Share News

Peddapalli: ఇష్టారాజ్యంగా చికెన్‌ టెండర్లు

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:54 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) జిల్లాలో ఆరు సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలకు నిర్వహించిన టెండర్లలో చికెన్‌ సరఫరా చేసేందుకు

Peddapalli:  ఇష్టారాజ్యంగా చికెన్‌ టెండర్లు

- పేపర్‌ ధరపై కిలోకు రూ.7.50అదనం

- కొందరు తక్కువ ధర కోట్‌ చేసినా దక్కని టెండర్లు

- విద్యార్థులకు నష్టం చేకూరే అవకాశం

- ఎస్సీ గురుకులాల టెండర్ల తీరు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో ఆరు సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలకు నిర్వహించిన టెండర్లలో చికెన్‌ సరఫరా చేసేందుకు అడ్డగోలు ధరకు కాంట్రాక్టర్లకు అధికారులు కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. రోజువారీగా న్యూస్‌పేపర్లో వచ్చే ధరపై అదనంగా ఏడు రూపాయల 50పైసలు చెల్లించే విధంగా టెండర్లను అధికారులు కట్టబెట్టడంపై పలువురిని విస్మయానికి గురిచేస్తున్నది. పేపర్‌ ధర కంటే తక్కువ ధరకు చికెన్‌ సరఫరా చేసేందుకు పలువురు కాంట్రాక్టర్లు టెండర్‌ బిడ్‌ వేసినప్పటికీ వారిని కాదని ఎక్కువ ధరకు బిడ్‌ వేసిన కాంట్రాక్టర్లకు అదనంగా కిలోకు 7.50రూపాయలు చెల్లించే విధంగా టెండర్లు కట్టబెట్టారని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. వారంలో నాలుగు రోజులపాటు విద్యార్థులకు చికెన్‌తో భోజనాలు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో గురుకుల విద్యాలయంలో 500నుంచి 650మంది వరకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కిలో చికెన్‌పై 15నుంచి 20రూపాయల వరకు కొత్త టెండర్ల ప్రకారం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వస్తుండడంతో నెలకు 8వేల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఫ ఆరు ఎస్సీ గురుకుల విద్యాలయాలకు టెండర్లు..

జిల్లాలోని ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మల్లాపూర్‌ బాలికలు, గర్రెపల్లి బాలికలు, నందిమేడారం బాలికలు, రామగుండం బాలికలు, మంథని బాలురు, పెద్దపల్లి బాలురు గురుకులపాఠశాలలకు ఏడాదికిగాను కూరగాయలు పండ్లు, క్యాటరింగ్‌, మటన్‌ చికెన్‌, స్టేషనరీ వస్తువులు, ల్యాబ్‌మెటీరియల్‌, స్లీపింగ్‌ శానిటేషన్‌కోసం టెండర్లను ఈనెల 12వ తేదీన ఆహ్వానించారు. టెండర్లు దాఖలు చేసేందుకు 19వతేదీ వరకు గడువు ఇచ్చారు. 20వ తేదీన టెండర్లను ఓపెన్‌ చేసి కేటగిరీల వారీగా కాంట్రాక్టర్లకు టెండర్‌ను అప్పగించారు.

ఫ అడ్డగోలు ధరకు చికెన్‌ టెండర్లు..

ఈ టెండర్లలో చికెన్‌ సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు అడ్డగోలు ధరకు కట్టబెట్టారు. ఈ టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు కిలోకు అతి తక్కువ ధర 198 రూపాయలు, అంతకంటే ఎక్కువ 250రూపాయల వరకు టెండర్‌ కోట్‌ చేసినట్లు సమాచారం. కొంతమంది కాంట్రాక్టర్లు పేపర్‌ రేటు కంటే తక్కువకే టెండర్లు వేశారని సమాచారం. అయితే పేపర్‌ రేటుకు మించి ఎవరు టెండర్‌ వేయకపోయినా అధికారులు మాత్రం కిలోకు అదనంగా 7.50రూపాయలకు టెండర్‌ ఇచ్చారని తెలుస్తున్నది. ఇదే ఎస్సీ నందిమేడారం బాలుర గురుకుల విద్యాలయానికి కిలోకు 198రూపాయలకే సరఫరా చేసేందుకు టెండర్‌ ఖరారు చేశారు. మహాత్మాగాంధీ జ్యోతిబాఫూలే గురుకుల విద్యాల యాలకు కిలోచికెన్‌కు 230రూపాయలు ఖరారు చేశారు. కానీ ఈ ఆరు గురుకుల విద్యాలయాలకు మాత్రం అధికంగా టెండర్‌ కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. టెండర్‌దాఖలు చేసేందుకు జీఎస్టీ, ట్రేడ్‌లైసెన్స్‌, రెండు సంవత్సరాల ఐటీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ, రెండేళ్ల అనుభవం ఉన్న వాళ్లు అర్హులుగా పేర్కొన్నారు. అయితే ఆ అర్హతలేమి పట్టించు కోకుండానే కొందరికి అనర్హులకు, ఎక్కువగా స్థానికులను కాదని స్థానికేతరులకు టెండర్లు ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.

ఫ విద్యార్థులకు చేకూరనున్న నష్టం..

మార్కెట్‌ ధరలకు మించి ఆహార పదార్థాల సరఫరాకు అధిక ధరలు చెల్లించడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ చార్ట్‌ ప్రకారం విద్యార్థులకు టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్‌ అందకపోయే ప్రమాదం ఉంది. గురుకుల విద్యాలయాల్లో మూడునుంచి ఏడవతరగతి చదివే విద్యార్థులకు నెలకు 1330 రూపాయలు, 8నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 1540రూపాయలు, ఇంటర్‌ నుంచి పీజీవరకు చదివే విద్యార్థులకు 2100రూపాయలు మెస్‌చార్జీల కింద చెల్లించ నున్నారు. ఈ డబ్బులను టిఫిన్‌, భోజనాలు, స్నాక్స్‌ కోసం కావాల్సిన కిరాణ సరుకులు, కూరగాయలు, పండ్లు, చికెన్‌, మటన్‌, కోడిగుడ్లు, ఇతరత్రా సరఫరాదారులకు చెల్లించ నున్నారు. అయితే సంబంధిత అధికారులు టెండర్లను ఖరారు చేసే ముందు మార్కెట్‌ ధరలను విశ్లేషించుకుని, తక్కువ, ఎక్కువ ధరకు గాకుండా మధ్యరకం ధరలను కోట్‌ చేసేవారికి టెండర్లు కట్టపెట్టాల్సి ఉంటుంది. కానీ చికెన్‌ సరఫరా విషయంలో ఆ విధంగా వ్యవహరించలేదని తెలుస్తున్నది. దీంతో విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ స్పందించి మరోసారి టెండర్లను సమీక్షించి పేపర్‌ ధర కంటే తక్కువధరకు చికెన్‌ సరఫరా చేసే స్థానిక కాంట్రాక్టర్లకే టెండర్లు కట్టబెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:54 AM