Share News

ప్రాణాలు తీస్తున్న... ‘పారాక్వాట్‌ ’

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:37 AM

కలుపు నివారణకు వాడే మందు కాదది... కాలకూట విషం.. 10 మిల్లీలీటర్లు తాగినా ప్రాణాలు పోవడం ఖాయం...

ప్రాణాలు తీస్తున్న... ‘పారాక్వాట్‌ ’

- గడ్డి మందు కాదు.. కాలకూట విషం

- ఎక్కువ శాతం ఆత్మహత్యలకు మందే కారణం

- నిషేధించాలని బాధిత కుటుంబాలు, వైద్యుల డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కలుపు నివారణకు వాడే మందు కాదది... కాలకూట విషం.. 10 మిల్లీలీటర్లు తాగినా ప్రాణాలు పోవడం ఖాయం... సకాలంలో ఆసుపత్రికి తీసుకవెళ్లినా బతికే చాన్స రెండు నుంచి ఐదు శాతమే. బతికినా లివర్‌, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులతో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకున్న తర్వాత ఒకటో, రెండో సంవత్సరాలకు చనిపోవాల్సిందే. ఇది ప్రస్తుతం రైతులు ఉపయోగిస్తున్న గడ్డి మందు పారాక్వాట్‌. ఈ మందును నిషేధించాలని డాక్టర్లు తమ ఇండియన మెడికల్‌ అసోసియేషన (ఐఎంఎ) ద్వారా పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోతున్నది. క్షణికావేశానికి గురైనవారు, అప్పుల బాధతోనో, కుటుంబ గొడవలు, సమస్యలతోనో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 80 శాతం మంది ఈ గడ్డిమందుకే బలైపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో 2001 మంది, 2023లో 1586 మంది, 2024లో 1049 ఆత్మహత్యలకు పాల్పడగా అందులో అత్యధికులు ఈ గడ్డిమందుకే బలైపోయారు. ప్రాణాలు హరిస్తున్న ఈ పారాక్వాట్‌ మందును నిషేధించాలనే డిమాండ్‌ ఉద్యమంగా మారుతున్నది. ఈ మందును నిషేధించాలని ఎంపీ కేఆర్‌ సురేశరెడ్డి ఇటీవల పార్లమెంట్‌లోనూ ప్రస్తావించారు. కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ మర్రి మహేశరెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో గడిచిన నాలుగు నెలల్లో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు, ప్రజలకు ఈ మందు వినియోగం, దాని దుష్పలితాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు కూడా సమర్పించారు. ఇప్పుడిప్పుడే జిల్లాలో కూడా బాధిత కుటుంబాలకు చెందిన వారు ఈ గడ్డిమందు నిషేధానికి డిమాండ్‌ చేస్తూ ముందుకువస్తున్నారు.

ఫ 10 మిల్లీలీటర్లు తాగినా..

పారాక్వాట్‌ మందు 10 మిల్లీలీటర్లు తాగితే ప్రాణాలు దక్కే అవకాశాలు ఏమాత్రం ఉండవు. 95 నుంచి 98 శాతం మంది చికిత్స పొందుతూ చనిపోతున్నారు. బతికినవారు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులతో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి చికిత్స చేయించుకున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఊపిరితిత్తులు గట్టిపడి శ్వాసతీసుకునే అవకాశాలు లేక మృతి చెందుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినడం, కాలేయం సమస్యతో కామెర్లు తదితర వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మందును తాగడమే కాదు.. గట్టిగా వాసన పీల్చినా సదరు వ్యక్తి పార్కినసన వ్యాధిబారిన పడతాడని వైద్యులు చెబుతున్నారు. ఈ మందును తయారు చేసిన ఆసి్ట్రయా దేశంతోపాటు పలు దేశాలు దీనిని నిషేధించినా మన దేశంలో మాత్రం ఇంకా నిషేధించడం లేదు.

ఫ కేంద్ర ప్రభుత్వానికే అధికారం

పారాక్వైట్‌ దుష్ఫలితాలను పలు వేదికలు వెల్లడిస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఈ మందులను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పూర్తిగా నిషేధించే అవకాశం చట్టంలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు 1968 యాక్టు 27 సెక్షన ద్వారా 60 నుంచి 90 రోజులపాటు మాత్రమే నిషేధించే అధికారం ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఒడిశా ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని వినియోగించుకొని తాత్కాలిక నిషేధాలు విధిస్తూ వస్తున్నది.

- ఇటీవల జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన బిటెక్‌ విద్యార్థిని మార్కులు సరిగా రాకపోవడంతో మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆమెను కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స చేసినా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. వారంరోజులపాటు అక్కడ చికిత్స తీసుకొని సుమారు 15 లక్షలు ఖర్చుచేసుకున్నా ఆ అమ్మాయి బతకలేదు.

- ఫోనలో ఆనలైన గేమ్‌లకు అలవాటుపడిన ఒక యువకుడు తల్లిదండ్రులు మందలించడంతో ఈ పారాక్వాట్‌ గడ్డిమందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారంరోజుల చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయాడు.

ఫ ఆత్మహత్యాయత్నాల్లో గడ్డిమందు కేసులే ఎక్కువ..

ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి గడ్డిమందు తాగిన కేసులే ఎక్కువగా రిజిస్టరవుతున్నాయి. అందులో 95నుంచి 98శాతం మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ గడ్డిమందును నిషేధించాలని బాధిత కుటుంబాలకు చెందిన వారు డిమాండ్‌ చేస్తుండగా ఇప్పుడిప్పుడే వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు దీనిపై ఆలోచన చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మందును తాత్కాలిక నిషేధ చట్టం ద్వారా నిషేధిస్తూ వచ్చి అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించి గడ్డిమందు నిషేధానికి కృషిచేయాలని కోరుతున్నారు.

ఫ మా చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతుంటే చలించిపోయా...

- డాక్టర్‌ మర్రి మహేశ్‌రెడ్డి, వన్‌ హాస్పిటల్‌, కరీంనగర్‌

క్షణికావేశంలో గడ్డిమందు తాగి చికిత్స కోసం మా ఆసుపత్రులకు వస్తే వారిని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి, వారు మా చేతుల్లో ప్రాణాలు కోల్పోతుంటే ఏమి చేయలేక చలించిపోయేవాడిని. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లలు, గృహిణులు చిన్ని చిన్న కారణాల వల్ల గడ్డిమందు తాగడం, ఆ తరువాత తమని బ్రతికించమని ప్రాధేయపడడం చాలా బాదగా అనిపించేది. ఈ మందుకు విరుగుడు మందు లేదు. నాలుగు నెలలుగా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు గడ్డిమందు వల్ల నష్టం, దానికి విరుగుడు మందు లేదని అవగాహన కల్పిస్తున్నాను. రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలను కలిసి ఈ మందును దేశంలో పూర్తిగా నిషేధించాలని కోరాను.

Updated Date - Mar 31 , 2026 | 01:37 AM