Share News

Peddapalli:ఎడతెరపిలేని వర్షం..

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:21 AM

పెద్దపల్లి రూరల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురిసింది.

Peddapalli:ఎడతెరపిలేని వర్షం..

పెద్దపల్లి రూరల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురిసింది. గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలా దర్శనమివ్వడంతో పాటు మత్తడి పారుతున్నాయి. పలుగ్రామాలకు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. గ్రామాల్లో వరద ప్రవాహానికి వరి పంటలు కొంతమేర వరదనీటిలో మునిగిపోయాయి. కొత్తపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి రహదారిని, రాగినేడు నుంచి బ్రాహ్మణపల్లి వెళ్లే రహదారిని, భోజన్నపేట నుంచి చీకురాయి వచ్చే రహదారిని మూసివేశారు. అందుగులపల్లిలో వరదనీరు నిలిచిపోగా గ్రామ సర్పంచ్‌ గుర్రపు అంజయ్య, ఉపసర్పంచ్‌ తలారి స్వప్న-సాగర్‌ ప్రత్యక్షంగా వరదనీటిని శుభ్రం చేశారు. సబ్బితం గౌరిగుండాల జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. జలపాతం వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలోని రాఘవపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్‌ పాఠశాల ఆవరణలు పూర్తిగా వర్షాలకు జలమయం అయింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కల్లెపల్లి అశోక్‌, కార్యక ర్తలు వరదనీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు.

పెద్దపల్లి టౌన్‌ : పెద్దపల్లి జూనియర్‌ కాలేజీలో నీరు బయటకు వెళ్లే దారి లేక పెద్దఎత్తున నిలిచిపోయింది. రాంపెల్లి డబుల్‌ బెడ్రూం ఇండ్లలో నీరుచేరింది. రంగంపల్లి ఆర్టీవో కార్యాలయం వద్ద రాజీవ్‌రహదారిపై నీరు నిలువగా మున్సిపల్‌ సిబ్బంది క్లియర్‌ చేశారు.

పొంగిపొర్లుతున్న హుస్సేన్‌మియా వాగు

కాల్వశ్రీరాంపూర్‌ : వర్షంతోఒక్కసారిగా హుస్సేన్‌ మియావాగు జలకళ సంతరించుకుంది. వాగు పొంగి ప్రవ హించడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సుమారు నెల రోజుల వరకు సాగునీటి సమస్య ఉండదని రైతులు పేర్కొంటున్నారు. చెరువు, కుంటల్లోని నీరు చేరుతోంది.

ఫ మానేరుపై తెగిన రోడ్డు..

కిష్టంపేట-బోర్నపల్లి మధ్యనఉన్న మానేరుపై ఫ్రిబవరి లో మట్టిపోయగా ప్రస్తుతం వర్షానికి రహదారి తెగిపో యింది. దీంతో ఇరువైపులా ప్రయాణం నిలిచిపోయింది. మళ్లీ ఫిబ్రవరినెల వచ్చేవరకు రహదారి పనులు జరగవని, నిర్వాహకులు తెలిపారు. దీంతో ప్రయాణికులు జమ్మికుంట నుంచి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాముని గుండాలకు జలకళ

అంతర్గాం : రామగుండం పట్టణం, అంతర్గాం మండ లంలోని గ్రామాలు బుధవారం కురిసిన వర్షాలతో జలమ యమయ్యాయి. రామగుండం పట్టణంలోని పోస్టాఫీసులో కి నీరు చేరడంతో ఆఫీసులోని రికార్డులు, సర్వర్‌నీట ముని గాయని పోస్టుమాస్టర్‌ గుణాద్రి మల్లయ్య తెలిపారు. ఎల్లం పల్లి గ్రామశివారులో గృహాల్లోకి నీళ్లు చేరుతున్నట్లు సర్పం చ్‌ ఆరుముళ్ల మాదవిమల్లేష్‌ తెలిపారు. వర్షాలకు రామ గుండంలోని రాముని గుండాల జలకళ సంతరిం చుకుంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో కొండ అద్భు తంగా మారి చూపరులను ఆకట్టుకుంటున్నది. చుట్టూ ఎత్తైన కొండ, దట్టమైన చెట్లతో ఆహ్లాదరమైన వాతావరణం మధ్యన పర్యాటకులకు ఈ ప్రాంతం కనువిందు చేస్తుంటుంది.

