Peddapalli: రైతుల అంగీకారంతోనే భూసేకరణ..
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:17 AM
ముత్తారం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రైతుల సంపూర్ణ అంగీకారంతో, ఎవరికీ అన్యాయం జరగకుండా చట్టప్రకారం భూసేకరణ చేపడతామని ముత్తారం తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
దర్యాపూర్ గ్రామసభలో రైతులకు తహసీల్దార్ భరోసా
ముత్తారం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రైతుల సంపూర్ణ అంగీకారంతో, ఎవరికీ అన్యాయం జరగకుండా చట్టప్రకారం భూసేకరణ చేపడతామని ముత్తారం తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామశివారులోని సర్వేనంబర్ 140,141,144, 145,149లో ఇండస్ట్రియల్ పార్క్‌కోసం భూములు కోల్పోతున్న రైతులతో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాపెల్లి రాజయ్య అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ హాజరై భూసేకరణ, పరిహారం అంశాలపై రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వ భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధర కంటే అధిక పరిహారంతో పాటు పునరావాస ప్యాకేజీ అందిస్తామని, బలవంతంగా ఎవరి భూమీ తీసుకోబోమని హామీ ఇచ్చారు. ముందుగా సర్వే పూర్తి చేసి రికార్డులు సరిచేయడానికి రైతులు సహకరించాలని కోరారు. సోమవారం నుంచి సర్వే ప్రారంభి స్తామని, సర్వే పూర్తయిన తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో ధరల కమిటీ వేసి, గ్రామసభలోనే రైతుల సమక్షంలో ధర నిర్ణయిస్తామని తెలిపారు. ఒక్క రూపాయి కూడా తగ్గకుండా పరిహారం బ్యాంక్‌ఖాతాల్లో జమచే సిన తర్వాతే భూమి తీసుకుం టామని భరోసా ఇచ్చారు. రైతులు స్పం దిస్తూ భూములకు పూర్తి నష్టపరిహారం చెల్లిస్తేనే ఇస్తామని, ఎకరాకు ఎంత ఇస్తారో లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రవికుమార్, రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు నూనెకుమార్, నాయకులు తాత బాలయ్య, రామగాళ్ల మధుకర్, శేరు రమేష్, రైతులు తిత్తుల శ్రీనివాస్, జంగ స్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.