Share News

Peddapalli: సుల్తానాబాద్‌లో ధాన్యం ట్రాక్టర్లతో రైతుల రాస్తారోకో

ABN , Publish Date - May 14 , 2026 | 11:46 PM

సుల్తానాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): మిల్లర్లు బలవంతంగా సంచికి రెండు కిలోల చొప్పున ధాన్యం కటింగ్‌ చేస్తున్నారని,

Peddapalli:   సుల్తానాబాద్‌లో ధాన్యం ట్రాక్టర్లతో రైతుల రాస్తారోకో

బలవంతంగా రెండు కిలోల ధాన్యం కటింగ్‌

అన్‌లోడింగ్‌లో ఆలస్యం.. రైతుల ఆగ్రహం

సుల్తానాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): మిల్లర్లు బలవంతంగా సంచికి రెండు కిలోల చొప్పున ధాన్యం కటింగ్‌ చేస్తున్నారని, అన్‌ లోడింగ్‌ చేయడం లేదని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలో రైతులు ధాన్యం ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా పెట్టి రాస్తారోకో చేశారు. బలవంతంగా సంచికి రెండు కిలోల కటింగ్‌ను వెంటనే నిలిపివేయాలని, మిల్లర్లపై తగినచర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. రాజీవ్‌ రహదారిపై ట్రాక్టర్లుపెట్టి రైతులు రాస్తారోకో చేయడంతో కరీంనగర్‌వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఓవైపు ఎలాంటి కటింగ్‌ చేయవద్దని జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే వేదికలపై చెపుతుంటే మిల్లర్లు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ధాన్యం కటింగ్‌ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీనికి తోడు రెండురోజులుగా ధాన్యం సంచులను అన్‌లోడ్‌ చేయకుండా మిల్లర్లు సతాయిస్తున్నారని అన్నారు. రైతులు రోడ్డుపై బైఠా యించి మిల్లర్ల వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. అయినా మిల్లర్ల నుంచి ఎలాంటి స్పందన లేకుండాపోయింది. ఆందోళన విషయం తెలుసుకున్న సుల్తానా బాద్‌ ఎస్‌ఐ చంద్రకుమార్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మరోవైపు రైస్‌మిల్లు యజ మానులతో కూడా మాట్లాడారు. దీంతో రైతులు కొంత సేపటి తర్వాత తమ ఆందోళన విరమించగా రాజీవ్‌రహదారిపై ఆగి పోయిన వాహనాలను పోలీసులు క్రమబద్దీకరించారు.

Updated Date - May 14 , 2026 | 11:46 PM