Peddapalli: భారీ వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:19 AM
గోదావరిఖని, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భారీవర్షం కారణంగా సింగరేణి రామ గుండం రీజియన్‌లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
ఒక్క రోజులో నిలిచిన 57 వేల టన్నుల బొగ్గు
గోదావరిఖని, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భారీవర్షం కారణంగా సింగరేణి రామ గుండం రీజియన్‌లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రీజియన్ పరిధిలోని నాలుగు ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి బొగ్గు వెలికితీత పూర్తిగా నిలిచిపోయింది. ఆర్జీ-1పరిధిలోని ఓసీపీ-5ప్రాజెక్టులో 8000టన్నులు, ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3ప్రాజెక్టులో 23,600 టన్నులు, ఆర్జీ-3ఏరియాలోని ఓసీపీ-1లో 14,800టన్నులు, ఓసీపీ-2నుంచి 11,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్ప డింది. డంపర్లు, డోజర్లు, షవల్స్ వంటి భారీ యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపో యాయి. క్వారీలో వరదనీరు చేరింది. వరద నీటిని పంపులతో బయటకు పంపే పనులను చేపట్టారు. ఓసీపీ-1,-3ల నుంచి ఎన్‌టీపీసీకి బుధవారం 24వేల టన్నుల నిల్వ బొగ్గు రవాణా జరిగింది. ఓబీ వెలికితీత పనులకు అంతరాయం ఏర్ప డింది. మరో రెండు రోజులు ఇదేవిధంగా భారీ వర్షాలు కురిస్తే ఉత్పత్తి భారీగా దెబ్బ తినే అవకాశం ఉన్నది.
ఓసీపీ-2లోకి భారీగా వరదనీరు
రామగిరి : సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ పరిధీలోని ఓసీపీ-2క్వారీలో భారీగా వరదనీరు చేరుకుంది. ఓసీపీ-2 క్వారీ నుంచి పంచ్ ఎంట్రీ సోరంగమార్గం 3సీమ్ ద్వారా పనిస్థలాలకు వెళ్లిన కార్మి కులు తిరిగి క్వారీకి వచ్చేందుకు అప్రోచ్ రోడ్డు వరదనీటి ఉధృతి తెగిపోవడంతో కార్మికులు ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక 3సీమ్ వద్ద గల రెస్ట్‌షెల్టర్ లో బిక్కుబిక్కుమంటూ రెండుగంటల పాటు గడిపారు. విషయం తెలుసుకున్న ఆర్జీ-3 జీఎం మధుసూదన్, అధికారులు హుటహూటిన క్వారీలోకివెళ్లారు. 3వ సీమ్‌కు ప్రధాన రహదారిలో యంత్రాల సహయంతో తాత్కాలికంగా రోడ్డు పునరుద్దరించే పనులు చేపట్టారు. దీంతో కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేశారు. తొలుత 17మంది కార్మికులు 3సీమ్‌లో చిక్కుకుపోయారంటూ విస్తృతంగా ప్రచారంజరగడంతో పెద్దసం ఖ్యలో కార్మికులు క్వారీకి తరలివెళ్లారు.
ఫ మునిగిన డోజర్-19, మ్యాన్‌వే కార్యాలయం
సింగరేణి ఆర్జీ-3 డివిజన్‌పరిధిలోని ఓసీపీ-2 క్వారీలో మంగళవారం రాత్రి బ్రేక్‌డౌన్ అయ్యింది. డోజర్ మరమ్మతుకు సమయంపట్టే అవకాశం ఉన్న నేపథ్యం లో క్వారీలోనే విడిచి వెళ్లడంతో వరద నీటిలో మునిగిపోయింది. కాగారాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా క్వారీ లో నార్త్‌ఫేస్‌లో నిలిపిఉంచిన డోజర్ వరద నీరులో మునిగిపోయింది. దీంతో పాటుగా ఓసీపీ-2మ్యాన్‌వే కార్యాలయం మోకాళ్ల వరకు వరద నీరు నిలిచి ఉంది.