Peddapalli: దళిత హక్కుల అమలుపై తక్షణమే చొరవ చూపాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:39 AM
పెద్దపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహిళా చట్టాలు, మానవ హక్కుల చట్టాలు, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధకచట్టాలు
- అఖిల సంఘాల ఐక్యవేదిక
పెద్దపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహిళా చట్టాలు, మానవ హక్కుల చట్టాలు, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధకచట్టాలు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఏవీ సరిగా అమలు కావడం లేదని, తక్షణమే వాటి అమలుకు చొరవచూపాలని అఖిల సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర నాయకులు మైన్ రాజేశం, ఎస్సీ ఎస్టీ సింగరేణి నాయకులు పులి మోహన్‌లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొంతకాలంగా జిల్లాలో మహిళల రక్షణ చట్టాలు, మానవ హక్కుల చట్టాలు, పౌర హక్కులు, ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం రూపొందించిన అత్యాచార నిరోధక చట్టాలు ఏమాత్రం వర్తించడం లేదని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం దేవుడెరుగు, వారిపైనే కేసులు పెడుతూ మరింత అన్యాయానికి గురిచేస్తున్నారని అన్నారు. తమ సమస్య లకు, బాధితులకు న్యాయం జరగనియెడల యావత్ ఎస్సీ,ఎస్టీ వర్గాలందరూ ఏకమై దశలవారీగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. త్వరలో 5వేలమందితో పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడితోసహా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ నాయకులు కనకం గణేష్, ఎస్సీ, ఎస్టీ నాయకులు దుర్గం నరసయ్య, ఆల్ ఎంప్లాయిస్ నాయకులు బచ్చలి రాజయ్య, ఎస్సీ, ఎస్టీ మాజీ విజిలెన్స్ సభ్యులు కొంకటి లింగమూర్తి, అంబేద్కర్ సంఘం మహిళా నాయకురాలు భవాని, రామిళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.