Share News

peddapalli : ధాన్యం కొను‘గోల్‌మాల్‌’

ABN , Publish Date - May 25 , 2026 | 01:19 AM

అన్నదాతలకు మద్దతు ధర చెల్లించి ఆదుకోవాలనే ప్రభుత్వ లక్ష్యా న్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకొంటు న్నారు.

peddapalli :  ధాన్యం కొను‘గోల్‌మాల్‌’

మహబూబ్‌ పల్లెలో స్థానిక రైతులు పట్టుకున్న అక్రమ ధాన్యం రవాణా బోలెరో..

- రైతుల ధాన్యం పేరిట ‘మహా’ మోసం

- తెలంగాణ బియ్యం మహారాష్ట్రకు, అక్కడి ధాన్యం తెలంగాణకు

- ఉద్యోగులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్లే సూత్రధారులు

- ప్రభుత్వ ఖజానాకు యేటా కోట్లలో గండి

అన్నదాతలకు మద్దతు ధర చెల్లించి ఆదుకోవాలనే ప్రభుత్వ లక్ష్యా న్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకొంటు న్నారు. ధాన్యం కొనుగోలులో గోల్‌మాల్‌ చేస్తూ యేటా కోట్లాది రూపా యలను ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మహారాష్ట్రలోని సిర్వొంచ ప్రాంతంలో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడ మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని సిర్వొంచకు అక్రమంగా తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు.

మంథని, మే 24 (ఆంధ్రజ్యోతి): మంథని కేంద్రంగా ధాన్యం, రేషన్‌ బియ్యం అక్రమ దందా కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతోంది. కొం దరు అక్రమార్కులు ఒక ముఠాగా ఏర్పడి రైతుల పేరిట మహా మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను అక్రమంగా అర్జిస్తు న్నారు. కొనుగోలు కేంద్రాల్లో స్థానిక రైతుల చొరవతో ఈ దందా బయటపడడంతో అందరూ అవాక్కవుతున్నారు. యేటా రబీ, ఖరీఫ్‌ సీజన్‌లో మంథని మండలంలోని 35 ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ఈ కేంద్రాల్లో మహారాష్ట్ర నుంచి తీసుకొ చ్చిన ధాన్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నేళ్ళుగా ఈ దందా కొనసాగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరి స్తుండడం అనుమానాలకు తావిస్తోంది.

మహారాష్ట్రలో కొని.. ఇక్కడ విక్రయాలు..

మహారాష్ట్రలోని సిర్వొంచ ప్రాంతంలో క్వింటాల్‌ ధాన్యాన్ని 1300 నుంచి 1500 రూపాయలకు కొనుగోలు చేస్తారు. వాటిని లారీలు, డీసీ ఎంలు, బొలెరో వాహనాల్లో అక్రమంగా మంథని మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. వాటిని ఇక్కడి కొనుగోలు కేం ద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన రూ.2,369లకు విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. అక్రమంగా దందా కొనసాగించే ముఠా ఒక లారీపై దాదాపు రెండు లక్షల రూపా యల వరకు లబ్ధి పొందుతోంది. ఎవరికి అనుమానం రాకుండా దాదా పు నెలరోజులపాటు కొనసాగే ఖరీఫ్‌, రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు సమయంలో దాదాపు వంద వాహనాల్లో పలు విక్రయ కేంద్రాలకు తరలించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక రైతుల పేరిట ట్రక్‌షీట్లను తయారుచేసి రైస్‌మిల్లులకు తరలిస్తు న్నారు. సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క రాష్ట్రం నుంచి అక్రమంగా ధాన్యాన్ని తరలించి ఇక్కడ విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

మల్లెపల్లి, మహబూబ్‌పల్లిలో వెలుగులోకి....

