Share News

Peddapalli: విద్యుత్‌ వెలుగుల ప్రస్థానంలో ఎన్టీపీసీ..

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:23 AM

జ్యోతినగర్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌రంగంలో భారతదేశానికి వెన్నెముకగా నిలుస్తూ, ఐదు దశాబ్దాలకు పైగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్న సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ).

Peddapalli:  విద్యుత్‌ వెలుగుల ప్రస్థానంలో ఎన్టీపీసీ..

- దేశ ప్రగతికి ఐదు దశాబ్దాలుగా అండ

- రేపు ఎన్టీపీసీ 52వ ఆవిర్భావ దినోత్సవం..

- థర్మల్‌ విద్యుత్‌ నుంచి గ్రీన్‌ ఎనర్జీ వరకు విస్తరించిన ప్రస్థానం

జ్యోతినగర్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌రంగంలో భారతదేశానికి వెన్నెముకగా నిలుస్తూ, ఐదు దశాబ్దాలకు పైగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్న సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ). 1975నవంబర్‌ 7న భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎన్టీపీసీ ప్రస్థానం నేడు ప్రపంచస్థాయి విద్యుత్‌ సంస్థగా విస్తరించింది. నవంబర్‌7 నాటికి 51సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ వసంతంలోకి అడుగుపెడుతోంది.

- చిన్న ఆరంభం.. భారీ ప్రస్థానం..

దేశంలో విద్యుత్‌ కొరతను అధిగమించి, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1975నవంబర్‌ 7న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను స్థాపించింది. 1976లో తొలిచైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా డివి కపూర్‌ బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని సింగ్రౌలిలో తొలి భారీ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడంతో ఎన్టీపీసీ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రారంభదశలో బొగ్గు ఆధారిత విద్యుత్‌కేంద్రాల నిర్మాణం, నిర్వహణపై ప్రధానంగా దృష్టిసారించిన సంస్థ అనతికాలంలోనే దేశ విద్యుత్‌రంగంలో తనదైన ముద్ర వేసింది. 1987నాటికి 5వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్‌సామర్థ్యాన్ని అధిగమించింది. 2002లో 20 వేల మెగావాట్ల మైలురాయిని చేరుకుంది. అనంతరం అనేక విద్యుత్‌ కేంద్రాలు, కొత్త ప్రాజెక్టులు, అనుబంధసంస్థల ఏర్పాటుతో నిరంతర విస్తరణ కొనసాగించింది. 2010మేలో మహారత్న హోదా పొందిన ఎన్టీపీసీ ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద సమీకృత విద్యుత్‌సంస్థగా ఎదిగింది.

- అన్ని రంగాల్లోకి విస్తరణ...

కాలంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి విధానాల్లో వస్తున్న మార్పులను గుర్తించిన ఎన్టీపీసీ సంప్రదాయ థర్మల్‌ విద్యుత్‌కే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనవనరులపై దృష్టిసారించింది. జల, గ్యాస్‌, సౌర విద్యుత్‌ రంగంలో భారీపెట్టుబడులు పెట్టి దేశవ్యాప్తంగా సోలార్‌ పార్కులు, ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. తెలంగాణలోని రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్‌పై ఏర్పాటు చేసిన 100మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు ఈ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి. పవన విద్యుత్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపైనా దృష్టిసారించింది. భవిష్యత్తులో పర్యావరణహిత ఇంధన ఉత్పత్తిని మరింత పెంచేందుకు 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ మొబిలిటీ, కార్బన్‌ క్యాప్చర్‌, గ్రీన్‌ కెమికల్స్‌ వంటి నూతన సాంకేతిక రంగాల్లోనూ పరిశోధనలు, ప్రాజెక్టులను చేపడుతోంది.

- అనుబంధ సంస్థలతో బహుముఖ ప్రస్థానం

విద్యుత్‌ ఉత్పత్తితో పాటు ఇతర అనుబంధ రంగాల్లోనూ ఎన్టీపీసీ తన కార్యకలాపాలను విస్తరించింది. విద్యుత్‌వ్యాపారం, పంపిణీ, బొగ్గు గనుల తవ్వకం, బొగ్గు శుద్ధి, విద్యుత్‌కేంద్రాల నిర్వహణ, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ, సాంకేతిక శిక్షణ వంటి రంగాల్లో సేవలందిస్తోంది. టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ, ఎన్టీపీసీ మైనింగ్‌వంటి అనుబంధ సంస్థల ద్వారా విభిన్న రంగాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విద్యుత్‌పరికరాల తయారీ, ఇంధనసామర్థ్యం, పునరుత్పాదక విద్యుత్‌, ఎరువుల తయారీ వంటి రంగాల్లోనూ జాయింట్‌ వెంచర్లతో భాగస్వామ్యమవుతోంది. అణువిద్యుత్‌ రంగంలోకి ప్రవేశించేం దుకు న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి అణుశక్తి విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో అణు విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా దేశ ఇంధన అవసరాలకు మరింతగా తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

- రామగుండంతో ప్రత్యేక అనుబంధం..

ఎన్టీపీసీ ప్రస్థానంలో తెలంగాణలోని రామగుండం సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు ప్రత్యేకస్థానం ఉంది. 1978లో రామగుండం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1978నవంబర్‌ 14న అప్పటి ప్రధానమంత్రి మొరార్జీదేశాయ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ పనులు వేగవంతం కాగా, 1983నవంబర్‌ 26నతొలి 200మెగావాట్ల యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. 1983జూన్‌ 26న తొలి500మెగావాట్ల యూనిట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు రెండో దశలో 3/800 మెగావాట్ల యూనిట్ల నిర్మాణం చేపట్టడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్‌ ఉతఁత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

- సామాజిక సేవలోనూ ముందంజ..

విద్యుత్‌ ఉత్పత్తి ఒక్కటే కాకుండా తాము పనిచేస్తున్న ప్రాంతాల అభివృద్ధి కూడా బాధ్యతగా భావిస్తున్న ఎన్టీపీసీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తోంది. విద్య, వైద్యం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

- పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ పర్యావరణ పరిరక్షణ బాధ్యత కూడా పెరుగుతుందనే విషయాన్ని ఎన్టీపీసీ గుర్తించింది. బూడిద వినియోగం, నీటి పొదుపు, వ్యర్థజలాల శుద్ధి, గాలి కాలుష్య నియంత్రణ, వృక్ష సంపద పెంపు వంటి కార్యక్రమాలను చేపడుతోంది.

Updated Date - Nov 06 , 2026 | 12:23 AM