Share News

Peddapalli: సుల్తానాబాద్‌లో అస్తవ్యస్తంగా మంచినీటి సరఫరా

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:05 AM

సుల్తానాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పట్ట ణంలో మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిత్యం ఏదో ఒకచోట పైపులైన్‌ లీకేజీలు, మరమ్మతులు, తవ్వకాలతో నీటి సరఫరాకు అంత రాయం ఏర్పడుతోంది.

Peddapalli:   సుల్తానాబాద్‌లో అస్తవ్యస్తంగా మంచినీటి సరఫరా
సుల్తానాబాద్‌ పట్టణంలో మరమ్మతులకోసం తవ్విన పైపులైన్లు

- రాజీవ్‌ రహదారిపై పైపులైన్ల తవ్వకాలు

- తరచూ మరమ్మతులతో ఇబ్బందులు

- లీకేజీలతో వృథాగా పోతున్న నీరు..

- నల్లాల కోసం గంటల తరబడి ఎదురుచూపులు..

- శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల డిమాండ్‌

సుల్తానాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పట్ట ణంలో మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిత్యం ఏదో ఒకచోట పైపులైన్‌ లీకేజీలు, మరమ్మతులు, తవ్వకాలతో నీటి సరఫరాకు అంత రాయం ఏర్పడుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నల్లాల ద్వారా నీటిని సరఫరా చేసే సమయాల్లో తీవ్రగందరగోళం నెలకొంటోం ది. ఒకరోజు ఒక సమయంలో నీరు వస్తే.. మరుసటి రోజు మరోసమయంలో సరఫరా అవుతుండటంతో ప్రజలు నల్లాల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ము ఖ్యంగా పనులకు వెళ్లేవారు, మహిళలు, వృద్ధులు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో అవసరమైన నీటి ట్యాంకులు, పైపులైన్‌ కనెక్షన్లు ఉన్నప్పటికీ తరచూ తలెత్తుతున్న లీకేజీలు, మర మ్మతుల కారణంగా సరఫరా వ్యవస్థ గాడి తప్పుతోంది.

తరచూ లీకేజీలు.. మరమ్మతులే..

పట్టణంలో మంచినీటి పైపులైన్ల సమస్య కొత్తదేమీ కాదు. పాత పైపులైన్లకు పలుమార్లు మరమ్మతులు చేపట్టడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కొత్త పైపులైన్లు కూడా ఏర్పాటు చేశారు. అయినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో పైపులైన్‌ లీకేజీ ఏర్పడటం, సిబ్బంది అక్క డికి చేరుకుని మరమ్మతులు చేపట్టడం పరిపాటిగా మారింది. ఒకచోట మరమ్మతులు పూర్తయితే మరో చోట లీకేజీ బయటపడుతోంది. దీంతో నీటిసరఫరా సమయాలు మారిపోతున్నాయి. ఏ వార్డుకు ఎప్పుడు నీరు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ముందస్తు సమాచారం లేకుండా సరఫరాలో అంతరాయం ఏర్పడు తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మూడు చోట్ల తవ్వకాలు..

పట్టణంలోని ప్రధాన రాజీవ్‌రహదారిపై పైపులైన్‌ మరమ్మతులు, కొత్త పైపులైన్ల ఏర్పాటు పనులు వారం రోజులుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడు ప్రాంతాల్లో భారీగుంతలు తవ్వడంతో వాహ నాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సులు నిలిపే ప్రాంతానికి సమీపంలోనే రాజీవ్‌రహదారిపై రెండు పెద్ద గుంతలు తవ్వారు. మరికొంత దూరంలో మూలమలుపు సమీపంలోని ఓ టీస్టాల్‌ ఎదుట మరో చోట తవ్వకాలు చేపట్టారు. ఈ పనుల కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డివైడర్లు ఏర్పాటుచేసి వాహనాలను ఒకవైపునుంచే అనుమతిస్తున్నా, వేగంగావచ్చే వాహన దారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదభయంతో ప్రయాణించాల్సి వస్తోంది. రాత్రివేళల్లో ఈ ప్రాంతాల్లో ప్రమాదాల ముప్పు మరింత ఎక్కువగా ఉంటోంది.

శాశ్వత మరమ్మతులకు చర్యలేవీ?

రాజీవ్‌ రహదారిపై కొన్నిప్రాంతాల్లో ఏడాది పొడ వునా ఏదో ఒకసందర్భంలో పైపులైన్‌ మరమ్మతులు చేపడుతూనే ఉంటున్నారు. లీకేజీ ఏర్పడినప్పుడల్లా గుంతలు తవ్వడం, తాత్కాలికంగా మరమ్మతులు చేయడం, తిరిగి సమస్య తలెత్తడం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ నిధులు, సిబ్బంది శ్రమ వెచ్చిస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. పైపులైన్ల నాణ్యత, వాటి పరిస్థితి, తరచూ లీకేజీలు ఏర్పడుతున్న ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించి అవ సరమైన చోట పూర్తిస్థాయిలో పైపులైన్ల మార్పిడి చేపట్టాల్సిన అవసరం ఉంది. మరమ్మతులు పూర్తయినవెంటనే రహదా రులను కూడా యథావిధిగా పునరుద్ధరిం చాలి. తవ్వినగుంతలవద్ద ప్రమాద సూచి కలు, తగినరక్షణ ఏర్పాట్లు చేయాలి.

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఏయే వార్డుల్లో ఎన్ని గంటలకు నీటి సరఫరా చేయాలి? ఎక్కడెక్కడ పైపులైన్లు దెబ్బతిన్నాయి? తరచూ లీకేజీలు ఏర్పడుతున్న ప్రాంతాలేవి? అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించాలని, సుల్తానాబాద్‌ ప్రజలకు సక్రమంగా మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:05 AM