Peddapalli : సింగరేణిపై కమ్ముకున్న చీకట్లు
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:08 AM
గోదావరిఖని, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిపై చీకట్లు కమ్ముకొంటున్నాయి.
రూ.50వేల కోట్ల మొండి బకాయిలు...
బొగ్గు తీసినా అమ్మలేని స్థితిలో ’నైనీ’
వార్షిక ఉత్పత్తి లక్ష్యానికి దూరంలో సింగరేణి
బొగ్గు నిల్వలు, లాభాల లెక్కల్లో గందరగోళం...
ఆందోళన చెందుతున్న సంఘాలు, కార్మికులు...
గోదావరిఖని, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిపై చీకట్లు కమ్ముకొంటున్నాయి. 130 సంవత్సరాల అనుభవం, ప్రణాళికబద్ధమైన కార్యనిర్వహణ ఉన్న సింగరేణిలో అంతా లుకలుకలు ఏర్పడుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, ఓసీపీలు, నైనీలో టెం డర్ల అవినీతి ఆరోపణలతో అతలాకుతలమవుతున్న సింగరేణిలో ఉత్పత్తి సాధించడం, మార్కెటింగ్, నాణ్యతను పెంచుకోవడం లాంటి ప్రధానమైన రంగాలు అదుపుతప్పాయి. దీంతో సింగరేణి సంస్థ భవిష్యత్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 76మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఏర్పర్చు కున్న సింగరేణి జనవరి 31నాటికి 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా చేయలేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 22 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ ఈ ఉత్పత్తి సాధ్యమయ్యే పరిస్థితులు అగుపించడం లేదు. 76మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యంలో నాలుగు మిలియన్ టన్నుల బొగ్గు ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి వస్తుందని అంచనాలు వేశారు. నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్ప త్తికి అవకాశాలు ఉన్నప్పటికీ రవాణా పరిస్థితులు లేక పోవడంతో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నైనీ బ్లాక్ నుంచి రోడ్డు మార్గంలో, రైల్వే ద్వారా బొగ్గు రవాణా చేసే రోడ్డు మార్గాలను సింగరేణి ఏర్పర్చుకోవడంలో సింగరేణి వైఫల్యం చెందింది. అందుకు ఒడిశాలోని నైనా ప్రాం తంలో ఉన్న భౌతిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితులు కారణంగా సింగరేణి చెబుతూ వస్తున్నది. ఎనిమిదేళ్ల క్రితం ప్రాజెక్టుకు ప్రణాళికలు చేసి ఆలస్యంగానైనా సంవత్సరన్నర క్రితమే బొగ్గు ఉత్పత్తి ప్రారంభించినా, సింగరేణి బొగ్గును రవాణా చేసేందుకు కనీస ప్రణాళిక లేకుండా ఇప్పుడు నాలుక కర్చుకుంటున్నది. నైనీ బొగ్గును విక్రయించేందుకు కోల్ లింకేజీని ఏర్పర్చుకోవడంలో యాజమాన్యం వైఫల్యం చెందింది. దీనికి తోడు ఇప్పుడు రవాణా టెండర్లు, ఓబీ కాంట్రాక్టు విషయంలో అవినీతి మరకలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ కారణంగా నైనీ నుంచి రావాల్సిన 4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యం కాదు. బొగ్గు నాణ్యత విషయంలో సింగరేణి చూపిస్తున్న ఉదాసీనత కారణంగా సిం గరేణి బొగ్గుకు మార్కెట్‌లో డిమాండ్ కూడా గతంలో లాగా లేదు. ఉత్పత్తి చేసిన బొగ్గును అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్న సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ఒత్తిడి తీసుకురావడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు లక్ష్యాలను సాధించినట్టు, రూ.6వేల కోట్ల లాభం వచ్చినట్టు ప్రకటించుకున్న సింగరేణి సీహెచ్‌పీలు, ఓసీపీల మీద స్టాకు లెక్కలను చూపి ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్టు ప్రకటించుకుందే తప్ప వాస్తవ ఉత్పత్తి ఆ స్థాయిలో లేదనే ఆరోప ణలను సింగరేణి ఎదుర్కొంటున్నది. దీనికి తోడు కోయగూడెం ఓసీ-3, సత్తుపల్లి ఓసీ-3 రెండేళ్ల క్రితం ప్రైవేట్‌పరం కావడం, సింగరేణి ప్రాంతంలోని మరో మూడు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం టెండర్లకు సిద్ధం కావడంతో సంస్థ తన పరిధిలోనే భవిష్యత్‌ను కోల్పోతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను కాపాడుకోవడం, బొగ్గు నాణ్యతను పెంచుకోవడం, మార్కెట్‌లో నిల బడడం లాంటి అనేక సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్న సింగరేణికి అవినీతి ఆరోపణల గ్రహణం పట్టుకున్నది. దీంతో సింగరేణి యాజమాన్యం సంస్థపై తన పట్టును కోల్పోయిందని, రాజకీయ జోక్యాలు అధికమయ్యాయనే అభద్రత కూడా సింగరేణి కార్మికవర్గంలో పెరిగిపోతున్నది.
ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఒక వైపు ఎదుర్కొంటున్న సింగరేణికి రూ.50వేల కోట్ల మొండి బకాయిలు రాచపుండులా తయారయ్యాయి. ఒకప్పుడు రూ.8వేల కోట్ల బాండ్లను కలిగి ఉన్న సింగరేణి ఇప్పుడు వేతనాలు చెల్లించడం కూడా కత్తిమీద సాములా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలకు బొగ్గు, విద్యుత్ విక్రయించిన డబ్బులు రావాల్సి ఉంది. ఈ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడం కారణంగా ఒత్తిడి చేసి డబ్బులు అడిగే పరిస్థితి సింగరేణికి లేదు. పైగా సింగరేణి విద్యుత్, బొగ్గు ఉత్పత్తి అత్యధికంగా జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌టీపీసీలకే ఉండడం సింగరేణికి బకాయి వసూళ్లకు ఇబ్బందిగా మారాయి. రెండేళ్ల క్రితం వరకు రూ.25వేల కోట్లు ఉన్న బకాయిలు రెండేళ్లలో రూ.50వేల కోట్లకు చేరాయి. ఇదే పరిస్థితులు మరో రెండేళ్లు కొనసాగితే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం కానున్నది. ఈ పరిణా మాలను గమనిస్తున్న సింగరేణిలోని కార్మిక సంఘాలు, కార్మికులు అభద్రతకు, ఆందోళనకు లోనవుతున్నారు.
సింగరేణికి అంతర్గతంగా ఉన్న సమస్యలను వదిలేసి అనేక కొత్త రంగాలకు విస్తరించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజస్థాన్‌లో సోలార్, కర్ణాటకలో బంగారం తవ్వకాలు, అంత ర్జాతీయంగా రేర్ ఎర్త్ ఖనిజాలను వెలికి తీస్తామనే ప్రయోగాత్మక చర్యలు చేపట్టింది. సమస్యల నుంచి బయట పడకుండా ఇతర రంగాల వైపు వెళ్లడం సింగరేణి భవిష్యత్ సంక్లిష్టంగా మారే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సంస్థాగతంగా ఉండే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికబద్దమైన, పటిష్టమైన చర్యలకు పూనుకోవాలని, రూ.50వేల కోట్ల బకాయిలను వసూలు చేసేందుకు అవసరమైతే అనుబంధంగా ఓ ఏజెన్సీనైనా ఏర్పాటు చేసుకోవాలని పలువురు చర్చించుకుంటున్నారు.