సుల్తానాబాద్‌ : మానేరు నదిలో వరదనీటి ప్రవాహం మొదలైంది. మున్సిపాలిటీ పరిధిలో లోతట్టు ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలిచింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బిరుదు రాధాక్రిష్ణ, వైస్‌చైర్‌ పర్సన్‌ అంతటి పుష్షలత, కమిషనర్‌ టి రమేష్‌, మున్సిపల్‌కౌన్సిలర్లతో పాటు అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు వార్డులలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరెంట్‌ స్తంభాలు వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను వర్షంలో బయటకు పంపవద్దని, స్థంభాలకు, వైర్లకు దూరంగా ఉంచాలని సీఐ రంజిత్‌ రావు, ఎస్‌ఐ చంద్రకుమార్‌ ప్రజలను అప్రమత్తం చేశారు. పలు గ్రామాల్లోని పంటపొలాలు,పత్తిచేన్లు నీటమునిగాయి.

రామగిరి : మండలంలో రాజాపూర్‌ గ్రామంలోని ప్రధానరహదారిలో విద్యుత్‌స్తంభం విరిగిపోయింది. లద్నా పూర్‌ గ్రామంలోకి చేరుకున్న వరద నీటిని ఎక్స్‌కావేటర్‌తో కాలువలు తీసి బయటకు తరలించేందుకు చర్యలు తీసు కున్నారు. రత్నాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలోకి పెద్దఎత్తున వరదనీరు చేరుకుంది.

ముత్తారం : వర్షాల వేళ ఇండ్లలోకి నీరు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని ముత్తారం ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. బుధవారం అడవిశ్రీరాంపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని అమరాబాద్‌ ఎస్టీకాలనీలో భారీవర్షాల కారణం తో నీరు ఇండ్లలోకి రాగా సర్పంచ్‌ కొట్టెఅన్నపూర్ణ ఉపేం దర్‌తో కలిసి పరిస్థితిని పరిశీ లించారు. వెంటనే ఎక్స్‌కవావే టర్‌తో వరదనీళ్లు ముందు కు సాఫీగా సాగేలా కాలువ తవ్వించారు.

జూలపల్లి : వర్షానికి గ్రామాల్లో వాగులు, ఒర్రెలు ఉగ్రరూపం దాల్చి పరవల్లు తొక్కుతున్నాయి. వడుకాపూ ర్‌ గ్రామశివారులోగల హుసేనిమియావాగు వర్షం నీటితో రోడ్డుడ్యాంపై పొంగి ప్రమాదకరంగా ప్రవహి స్తుండడంతో రాకపోకలు నిలిచిపోయి, కరీంనగర్‌ ఇత రప్రాంతాలకు వెళ్లే ప్రయా ణికులు ఇబ్బందిపడ్డారు. కరీంనగర్‌ నుంచి కాచ పూర్‌ వయా వెంకట్రావు పల్లి ఆర్టీసీబస్సు రాక పోకలు నిలిచిపోయి ఆయాగ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. గ్రామాల్లోని కాలనీల్లో వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంతర్గత రోడ్లు బురదమయంగా మారిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, వ్యాపార, దుకాణాలదారులు సైతం వర్షంతో, తమ వ్యాపారాలు సమృద్ధిగా కొనసాగుతాయని సంతో షంతో వ్యక్తం చేస్తున్నారు.

