పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:59 PM
కమిషనరేట్ వ్యాప్తంగా రాత్రి, పగలు తేడా లేకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పోలీసు అధికారులను సీపీ గౌస్ ఆలం ఆదేశించారు.
కరీంనగర్ క్రైం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): కమిషనరేట్ వ్యాప్తంగా రాత్రి, పగలు తేడా లేకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పోలీసు అధికారులను సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో సీపీ గౌస్ ఆలం అధ్యక్షతన నెలవారీ నేర సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, తీవ్రమైన నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. మహిళా పోలీస్ సిబ్బందికి బ్లూ కోల్ట్స్ విధులను కేటాయించాలని, షీ టీంల ద్వారా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు.
ఫ నేపాలీ కార్మికుల వివరాల నమోదు.....
కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న వెయ్యి మందికి పైగా ఉన్న నేపాలీ కార్మికుల వివరాలను పోలీస్ స్టేషన్ల వారీగా రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. హోటళ్లు, లాడ్జీల్లో సరైన గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు సరిచూసుకున్న తర్వాతే గదులు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యాంకులు, జ్యువెలరీ వ్యాపార సంస్థల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి భద్రతా ప్రమాణాలపై సూచనలు చేయాలన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, పాత కెమెరాల జియో-ట్యాగింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం కోర్టు అధికారులతో నిర్వహించిన సమీక్షలో... ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీపడే కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు.