‘కాటు’తో బెంబేలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:56 AM
ప్రతీ నిత్యం జిల్లాలో ప్రజలు పలు జంతువులు, విష పురుగులు, సర్పాల కాటుకు గురవుతున్నారు.
జగిత్యాల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రతీ నిత్యం జిల్లాలో ప్రజలు పలు జంతువులు, విష పురుగులు, సర్పాల కాటుకు గురవుతున్నారు. కుక్కలు, కోతులు వీధుల్లో సంచరిస్తూ పిల్లలు, వృద్ధులు, మహిళలపై దాడులు చేస్తున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వీటితో పాటు పాములు, తేళ్లు, తేనెటీగల ల వల్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా కుక్కలు, కోతుల బెడదను పలు సందర్భాల్లో బాధితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు ప్రజావాణి కార్యక్రమాల్లో సైతం ఈ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. కుక్కలు, కోతుల నియంత్రణ చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది.
ఫజిల్లాలో పరిస్థితి ఇలా...
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత యేడాది కాలంలో పలువురు కుక్కలు, కోతులు, పాముల కాటుకు గురవుతున్నట్లు అధికార వర్గాల లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2024 ఏప్రిల్ మాసం నుంచి 2025 మార్చి మాసాంతం వరకు జిల్లాలో 9,175 మంది కుక్క కాటుకు, 98 మంది పాము కాటుకు గురయ్యారు. 2025 ఏప్రిల్ మాసం నుంచి 2026 మార్చి మాసాంతం వరకు జిల్లాలో 7,311 మంది కుక్క కాటుకు, 174 మంది పాము కాటుకు గురయ్యారు. 541 మంది పిల్లి కాటు, 3,234 మంది కోతుల దాడుల్లో గాయాలపాలయ్యారు.
ఫపొలాల వద్ద జాగ్రత్తలు అవసరం...
రైతులు చేల గట్లపై నడిచే సమయంలో పాదరక్షలు కచ్చితంగా ధరించాలి. కర్రతో చప్పుడు చేస్తూ నడవడం వల్ల అలికిడికి పాములు దూరం వెళ్లిపోతాయి. ధాన్యపు గాదెలు, గడ్డి వాములు, తడిగా ఉండే చోట కప్పలు, ఎలుకల కోసం పాములు తిరుగుతుంటాయి. దుంగలు, కట్టెల కుప్పలు, రాళ్ల కుప్పల వద్ద పాములు ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. రైతులు ఇళ్ల వద్ద, పంట పొలాల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లవద్ద ఏర్పాటు చేసుకునే పిడకలు, గూళ్ల మధ్య విషపు పురుగులు ఉండే అవకాశం ఉంది. రాత్రి పూట, తెల్లవారు జామున పంట పొలాలకు వెళ్లాల్సి వస్తే విధిగా టార్చిలైట్ తీసుకవెళ్లాలి. మోటార్ స్టార్టర్ వద్ద కూడా పాములు ఉండే అవకాశం ఉంటుంది. మోటారు స్టార్టర్ వద్ద ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. 9
ఫకరువైన కుక్కల నియంత్రణ చర్యలు..
జిల్లాలో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలను అధికారులు నామమాత్రంగానే తీసుకుంటన్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో ప్రతీ నిత్యం పలువురు కుక్క కాటుకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో చేరి రూ.వేలల్లో వ్యయం చేయాల్సి వస్తోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రదానంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు కుక్క కాటుకు ఎక్కువగా గురవుతున్నారు. కుక్కలు సంతతి పెరిగి వీధుల్లో ఆహారం కొరకు వెళ్లుతూ కనిపించిన వారిపై దాడులు చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. కుక్కలు, కోతుల సంతతిని నిరోధించడానికి అవసరమైన చర్యలు నామమాత్రంగానే తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
ఫకోతుల బెడద ఎక్కువే...
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోతుల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. వీధులతో పాటు ఇళ్లలోకి సైతం కోతులు ప్రవేశించి గోల చేస్తున్నాయి. ఇంటి దాబాలపై, ప్రహరీపై కోతులు గుంపులుగా కూర్చొని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా గ్రామాల వాసులు సొంత ఖర్చులతో కోతులను పట్టించి అటవీ ప్రాంతాల్లో విడిచి పెడుతున్నారంటే సమస్య ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. వసతి గృహాలు, పాఠశాలల్లో ఉండే విద్యార్థులపై సైతం కోతులు దాడులు చేస్తున్నాయి. రహదారిపై రాకపోకలు సాగించే వాహన చోదకులు, పాదాచారులు సైతం కోతుల దాడులకు గురై గాయాలపాలయిన సందర్భాలున్నాయి.
సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించాలి...
-డాక్టర్ నీలారపు శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, జగిత్యాల
పాము, కుక్క, కోతి, తేలు కాటుకు గురయితే నాటు వైద్యం జోలికి పోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి తొందరగా చికిత్స తీసుకోవాలి. విషపు జీవుల కాటుకు గురైన వ్యక్తి భయాందోళనకు గురికాకుండా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అవసరమైన ధైర్యాన్ని అందించాలి. పాములు కాటు వేసిన పలు సందర్భాల్లో విషం కంటే భయంతో పలువురు చనిపోతుంటారు. ప్రభుత్వం అందుబాటులో ఉంచే టెలిమానస్‌లో సైతం సంప్రదించాలి.