ఓదెల : వర్షం మండలంలో రైతులకు చెప్పలే నంత ఊరట నిచ్చింది. బుధవారం సాయంత్రం వర కు కూడా మండలంలో తగ్గకుండా వర్షం విస్తారంగా కురిసింది. ఉప్పరపల్లికి, అలాగే ఓదెలనుంచి పొత్క పల్లి, కొమిరగ్రామాలవైపు రాకపోకలు నిలిచి పోయాయి. కొలనూర్‌లో ప్రమాదకరంగా ఉన్న కల్వ ర్టు వద్ద ఎంపీడీవో అనిల్‌రెడ్డి, ఎస్‌ఐ సనత్‌రెడ్డి వరద ఉధృతిని పరిశీలించారు. నీటిప్రవాహం వద్దకు ఎవరు వెళ్లకుండాబాటసారులకు,వాహనదారులకు అవగా హన కల్పించారు.

కోల్‌సిటీ : కుండపోతవర్షంతో రామగుండం అత లాకుతలం అయ్యింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వివిధ కాలనీల్లో భారీగా వరద నీరు ఇండ్లలోకి చేరింది. సింగరేణి క్వార్టర్లలో డ్రైనేజీల నీరు ఇండ్లలోకి రావడంతో కార్మిక కుటుంబాలు నానా ఇబ్బందులు పడ్డాయి. బుధవారం మధ్యా హ్నం వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఆర్‌ఎ ఫ్‌సీఎల్‌ పరిశ్రమ ఆవరణల వర్షపునీరు భారీగా చేరడంతో వరద తాకిడికి వీర్లపల్లి వైపు ప్రహరీ పడిపోయింది. వర్షపునీరు వీర్లపల్లి గ్రామంలోకి చొచ్చుకువచ్చి ఇండ్లలోకి చేరింది. ఇండ్లలోని సామాగ్రి జలమయయ్యాయి. టీచర్స్‌ కాలనీలో నాలాలు లేకపోవడంతో కాలనీ చుట్టూ వర్షపునీరు చేరింది. బుధవారం మధ్యాహ్నం వరకు అడ్డగుంటపల్లి చెరువు ప్రాంతం నుంచి బయటకు నీరుపోలేదు. భారీవర్షానికి కార్పొరేషన్‌ పరిధిలోని ప్రధాననాలాలు పొంగిపొర్లాయి. స్థా యి ఫైవింక్లయిన్‌, 2ఏ మోరీల వద్ద వర్షపు నిలి చిపోయి రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేసి రహదారు లను మూసివేశారు. ఎన్‌టీపీసీ టౌన్‌ షిప్‌ నుంచి వర్షపు నీరు అకస్మాత్తుగా బయటకు రావడంతో శ్రీనగర్‌కాలనీ రహదారిపై వర్షపునీరు చేరింది. దీంతో కమిషనరేట్‌- మల్కాపూర్‌ రహదారిని పోలీసులుబారీకేడ్లతో మూసివేశారు.

సహాయక చర్యల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌

నగర మేయర్‌ మహంకాళిస్వామి, అదనపుకలెక్టర్‌ అరు ణశ్రీ వరదప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద తాకిడికి స్థానిక మెడికల్‌ కళాశాల ప్రహారి రాజలక్ష్మికాలనీ వైపు కూలిపోయింది. మేయర్‌ స్వామి, కమిషనర్‌ అరుణశ్రీ, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్స్‌కావేటర్లతో వర్షపునీటిని మళ్లిం చేందుకు కందకాలు తవ్వించారు. కార్పొరేషన్‌ సిబ్బంది వివిధ డివిజన్లలో వర్షపు నీటిని బయటకు పంపించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రహరీ కూలి వీర్లపల్లికి వరదనీరు చేరడంతో మేయర్‌ మహంకాళి స్వామి, కమిషనర్‌ సహాయచర్యలు చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ సతీమణి మనాలీ ఠాకూర్‌ గ్రామస్థులను కలిసి ప్రభావిత కుటుంబాలకు భోజనవసతి కల్పించారు. కార్పొరేటర్‌ కందుల స్వరూప సతీష్‌, కాంగ్రెస్‌నాయకుడు కొక్కిరాల శ్రీను తదితరులు సహాయ చర్యలు చేపట్టారు. అడ్డగుంటపల్లి చెరువు ప్రాంతంలోడిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో సహాయ చర్యలు చేటట్టారు.