మల్లెపల్లి గ్రామంలో వారం రోజుల క్రితం అక్రమ దందా బహిర్గత మైంది. మహారాష్ట్రలోని సిర్వొంచ ప్రాంతం నుంచి ధాన్యాన్ని తీసుకు వచ్చి స్థానిక రైతుల పేరిట విక్రయించినట్లు విజిలెన్స్‌ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు మల్లెపల్లి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. 8 లారీల ధాన్యాన్ని సుల్తానాబాద్‌లోని రైస్‌మిల్లుకు తరలించినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరుగుతున్న క్రమంలోనే మహబూబ్‌పల్లి, నగరంపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్దకు బోలెరా వాహనాల్లో దాదాపు 60 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా స్థానిక రైతులు అడ్డుకొని పోలీసు లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల నుంచి స్థానిక రైతుల ట్రక్‌షీట్లను తయారు చేసి రైస్‌మిల్లులకు తరలించి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంథని పీఏసీ ఎస్‌ సీఈవో మామిడాల అశోక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ రేషన్‌ బియ్యం మహారాష్ట్రకు

రాష్ట్రంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని మహారాష్ట్రలోని సిర్వొంచ ప్రాంతానికి అక్ర మంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కిలోకు రూ.15 చొప్పున కొందరు రేషన్‌డీలర్లు లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని అక్ర మార్కులు మహారాష్ట్రకు తరలించి కిలోకు 20 నుంచి 22 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

కిందిస్థాయి సిబ్బంది సహకారంతో....

మంథని సింగిల్‌ విండో, సివిల్‌ సప్లయి గోదాం పరిధిలో పని చేసే కొందరు కిందిస్థాయి సిబ్బంది తమ చేతివాటంతో అక్రమ దందాకు తెరలేపి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతు న్నారు. ఇందులో ఒక ట్యాబ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి సూత్ర ధారిగా తెలుస్తోంది. స్థానిక సివిల్‌ సప్లయిలో పనిచేస్తున్న మరో ఉద్యోగితో కలిసి అటు బియ్యం, ఇటు ధాన్యం అక్రమ దందాతో ప్రభు త్వానికి భారీగా గండి కొడుతున్నారు. వీరికి ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్లు, కొందరు సెంటర్‌ ఇన్‌చార్జీలు, అధికారులు, పార్టీల నాయకుల అండ ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు విచా రణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

రైతుల పేరిట దోచుకుంటుంది ఇలా..

కొనుగోలు సెంటర్లలో రైతుల పేరిట తమ కుటుంబ సభ్యులు, అనుకూలంగా ఉన్న రైతుల ఆధార్‌, పట్టాదారు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను అన్‌లైన్‌లో నమోదు చేసి దందాకు పాల్పడుతున్నారు. సెంటర్ల నుంచి రైస్‌మిల్లులకు ట్రక్‌షీట్‌ ద్వారా తరలించే ధాన్యం దిగు మతి అనంతరం టాప్‌ ఆపరేటర్‌ రైతుల పూర్తి వివరాలను నగదు చెల్లింపునకు నమోదు చేస్తుంటారు. దీనిని ఆసరాగా తీసుకున్న అక్ర మార్కులు మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన ధాన్యానికి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసేటప్పుడు తమకు అనుకూలమైన వారి బ్యాంక్‌ అకౌంట్‌ను నమోదు చేస్తారు. సదరు అకౌంట్‌లో డబ్బులు జమ అవుతున్నాయి. సాగు చేయని భూముల వివరాలను తీసుకొని సదరు యజమాని కౌలుకు ఇచ్చినట్లుగా అగ్రికల్చర్‌ ఏఈవోల ద్వారా సర్టిఫై చేయించుకుంటున్నారు. సర్టిఫైడ్‌ కాపీతో ఆన్‌లైన్‌లో అకౌంట్‌ వివరాలు నమోదు చేస్తున్నాను. మరి కొందరు రైతులకు పర్సంటేజ్‌ మాట్లాడుకొని వారి బ్యాంకు వివరాలను నమోదు చేసి చెల్లింపు చేయిస్తున్నారు. ఈ విధంగా ప్రతీ చిన్న అవకాశాన్ని వాడుకొని రైతుల పేరిట దోచుకుంటున్నారు.

Updated Date - May 25 , 2026 | 01:19 AM