Share News

Peddapalli: ఎల్‌నినోను దాటి 44,300ఎకరాల్లో సాగు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:07 AM

ఓదెల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నడుమ వానకాలం పంటలను పూర్తిచేసి మండల రైతులు విజయవంతమయ్యారు.

Peddapalli:   ఎల్‌నినోను దాటి 44,300ఎకరాల్లో సాగు
నాంసానిపల్లి చెరువు నిండ నీటి నిల్వలు

- ఓదెల మండల రైతుల్లో సంతోషం..

- యాసంగిపై ఆశలు.. ఆందోళనలు

- చెరువులు,కుంటల్లో పుష్కలంగా నీటినిల్వలు

- వరిసాగు తగ్గించాలని అధికారుల సూచనలు

ఓదెల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నడుమ వానకాలం పంటలను పూర్తిచేసి మండల రైతులు విజయవంతమయ్యారు. ఈ సీజన్‌లో సుమారు 44,300ఎకరాల్లో వివిధపంటలు సాగు చేసి, దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు. గత ఆగస్టు,సెప్టెంబరు నెలల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువులు,కుంటలు నిండిపోయాయి. దీంతో భూగర్భ జలాలపైనా కొంత భరోసా ఏర్పడింది. దీంతో వానాకాలం సాగుపై ఎల్‌నినో ప్రభావం పెద్దగా కనిపించలేదని రైతులు పేర్కొంటున్నారు. అయితే యాసంగి సీజన్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందా? వర్షాభావం, నీటి కొరత, విద్యుత్‌సమస్యలను అధిగమించి పంటలను గట్టెక్కించగలమా? అన్న ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి.

ఆందోళనలు నెలకొన్నప్పటికీ..

మండలంలో వానాకాలం సీజన్‌లో సుమారు 44,300ఎకరాల్లో పంటలు సాగుచేసినట్లు అంచనా. ఇందులో సన్న,దొడ్డు రకాల వరి కలిపి 21,600ఎకరాల్లో సాగు చేయగా,4700ఎకరాల్లో పత్తి పంట వేశారు. ఇతర విస్తీర్ణాల్లోనూ వివిధపంటలు సాగు చేశారు. సీజన్‌ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ, ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. చెరువులు, కుంటల్లో నీరు చేరడంతో సాగునీటికి కొంత ఇబ్బంది తప్పింది. వరిపంటలు సైతం ఆశించినస్థాయిలో ముందుకుసాగడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు.

యాసంగిపై ఎల్‌నినో గండం..!

వానకాలం సాగు విజయవంతం కావడంతో రైతులు ఇప్పుడు యాసంగి పంటలపై దృష్టి సారించారు. ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు సమృద్ధిగా కనిపిస్తున్నప్పటికీ, రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలు తగ్గడం,భూగర్భ జలమట్టాలు పడిపోవడం,బోర్లు,బావుల్లో నీటి లభ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు రైతులు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత నీటినిల్వలను చూసి రైతులు వరిసాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. గత సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం పెద్దగా కనిపించకపోవడం కూడా వారిలో ధైర్యాన్ని నింపుతోంది. మరోవైపు,భవిష్యత్తులో నీటికొరత ఏర్పడితే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో యాసంగిలో వరి సాగు ఎంత మేరకు చేపట్టాలన్న అంశంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

50 శాతం వరకు తగ్గే అవకాశం

ఎల్‌నినో ప్రభావం,సాగునీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనడంతో ఈ యాసంగిలో మండలంలో వరి సాగు గతంలో కంటే సుమారు 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, మండలంలో అధికంగా ఆరుతడి పంటల సాగు భూములు యోగ్యకరంగా లేకపోవడం వల్ల, అలాగే నీటి నిల్వలు ప్రస్తుతం అనుకూలంగా ఉండటంతో కొందరు రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎదురైన సమస్యల నేపథ్యంలో ఈసారి ధాన్యం విక్రయాల విషయంలోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విద్యుత్‌..సాగునీటి ప్రభావం

యాసంగి సీజన్‌లో వరి సాగుకు ప్రధానంగా సాగునీరు, నిరంతర విద్యుత్‌సరఫరా కీలకం. అయితే,రానున్న రోజుల్లో నీటిలభ్యత తగ్గే అవకాశాలతోపాటు విద్యుత్‌ సరఫరాపైనా అనిశ్చితి నెలకొంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి,సరఫరాలో సమస్యలు తలెత్తితే వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ అందుతుందా?అన్న ప్రశ్నలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - Nov 02 , 2026 | 12:07 AM