కమాన్‌పూర్‌ : కమాన్‌పూర్‌ నుంచి గోదావరిఖనికి రాకపోకలు నిలిపివేశారు. పేరపల్లి-రొంపికుంట గ్రామాల మధ్య కల్వర్టు వద్ద బుంగపడింది. కమాన్‌పూర్‌ ప్రభుత్వ ప్రాథమికఆరోగ్యకేంద్రం ఆవరణలోగల వృక్షం నేలకూలి ఆసుపత్రి భవనంపై పడింది. జూలపల్లిలో పడాల రాజేశ్వరి శంకరయ్య ఇల్లు కూలిపోయింది. సర్పంచ్‌ పోలుదాసరి వనిత సాయికుమార్‌ కూలిన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, భరోసా కల్పించారు. మండల కేంద్రంలోని కిష్టంపల్లిలో లోతట్టు గృహాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా గుండారం రిజర్వాయర్‌, బొక్కల వాగు వరద ఉధృతితో ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జూలపల్లి-గోదావరిఖని మధ్య ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

మంథని : మంథని పట్టణంలోని లోతట్టు షాపులు, సెల్లార్స్‌, వివిధ వార్డులోని రోడ్లు, మంథని ఆర్టీసీ బస్టాండ్‌ జలమయమ్యాయి. డ్రైనేజీలు రోడ్ల మీద పొంగి పోర్లాయి. చాలా షాపుల్లోకి వరద నీరు తోపాటు డ్రైనేజీల నీరు వచ్చి చేరింది. దీంతో వాటిని శుభ్రం చేసుకోవడానికి వ్యాపారులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు అవస్తలు పడ్డారు. బోయినిపేటలో రాంచందర్‌ ఇల్లు కూలిపోయింది. తహసీల్దార్‌ పరిశీలించారు. వివిధ వార్డుల్లో రోడ్లుపై వరదనీరు వచ్చి చేరడంతో మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, కమీషనర్‌ మనోహర్‌లు పర్యటించి వరదనీరు వెళ్లగా సిబ్బందితో డ్రైనేజీలు క్లీయర్‌ చేయించారు. బ్లిచింగ్‌ పౌడర్‌ చల్లించారు.

మంథనిరూరల్‌లో..

మంథనిరూరల్‌: మండలంలో కన్నాల శివారులోని పంట పొలాల్లోకి వరద నీరు రావడంతో పొల్లాలన్నీ నీటమునిగాయి. తహసీల్దార్‌ ఆరీఫోద్దీన్‌, సర్పంచ్‌ గుడిసె గట్టయ్య పరిశీలించారు. దుబ్బపల్లిలో చెట్టు విరిగి పడటంతో నాలుగు విద్యుత్‌స్తంబాలు ధ్వంసమయ్యాయి. విలోచవరం రహదారి పైనుంచి నీరు ప్రవహించడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల పొలాలకు గండ్లు పడ్డాయి.

ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు-జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కాల్వపల్లి గ్రామాల మధ్య మానేరుపై ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు తెగిపోయింది. దీంతో రెండు జిల్లాల మధ్య ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి.

ధర్మారం : మండలంలోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దొంగతుర్తిలో సర్పంచ్‌ కొడారి మంగ ఆర్‌ఐ నవీన్‌రావుతో కలిసి పలువాడలను పరిశీలించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇండ్లకు సంబంధించి కుటుంబాలను ముందస్తు జాగ్రత్తగా రైతు వేదికలో పునరావ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కమ్మరిఖాన్‌పేట సర్పంచ్‌ ఇరుగురాల మహేష్‌ గ్రామంలోని కాల్వలు, డ్రైనేజీలు పరిశీలించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఖిలావనపర్తి గ్రామంలోని మోతె కనకయ్యకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు ప్రహరీ కూలిపోయింది. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని బ్రిడ్జిపై నాలాల్లో చెత్త పేరుకపోవడంతో బ్రిడ్జిపై వరదనీరు నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:21 AM