Share News

దోపిడీకి పాల్పడింది.. పాట్నా గ్యాంగ్‌

ABN , Publish Date - May 06 , 2026 | 12:58 AM

పీఎంజే జ్యువెలర్స్‌లో దోపిడీకి పాల్పడింది బిహార్‌ పాట్నా గ్యాంగ్‌ అని పోలీసులు గుర్తించారు.

 దోపిడీకి పాల్పడింది.. పాట్నా గ్యాంగ్‌

- ముగ్గురు నిందితుల గుర్తింపు

- ఘటనపై ముఖ్యమంత్రి, డీజీపీ ఆరా ...

- 15 ప్రత్యేక బృందాలతో గాలింపు

- బిహార్‌, మహారాష్ట్రకు పోలీసు బృందాలు

- ఐదుగురు పిస్టల్స్‌తో నగరంలోకి ప్రవేశించినా పసిగట్టని పోలీసులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పీఎంజే జ్యువెలర్స్‌లో దోపిడీకి పాల్పడింది బిహార్‌ పాట్నా గ్యాంగ్‌ అని పోలీసులు గుర్తించారు. ఐదుగురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొనగా వారిలో ముగ్గురిని మధు, ఇంతియాజ్‌, ఆనంద్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గతంలో రాష్ట్రంలో జరిగిన నేరాలతో సంబంధం ఉన్న పాత నేరస్తుల పొటోల ఆధారంగా వీరిని గుర్తించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఈ సంఘటనపై ఆరా తీసి ప్రత్యేక బృందాలను నియమించి వీలైనంత త్వరలో దొంగలను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ గౌస్‌ ఆలం కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో 15 ప్రత్యేక పోలీసు బృందాలు దొంగల కోసం గాలిస్తున్నాయి. 150 మంది పోలీసులు దొంగల ఆచూకీ కోసం జిల్లా కేంద్రం నుంచి ఇతర జిల్లాలకు, రాషా్ట్రలకు పారిపోయే అవకాశాలున్న రహదారులపై గాలింపు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.

ఫ ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌తో..

దోపిడీకి ముందు జగిత్యాల జిల్లా ధర్మపురిలో రెండు రోజులు దొంగలు మకాం వేసి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనంచేసి పారిపోతూ ధర్మపురి పుష్కరఘాట్‌ వద్ద టీఎస్‌ 09 ఎఫ్‌జీ 6876 పల్సర్‌ బైక్‌ను, హెల్మెట్‌ను వదిలి వెళ్లారు. ఈ నంబర్‌ను వాహన యాప్‌లో పరిశీలిస్తే సికింద్రాబాద్‌లోని ఓ కారుకు సంబంధించినదని తేలింది. ఛాసిస్‌ నంబర్‌తో ఆరా తీసి ఆ బైక్‌ ఢిల్లీకి చెందినదని గుర్తించారు. దొంగలు ఉపయోగించిన మరో బైక్‌ మంచిర్యాల జిల్లా కలమడుగు మీదుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యమంత్రి, డీజీపీ ఈ సంఘటనపై దృష్టి సారించడంతో హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ పోలీస్‌ టీమ్‌లు విమానంలో బీహార్‌, మహారాష్ట్రకు వెళ్లాయి. కర్నాటక రాష్ట్ర పోలీసు అధికారులతో మాట్లాడి వారితో సమన్వయం ఏర్పరచుకొని కేసును చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఫ కరీంనగర్‌లో భద్రతా వైఫల్యం

రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నగరంగా వేగంగా విస్తరిస్తూ అభివృద్దిచెందుతున్న కరీంనగర్‌ను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా గుర్తించింది. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఆధునిక హంగులు కల్పించి స్మార్ట్‌సిటీ, సేఫ్‌ సిటీగా ప్రకటించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. జిల్లాకేంద్రంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కమాండ్‌ సెంటర్‌లో కూర్చొని గుర్తించవచ్చని చెప్పారు. పాత నేరస్తులు ఎవరైనా ఈ ప్రాంతంలో సెన్సార్ల పరిధిలో పర్యటించినపుడు కమాండ్‌ సెంటర్‌కు అలారం వస్తుందని అన్నారు. పీఎంజే జ్యువెలర్స్‌లో ఉదయం పూటే కాల్పులు జరిపి నిర్భయంగా నగలతో బైక్‌లపై దొంగలు పారిపోయారు. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. పాత నేరస్తులుగా వారిని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నా కమాండ్‌ సెంటర్‌లో అలారం మోగకపోవడం, పట్టణంలో ఏర్పాటు చేసిన పలు సీసీ కెమెరాలు పనిచేయక పోయినా పట్టించుకునే వారే లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు కరీంనగర్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించామని సీపీ చెప్పారు. ఆదివారం ఉదయమే ఐదుగురు దుండగులు పిస్టల్స్‌తో కరీంనగర్‌లో తిరగడం భద్రతా వైఫల్యమేననే విమర్శలు వస్తున్నాయి.

ఫ ద్విచక్ర వాహనం, హెల్మెట్‌ గుర్తింపు

జగిత్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెలర్స్‌ దోపిడీకి పాల్పడ్డ నిందితులు ఉపయోగించిన ఓ ద్విచక్ర వాహనం, హెల్మెట్‌ను మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి శివారులోని గోదావరి వద్ద పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌ నుంచి పారిపోతూ దొంగల ముఠా సభ్యులు ద్విచక్ర వాహనాన్ని, హెల్మెట్‌ను ధర్మపురి గోదావరి సమీపాన వదిలివెళ్లారు. టీఎస్‌ 09ఎఫ్‌ జీ6876 నంబరు గల ద్విచక్ర వాహనం, సమీపంలో బ్లూ రంగు హెల్మెట్‌ను పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఒక లాడ్జీలో దుండగుల ముఠా బస చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురి గోదావరి తీరం పక్కనే ఉన్న ఓ లాడ్జిలో ఈనెల ఒకటో తేదీన దొంగల ముఠా సభ్యులు రెండు రోజులు ఉన్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి ఈనెల 1న నలుగురు వ్యక్తులు లాడ్జిలో బస చేశారు. మరుసటి రోజు ఉదయం ఒకరు, సాయంత్రం మరొకరు వచ్చి వీరితో జత కలిశారు. లాడ్జి యజమానితో మాట్లాడి మరో గదిని బుక్‌ చేసుకున్నారు. ఈనెల 3న ఉదయం లాడ్జీని ఖాళీ చేసినబైక్‌లపై కరీంనగర్‌ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ధర్మపురిలో దొంగల ముఠా సభ్యులు బస చేసిన లాడ్జీలో పోలీసులు సోదాలు చేశారు. దోపిడీ ముఠా ప్రయాణించినట్లు అనుమానించి దారి పొడవునా పలు సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సంబంధిత టవర్‌ ఏరియాలో ఆ సమయంలో ఫోన కాల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కాగా రెక్కీ చేసిన తర్వాతనే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Updated Date - May 06 , 2026 | 12:58 AM