కరీంనగర్‌పైనే పార్టీల దృష్టి
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:15 AM
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన కైవసం చేసుకోవడాన్ని అన్ని రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
- బీజేపీ ప్రచార సారధిగా బండి సంజయ్
- కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు
- గులాబీ దండుకు గంగుల, వినోద్ అండ
- హోరెత్తుతున్న ప్రచారం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన కైవసం చేసుకోవడాన్ని అన్ని రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అన్ని పార్టీలు ప్రచార దూకుడును పెంచాయి. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి జిల్లాలో పర్యటించి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్పొరేషనపై దృష్టిసారించింది.
ఫ కార్నర్ మీటింగ్‌లు, సభలతో బీజేపీ
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ కార్పొరేషనపై బీజేపీ కాషాయ పతాకాన్ని ఎగురవేస్తామని అందరికంటే ముందుగానే ప్రకటించారు. రెండునెలలుగా వ్యూహ రచన చేసి అభ్యర్థుల ఎంపిక నుంచి అన్ని డివిజన్లలో ప్రచారం వరకు అన్ని బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్నారు. ప్రచార రథంపై ఉదయం కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇతర మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తూ సాయంత్రానికి కార్పొరేషనకు చేరుకుని రోజూ ఐదు నుంచి 10 డివిజన్లలో కార్నర్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోని అన్ని విభాగాల నుంచి శ్రేణులను దింపి ఆయా డివిజన్లలోనే మకాం వేయించి ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంతో నిమగ్నమయ్యారుు. 66 డివిజన్లలో సింగిల్‌గానే మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారాన్ని చేపడతామని సంజయ్‌కుమార్ ప్రకటించారు.
ఫ మంత్రులు అండతో కాంగ్రెస్ ప్రచారం
అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పర్యటన తర్వాత తన ప్రచార వేగాన్ని పెంచింది. జిల్లా ఇనచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రి శ్రీధర్‌బాబు కరీంనగర్‌లో మకాం వేసి రెండురోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వీరి ప్రచారానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గ ఇనచార్జి వెలిచాల రాజేందర్‌రావు, సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తూ డివిజన అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. బీజేపీ వాతావరణం మెరుగవుతుందని గమనించిన అధికారపార్టీ దానిని కట్టడి చేస్తూ తన ఓటింగ్ పెంచుకోవడం కోసం ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నది. మంత్రి శ్రీధర్‌బాబు కార్పొరేషన పరిధిలో వివిధ కుల సంఘాల ప్రతినిధులతో, ఉద్యోగ సంఘాల వారితో, వివిధ వృత్తుల ప్రముఖులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. ఇనచార్జి మంత్రి తుమ్మల కరీంనగర్ కార్పొరేషనలోనే కాకుండా మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలలో ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాపరిధిలోని 13 మున్సిపాలిటీలలో, రెండు కార్పొరేషన్లలో ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ అధికారం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంతరెడ్డి గట్టిగా ఆదేశించడమేకాకుండా అలసత్వంగా, నిరాసక్తంగా ఉన్న కొందరి నాయకులను మందలించినట్లు సమాచారం. కలిసికట్టుగా పనిచేసి విజయానికి కృషిచేయాలని ఆయన ఆదేశించిన తర్వాత ముఖ్యనాయకులందరిలో చలనం వచ్చి ప్రచారంలోకి దిగారని పార్టీశ్రేణులు చెబుతున్నాయి.
ఫ మద్దతు కూడగడుతున్న బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ పక్షాన ఈ ఎన్నికల ఇనచార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కార్పొరేషన పరిధిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు.
ఫ తాము కీలకమంటున్న ఎంఐఎం
ఏ పార్టీకీ ఒంటరిగా అధికారం చేపట్టే స్థానాలు రావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కార్పొరేషన పరిధిలో ఎంఐఎం పాత్ర అలాగే ఇండిపెండెంట్ల పాత్ర కీలకం కానున్నది. ఎంఐఎం కార్పొరేషన పరిధిలో 66 డివిజన్లకు గాను 15 డివిజన్లలో పోటీచేస్తున్నది. 10 నుంచి 12 స్థానాలను దక్కించుకుంటామని, పాలకవర్గ ఏర్పాటులో తామే కీలకం కాబోతున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఫ ప్రలోభాలకు వ్యూహ రచన
మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అన్ని పార్టీలు అప్రమత్తమై తమకు సానుకూలంగా లేని డివిజన్లలో ప్రత్యేక దృష్టితో పనిచేస్తూ దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. మిగిలిన మూడు రోజుల్లో ప్రచారంతోపాటు ప్రలోభాల పర్వాన్నికూడా చేపట్టేందుకు అన్ని పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులకు మొదటి విడత రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆయా పార్టీలు పంపించినట్లు ప్రచారం జరుగుతున్నది. అన్ని పార్టీల్లో టికెట్లను ఆశించి భంగపడ్డ అసమ్మతి నాయకులను పిలిపించి పార్టీ కోసం అభ్యర్థులను గెలిపించుకోవాలంటూ బుజ్జగిస్తున్నారు. స్థానిక నేతలతోపాటు ముఖ్య, అగ్రనేతల రాకతో రాజకీయం వేడెక్కింది.