‌... వైద్యులు నిల్‌...

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:51 AM

కళ్యాణ్‌నగర్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.

Peddapalli :  రోగులు ఫుల్‌... వైద్యులు నిల్‌...

మధ్యాహ్నం 12గంటల వరకే ఓపీ సేవలు...

సొంత క్లీనిక్‌ల కోసం వైద్యుల ఆరాటం...

ఎమర్జెన్సీ కేసులు వరంగల్‌, హైదరాబాద్‌కు రెఫర్‌...

ఖని జనరల్‌ ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్న రోగులు

కళ్యాణ్‌నగర్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. సిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు అనుబం ధంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి 100పడకల నుంచి 362 పడకలకు అప్‌గ్రేడ్‌ అయినా రోగులకు వైద్యం అందించడంలో అప్‌గ్రేడ్‌ కావడం లేదు. ఉదయం 9.30గంటల నుంచి 12గంటల వరకే వైద్యులు ఓపీ చూస్తూ సొంత క్లీనిక్‌లకు వెళ్లిపోతున్నా పట్టించుకునే నాథుడే లేరు. మధ్యాహ్నం 12గంటలు దాటితే ఓపీ చూసే వైద్యులు లేక అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు సరైన వైద్యం అందక మత్యువాత పడుతు న్నారు. కొన్ని ఎమర్జెన్సీ కేసులను కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌లకు రెఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. 24గంటలు వైద్యులు అం దుబాటులో ఉండాల్సి ఉండగా నామమాత్రంగా వైద్య సేవలందిస్తూ ఆసుపత్రికి కొంత మంది వైద్యులు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని ఆశించిన పేదలకు నిరాశే మిగులుతోంది. మెడికల్‌ కళాశాల ఏర్పాటు తరువాత గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రోజుకు 1500 నుంచి 1700 ఓపీ నమోదు అవుతుంది. పెద్దపల్లి జిల్లాతో పాటు కుమరంభీం ఆసిఫాబాద్‌, భూపాలపల్లితో పాటు మహారాష్ట్ర సిర్వంచ, గడ్చిరోలి ప్రాంతాల నుంచి ఇక్కడికి వైద్యం కోసం రోగులు వస్తున్నారు. కానీ కొందరు వైద్యుల నిర్లక్ష్యంతో పేదలకు సరైన వైద్యం అందడం లేదు. చాలా విభాగాల్లోని వైద్యులు 11గంటల వరకే ఓపీ చూసి వెళ్లిపోతున్నారు.

సొంత క్లీనిక్‌లపై మమకారం...

కొందరు వైద్యులు 11గంటల వరకే విధులు నిర్వహిస్తూ సొంత క్లీనిక్‌ల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో చాలా మంది పేదలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు వైద్యులు తమకు సొంత ఆసుపత్రులు ఉన్నాయని, అక్కడికి వస్తే వైద్యం చేస్తామంటూ రోగులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఓ ఫిజిషియన్‌ వైద్యుడు తన క్లీనిక్‌లో వైద్యం చేయిం చుకుంటే డిస్కౌంట్‌ ఇస్తానంటూ ఆఫర్‌ బోర్డులనే ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా కొందరు పిల్లల వైద్య నిపుణులు కూడా సొంత క్లీనిక్‌లు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాసుపత్రిలో రోగులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. చాలా మంది కనీసం నాలుగు గంటలు కూడా సేవలు అందించకుండా వెళ్లిపోతున్నారు.

ఎమర్జెన్సీ కేసులు రెఫర్‌

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యులు తమ సేవలను రోగులకు అందిం చకుండా ఎమర్జెన్సీ కేసులను రెఫరల్‌ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినా, అత్యవసర కేసులు వచ్చినా ఇక్కడ వైద్యం అందుబాటులో లేదంటూ కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రులకు రెఫర్‌లు చేస్తున్నారు.

జూనియర్‌ వైద్యులతో వైద్యం

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జన్‌, అర్థోపెడిక్‌, కార్డియో, న్యూరో, యూరాలజిస్ట్‌ విభాగాల్లో ప్రొఫెసర్లు ఉన్న ప్పటికీ వారు విధులకు హాజరుకాకపోవడంతో జూనియర్‌ డాక్టర్లే వైద్యం చేస్తున్నారు. అన్నీ విభాగాల వైద్యులు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా మంది వైద్యులు ప్రైవేట్‌ ఆసుపత్రులపై మమకారంతో పేద రోగుల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిలో 24గంటలు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పేదలకు అందని మెరుగైన వైద్యం

మార్కపురి సూర్య, కార్పొరేటర్‌

సిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా అప్‌గ్రేడ్‌ అయిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో నిరుపేద రోగులకు వైద్య సేవలు అందడం లేదు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్యులు వైద్య సేవలు అందించడం లేదు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. 24గంటలు వైద్యులు రోగులకు అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్‌ చొరవ చూపాలి. అన్నీ విభాగాల్లో హెచ్‌ఓడీలను నియమించాలి.

Updated Date - Jul 06 , 2026 | 12:51 AM