Share News

పడకేసిన ‘పరిషత్‌’ పాలన

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:19 AM

జిల్లా పరిషత్‌ పాలకవర్గం గడువు ముగిసి రెండేళ్లు గడిచింది. గ్రామాలు, మండలాల అభివృద్ధికి దిశానిర్దేశం చేయాల్సిన జిల్లా పరిషత్‌ నిధుల కొరతతో సతమతమవుతోంది.

పడకేసిన ‘పరిషత్‌’ పాలన

- జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి రెండేళ్లు

- ఎన్నికలు లేక నిలిచిపోయిన నిధుల విడుదల

- పరిష్కారానికి నోచుకోని సమస్యలు

- ముందుకుసాగని అభివృద్ధి పనులు

- నామమాత్రంగా ప్రత్యేక పాలన

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

జిల్లా పరిషత్‌ పాలకవర్గం గడువు ముగిసి రెండేళ్లు గడిచింది. గ్రామాలు, మండలాల అభివృద్ధికి దిశానిర్దేశం చేయాల్సిన జిల్లా పరిషత్‌ నిధుల కొరతతో సతమతమవుతోంది. ఆర్థిక సంఘం గ్రాంట్ల విడుదలకు ప్రజాప్రతినిధుల ఎన్నికలు లేకపోవడం అడ్డంకిగా మారింది. ఒకప్పుడు మినీ అసెంబ్లీగా పేరొందిన జిల్లా పరిషత్‌లు ఇప్పుడు వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి రెండేళ్లు దాటినా కొత్త పాలకవర్గాలు లేకపోవడం ఇబ్బందిని పెంచుతోంది. పరిషత్‌ల పర్యవేక్షణలో కొనసాగాల్సిన పాలన క్రమంగా పడకేస్తోంది. నిలిచిపోయిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి, ఇతర పనుల విషయంలో అస్తవ్యస్తమనే పరిస్థితి జిల్లాలో అగుపిస్తోంది.

ఫ భవిష్యత్తు ప్రశ్నార్థకం..

ఐదారేళ్ల క్రితం జడ్పీ సమావేశాల్లో గ్రామ, మండల స్థాయిలోని కీలకమైన సమస్యలు ప్రస్తావనకు వచ్చి అవి పరిష్కారానికి నోచుకునేవి. ఇప్పుడా పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. ముఖ్యంగా ఎల్‌నినో తీవ్రత కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో తాగునీటి ఎద్దడి నివారణ, భూగర్భజలాల పరిస్థితి, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు ఇలా అన్నింటి విషయంలో సమగ్రమైన చర్చ జరిగేది. తాగు, సాగునీటి పథకాలపై ప్రయోజనకరమైన నిర్ణయాలు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల నుంచి వినిపించేవి. ఇప్పుడా పరిస్థితులు లేకపోవడంతో జిల్లా పరిషత్‌ కార్యాలయం ఉందనే విషయాన్నే అందరు మరిచిపోతున్న దుస్థితి నెలకొంది. 2015-16కు ముందు ఉన్న పరిస్థితితో పోల్చితే దశాబ్దకాలంగా జడ్పీ విధులు, నిధుల పరంగా పూర్తిగా వెనుకబడి పోయింది. రెండేళ్లుగా పేరుకే ఇది ప్రత్యేకాధికారుల పాలన అనే విధంగా పరిస్థితి మారింది. ఆశించిన విధంగా నిధుల తోడ్పాటు లేకపోవడంతో పల్లెల్లో పరిషత్‌ల భాగస్వామ్యం కరవైంది. దీంతో జడ్పీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగానే మారింది.

ఫ మొక్కుబడిగా నిధులు

గత కొన్ని ఆర్థిక సంవత్సరాలుగా జిల్లా పరిషత్‌లకు నిధులు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల నిధుల కేటాయింపుల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం 15, 16వ ఆర్థిక సంఘం నిధుల్లో అత్యధిక భాగాన్ని సుమారు 80 శాతం వరకు నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయిస్తుండడంతో జడ్పీ ఖజానా వెలవెల బోతోంది. మిగతా నిధులు జిల్లా, మండల పరిషత్‌లకు 10 శాతం చొప్పున వచ్చే అవకాశమున్నా పరిషత్‌ ఎన్నికలు లేకపోవడం వల్ల ఆటంకం ఎదురవుతోంది. ఒకప్పుడు జిల్లా పరిషత్‌ ఖజానాకు బీఆర్‌జీఎఫ్‌, సీనరేజీ రుసుములు, పంచాయతీరాజ్‌, ఆర్థిక సంఘం, రాష్ట్ర గ్రాంట్లు, ప్రత్యేక పథకాల నిధులతో ఏడాదికి 40 కోట్లకుపైగా అభివృద్ధి నిధులు జిల్లాకు వచ్చేవి. తరువాత ఈ నిధులకు కోత పడి ఆర్థిక సంవత్సరానికి సుమారు 21 కోట్లకు పరిమితమయ్యాయి. ఇటీవల ఈ నిధుల రాక కూడా లేక స్థానిక సంస్థల్లో పెద్దన్న పాత్రను పోషించాల్సిన జడ్పీ పరిపాలన ఇంతకింతకు క్షీణిస్తోంది. 2024 జూలై 4వ తేదీ నుంచి జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు. పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తే జడ్పీటీసీలు, ఎంపీటీసీల పాలకవర్గాలు అటు మండలంలో ఇటు జిల్లాస్థాయిలో ఏర్పాటైతే ఎంతో కొంత అభివృద్ధి కళ్లముందు కనిపించే అవకాశం ఉంది.

Updated Date - Oct 27 , 2026 | 01:19 AM