Peddapalli: సింగరేణిలో.. బీమాతో ధీమా
ABN , Publish Date - Jun 01 , 2026 | 01:23 AM
గోదావరిఖని, మే 31 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కారుణ్య నియామకం ద్వారా రాజయ్య కుమారుడు సంతోష్ ఉద్యోగంలో చేరాడు. విధుల్లో చేరిన 18నెలలకే సంతోష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో
- 45కార్మిక కుటుంబాలకు రూ.48కోట్ల ప్రయోజనం
- ప్రభుత్వ రంగంలో ఇదే ప్రథమం
- సింగరేణిని అనుసరించే దిశగా బొగ్గు సంస్థలు
గోదావరిఖని, మే 31 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కారుణ్య నియామకం ద్వారా రాజయ్య కుమారుడు సంతోష్ ఉద్యోగంలో చేరాడు. విధుల్లో చేరిన 18నెలలకే సంతోష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అనారోగ్యసమస్యలు ఎదుర్కొంటున్న రాజయ్య కుటుంబం ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంతోష్ 18నెలల సర్వీస్‌కు గాను వచ్చే ఆర్థిక ప్రయోజనాలు చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణి ప్రారంభించిన కోటి రూపాయల ప్రమాద బీమా ఆదుకున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్య వృద్ధ దంపతులకు ఆర్థిక భరోసాగా నిలిచింది.
సంక్షేమంలో సింగరేణి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కార్మిక కుటంబాలకు కోటి రూపాయల ప్రమాద బీమా రక్షణ కవచంలా నిలుస్తున్నది. ఈ బీమా పథకం కింద ఇప్పటికే 45కుటుంబాల్లో వెలుగులు నింపింది. కార్మికుల సంక్షేమంలో సింగనేణి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. సహజ మరణంతోపాటు పాక్షిక, శాశ్వత వైకల్యానికి అంగవైకల్యానికి అందిస్తున్న బీమా పథకం కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నది.
కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేయాలి అన్న రాష్ట్రప్రభుత్వ సూచన మేరకు సింగరేణి యాజమాన్యం తొలిసారి రూ.1.25కోట్ల ప్రమాద బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ఇపుడు దేశ వ్యాప్తంగా బీమారంగంలో విప్లవాత్మక చర్యగా మారింది. దేశలోని బొగ్గు కంపెనీలతో పాటు ఇతర సంస్థలు కూడా ఈప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి సింగరేణి స్ఫూర్తిగా నిలిచింది. సింగరేణి ఉద్యోగులు తమ సాలరీ ఖాతాలు కల్గిఉన్న వివిధ బ్యాంక్‌లు ప్రమాదబీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. కార్పొరేట్ సాలరీ ఖాతాలు కల్గిఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్‌ఆఫ్‌బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రమాదబీమా పథకం కింద 1.25 కోట్లరూపాయలు చెల్లించడానికి సింగరేణితో ఒప్పందం చేసుకున్నాయి. సింగరేణిలో అత్యధిక కార్మికులు సాలరీఖాతాలు కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులు ఒప్పందంలో భాగంగా ఈ బీమా పథకాన్ని అమలు చేస్తు న్నాయి. సింగరేణిలోని 40,275 ఉద్యోగులకు సింగరేణి ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్న ఆయాబ్యాంక్‌ల ద్వారా యాజమాన్యం నెలవారి జీతాలను చెల్లిస్తోంది. ఉద్యోగులు వ్యక్తిగతంగా ప్రమాదబీమా పథకాల్లో సభ్యులుగా ఉన్నప్పటికీ పలు నిబంధనల ప్రకారం ఎంతో కొంత ఇన్సూరెన్స్ కింద చెల్లిస్తున్నారు. ఉద్యోగులు ఒక్కరూపాయి చెల్లించకుండానే అమలు జరిగేలా ఒప్పందం జరిగింది. రెండేళ్ల కాలంలో ప్రమాదాల్లో మరణించిన సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు ఎస్‌బీఐ 32మందికి రూ.28కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13కార్మిక కుటుంబాలకు రూ.13కోట్ల చొప్పున చెల్లించింది.
బాధిత కుటుంబాలకు అండ..
సింగరేణి ఉద్యోగులు ఎవరైనా అనుకోని ప్రమాదాల్లో మృతి చెంది నప్పుడు వారి కుటుంబాలు తీవ్రమైన మానసిక వేదనతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కుటుంబంలో సంపాదించే దిక్కు కోల్పోవడంతో చదువుకునే పిల్లలు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు ఆర్థికపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో వారికి గొప్ప ఆర్థిక భరో సాని అందిస్తున్నది ఈ పథకం.
వికలాంగులు... సహజ మరణాలకు సైతం..
ప్రమాదాల్లో మృతిచెందిన కార్మిక కుటుంబాలకే కాకుండా ప్రమాదాల్లో అంగవైకల్యం చెందిన వారికి బీమా పథకం అమలవుతున్నది. శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన సత్యనారాయణ అనే కార్మికుడు గనిప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా అతడి కుటుంబానికి బ్యాంక్ కోటి రూపాయలు అందజేసింది. ఈ పథకం ద్వారా సహజ మరణానికి ఉచితబీమా కింద రూ.10లక్షలు బ్యాంక్‌లు చెల్లించ నున్నాయి. బ్యాంక్‌ఆఫ్‌బరోడా గరిష్టంగా రూ.15లక్షలు అందజేయడం విశేషం. కాంట్రాక్టు కార్మికులకు సైతం ఇదే తరహా బీమా సదు పాయం కల్పించేలా సింగరేణి వివిధబ్యాంకులతో ఒప్పందం చేసుకున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.40లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.30లక్షల బీమాకింద కాంట్రాక్టు కార్మికులకు చెల్లించనున్నది. రిటైర్డ్ ఉద్యోగులకు వర్తింపచేయాలని సింగరేణి బ్యాంకులను కోరడంతో పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంకులు రూ.30లక్షల నుంచి కోటి రూపాయల వరకు బీమా వర్తింపజేయడానికి అంగీకరించాయి.