Peddapalli: షడ్రుచుల సమ్మేళనమే.. ఉగాది
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:33 AM
కోల్‌సిటీటౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. తెలుగు నూతన సంవత్సర ఆరంభం చైత్రశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది.
ప్రకృతితో మమేకమే మన తెలుగు పండుగ
నేటి నుంచి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం
కోల్‌సిటీటౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. తెలుగు నూతన సంవత్సర ఆరంభం చైత్రశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. పురణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైంది. కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాదిగా జరుపుకుంటారు. యుగ+ఆది యుగాది లేదా ఉగాది (కొత్తకాలం/సృష్టి ప్రారంభం)గా దీనిని పిలుస్తారు. ఈరోజున వసంతరుతువు మొదలవు తుంది. ఈ ఏడాదినే పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. తీపి, పులుపు, కారం, చేదు వంటి 6రుచుల ఉగాది పచ్చడితో జీవితంలోని కష్టసుఖాలను స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదిని పరాభవనామ సంవత్సరంగా(ఉగాది) పిలవనున్నారు.
ఉగాది పండుగ విశిష్టత: హిందూ సంప్రదాయం ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ వేళ సృష్టిని సృష్టించడం ప్రారంభించాడని విశ్వాసం. ఇది తెలుగు వారి క్యాడెండర్ (చాంద్రమానం) ప్రకారం మొదటి రోజునే తెలుగు నూతనసంవత్సరం ప్రారంభమవుతుందని పండితులు చెపుతున్నారు.
ఉగాది పచ్చడి ప్రత్యేకత: షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. వేపపువ్వు(చేదు), బెల్లం(తీపి), మామిడికాయ(వగరు), చింతపండు (పులుపు), కారం, ఉప్పుతో చేసే పచ్చడిని తింటారు. ఇది జీవితంలోని కష్టసుఖాలు, ఆనందాలను సమదృష్టితో స్వీకరించాలని సూచిస్తుందని పండితులు చెపుతున్నారు.
పంచాంగ శ్రవణం: పండితుల ద్వారా కొత్త సంవత్సరంలో రాశుల ఫలితాలు, వర్షాలు, పంటలు, రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుంటారు.
పురాణ విశిష్టత: శ్రీరాముడి పట్టాభిషేకం ఈ రోజునే జరిగిందని, విష్ణుమూర్తి మత్స్యావతారంలో సోమకాసురుడిని చంపి వేదాలను కాపాడిన రోజుగా కూడా దీనిని భావిస్తారు. ఇక ఈ ఉగాది పచ్చడి తయారీలో వాడే ఒక్కొ పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీకగా సూచిస్తారు.
ముస్తాబయ్యే ఇళ్లు, వాకిళ్లు, పిండివంటలు..
ఉగాది రోజు వేకువజామునే తలస్నానం చేసి కొత్త వస్ర్తాలు ధరిస్తారు. అలాగే గుమ్మానికి మామిడి ఆకు తోరణాలు, వాకిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తాం. ఉగాది నాడు ఇష్ట దైవానికి పూజ చేసుకున్నాక ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. జీవితంలో ఎదురయ్యే అన్నింటిని కూడా సమానంగా చూడాలని ఉద్దేశ్యంతో ఉగాదిని జరుపుకోవడం జరుగుతుందని పండితులు చెపుతున్నారు.
నేటి నుంచి చైత్ర నవరాత్రులు..
చైత్రశుద్ధ పాడ్యమిరోజున ఉగాదితోపాటు చైత్రనవరాత్రులు ప్రారంభ మవుతాయి. దీనిని లలితాదేవి నవరాత్రులు అని కూడా చెపుతారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ పండుగ దుర్గామాత తొమ్మిదిరూపాలను పూజిస్తారు. అంతేకాకుండా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లలితాదేవిని ఆరాధిం చాడని పురాణాలు చెబుతున్నాయి.