Peddapalli: రామగుండం అభివృద్ధికి రూ.248కోట్ల వార్షిక బడ్జెట్
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:24 AM
కోల్‌సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థికసంవత్సరానికి రూ.248.66కోట్లతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
చర్చ లేకుండానే ఆమోదం తెలిపిన పాలకవర్గం
కోల్‌సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థికసంవత్సరానికి రూ.248.66కోట్లతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా చర్చ లేకుండానే అధికార, విపక్షాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. 2027మార్చి నాటికి రూ.28.08కోట్ల మిగులు ఉంటుందని అంచనావేశారు.గతసంవత్సరం రూ.246.47 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈ ఏడాది రూ.2కోట్లు పెంచి రూ.248.66కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. కాగా 2025-26 వార్షికబెడ్జెట్ రూ.246.47కోట్లు ఉండగా ఆశించిన ఆదాయం రాకపోవడంతో సవరించిన బడ్జె ట్‌ను రూ.110.25కోట్లకు ప్రతిపాదించగా పాలకవర్గం ఆమోదం తెలిపింది. అలాగే 2026-27ఆర్థిక సంవత్సరా నికి ప్రారంభ నిల్వ రూ.25కోట్లతో పాటు ఆదాయం రూ.221కోట్లుగా లెక్కగట్టారు. దీనిలో గ్రాంట్ల రూపం లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.169కోట్లు ఆదాయం వస్తుందని అంచనావేశారు. ఇందులో పన్ను లు, ఆస్థిపన్నులు, అనుమతుల రూపంలో రూ.45.46 కోట్లు వసూళ్లు అవుతాయని అంచనా వేశారు. ఇందులో భవన నిర్మాణ అనుమతులు టౌన్ ప్లానింగ్ నుంచి రూ.12.19 కోట్లు, అద్దెలు, ఫీజుల ద్వారా రూ.1.72 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ.21.2 కోట్లు, ఇం జనీరింగ్ విభాగం లో రోడ్ కటింగ్‌లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రూ.7.15కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
వేతనాలకు రూ.16కోట్లు,
కుక్కలు, కోతులు పట్టేందుకు రూ.30లక్షలు..
రామగుండం నగరపాలక సంస్థ బడ్జెట్‌లో వ్యయాన్ని రూ.220.57కోట్లుగా అంచనా వేశారు. రూ.28కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుందని లెక్కగట్టారు. ఇందులో కార్మికుల వేతనాలకే రూ.16కోట్లు పెట్టారు. కుక్కలు, కోతులు, పందులు పట్టేందుకు రూ.30లక్షలు, పారిశుధ్య సామాగ్రి కొనుగోలుకు రూ.10 లక్షలు, వాహనాల డీజిల్, పెట్రోల్‌కు రూ.3కోట్లు అంచనా వేశారు. మొత్తంగా పారిశుధ్య విభాగానికి రూ.6.75కోట్లు, విద్యుత్‌చార్జీలకు రూ.2.45 కోట్లు, విద్యుత్‌బకాయిలు చెల్లించేందుకు రూ.2కోట్లు కేటాయించారు. గ్రీన్ బడ్జెట్‌కు 10శాతం నిధులు కేటాయించా లనే నిబంధనతో రూ.31.57 కోట్లు కేటాయించారు.
ఫ రామగుండాన్ని సుందరనగరంగా
అభివృద్ధి చేస్తాం..
- మేయర్ మహంకాళి స్వామి
రామగుండం నగరాన్ని అన్నిరంగాల్లో సుందర నగరంగా అభివృద్ధి చేస్తామని మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. ఇందుకు పాలకవర్గం సహకరిం చాలని కోరారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువస్తున్నారని, అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు.