స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:56 PM
80వ స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా పోలీసు పరేడ్‌గ్రౌండ్ ముస్తాబైంది. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): 80వ స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా పోలీసు పరేడ్‌గ్రౌండ్ ముస్తాబైంది. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధులశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతకావిష్కరణ చేసి ప్రసంగించనున్నారు. జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీ, ప్రజల కోసం మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఉదయం 9.27 గంటల నుంచి 9.30 గంటల వరకు జాతీయ గేయం (వందేమాతరం), 9.30 నుంచి 9.32 వరకు జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. అనంతరం 9.32 నుంచి 9.33 వరకు జాతీయ గీతాలాపన, 9.40 గంటల వరకు వందన స్వీకారం స్వీకరిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల సత్కారం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల పంపిణీ, 11 గంటలకు కార్యక్రమాలు ముగుస్తాయని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.