మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యం
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:33 AM
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లుల్లోనే పేరుకుపోతోంది. ఒకవైపు సీఎంఆర్ కింద ధాన్యాన్ని మర ఆడించి ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సి ఉండగా.. మరోవైపు కొత్త సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సమయం దగ్గరపడుతోంది. దీంతో మిల్లుల్లో నిల్వఉన్న ధాన్యాన్ని ఏం చేయాలన్నది అధికారులకు సవాల్‌గా మారింది.
- సీఎంఆర్ పూర్తికాక నిలిచిపోయిన స్టాక్
- ఎఫ్‌సీఐ స్వీకరణ, బహిరంగ మార్కెట్‌పైనే ఆశలు
- కొత్త సీజన్ ముంచుకొస్తున్నా కదలని వడ్లు
జగిత్యాల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లుల్లోనే పేరుకుపోతోంది. ఒకవైపు సీఎంఆర్ కింద ధాన్యాన్ని మర ఆడించి ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సి ఉండగా.. మరోవైపు కొత్త సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సమయం దగ్గరపడుతోంది. దీంతో మిల్లుల్లో నిల్వఉన్న ధాన్యాన్ని ఏం చేయాలన్నది అధికారులకు సవాల్‌గా మారింది. నిల్వలు పెరుగుతుండటం, మిల్లుల్లో మిల్లింగ్ సామర్థ్యానికి సరిపడా ధాన్యం ఇప్పటికే ఉండటంతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మిల్లులు, గోదాముల్లో పేరుకుపోయిన మిగులు ధాన్యాన్ని ఈ-టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోనూ దీనిపై చర్చ మొదలైంది. ఆలస్యం చేస్తే ధాన్యం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉండటంతో ముందుగానే టెండర్లకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
మిల్లుల్లో స్థలం కరువు..
మిల్లింగ్ ప్రక్రియ పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఎక్కువ మొత్తంలో ధాన్యం ఇంకా మిల్లుల్లోనే ఉండిపోయింది. గోదాముల్లోనూ నిల్వలు ఉండటంతో కొత్తగా వచ్చే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలన్న ప్రశ్న తలెత్తుతోంది. మిల్లుల్లో ఇప్పటికే ఉన్న ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి బియ్యం రూపంలో ప్రభుత్వానికి అప్పగిస్తే సమస్య కొంతవరకు తగ్గేది. అయితే సీఎంఆర్ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి.
సుమారు రూ.5,53,650 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిలు..
జిల్లాలో మూడు పంటసీజన్‌లలో సుమారు 5,53,650 మెట్రిక్‌టన్నుల సీఎంఆర్ బియ్యం బకా యిలు ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో 220రైస్‌మిల్లులు ఉండగా.. వాటిలో 112బాయిల్డ్ రైస్‌మిల్లులు ఉన్నాయి. 2024-25యాసంగి సీజన్‌కు సంబంధించి 79,020మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిలున్నాయి. ఈనెలాఖరులోపు సీఎంఆర్ అప్పగించడానికి గడువు ఉంది. 2025-26వానాకాలం సీజన్‌కు చెందిన సుమారు 67రైస్‌మిల్లులకు చెందిన సుమారు 1.66లక్షల బియ్యం బకాయిలు, 2025-26యాసంగి సీజన్‌కు సంబంధించి 3,08,350మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిలున్నాయి. 2025-26వానాకాలం, 2025-26యాసంగి సీజన్‌లకు చెందిన సీఎంఆర్ అప్పగించడానికి అక్టోబరు 31వ తేదీ వరకు గడువు ఉంది. కాగా జిల్లాలో ఇటీవల విజిలెన్స్ అధికారులు జరిపిన సోదాల్లో సైతం సుమారు రూ.130కోట్ల విలువ గల ధాన్యం నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు.
ఎఫ్‌సీఐ స్వీకరణ, బహిరంగ మార్కెట్‌పైనే ఆశలు..
ఇప్పటికే మిల్లుల్లో ఉన్న బియ్యం నిల్వలు, పాత సీఎంఆర్ బాధ్యతలు, కొత్తసీజన్ ధాన్యం కేటాయింపులను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్‌సీఐ సీఎంఆర్ స్వీకరణ, బహిరంగ మార్కెట్‌పైనే మిల్లర్లు ఆశలు పెట్టుకున్నారు. లేకపోతే కొత్త సీజన్‌ధాన్యం మిల్లులకు చేరిన సమయంలో ఇప్పటికే ఉన్న బియ్యం నిల్వలు కదలకపోతే మిల్లింగ్ వ్యవస్థ మొత్తం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
కొత్త సీజన్ వస్తోంది..
వానాకాలం సీజన్ ధాన్యం మార్కెట్‌కు వచ్చే సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుత నిల్వలు అలాగే కొనసాగితే కొత్తధాన్యాన్ని ఎక్కడికి తరలించాలన్నది ప్రశ్నగా మారనుంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని పలుజిల్లాల్లో నెలకొనడంతో ప్రభుత్వం మిగులుధాన్యాన్ని ముందుగానే ఈ-టెండర్ల ద్వారా విక్రయిం చేందుకు చర్యలు చేపడుతోంది. యాసంగి ధాన్యం రైస్‌మిల్లులు, గోదాముల్లో గుట్టలుగా పేరుకుపోయినట్లు, మిగులు ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సివిల్ సప్లయిశాఖ వర్గాలు అంటున్నాయి.
ముక్కిపోతే.. నష్టమే..
ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తేమ, వాతావరణ పరిస్థితులు, నిల్వ విధానం తదితర అంశాలతో ధాన్యంలో నష్టం ఏర్పడితే దాని విలువ తగ్గుతుంది. అందుకే మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలను అధికారులు ఎప్పటికప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ చేసి.. రికార్డుల్లో ఉన్న పరిమాణం, వాస్తవంగా ఉన్న స్టాక్ సరిపోలుతున్నదా? లేదా? అన్నది నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
టెండర్.. తరలింపు ఎలా?
మిగులు ధాన్యాన్ని ఈ-టెండర్ ద్వారా విక్రయించిన అనంతరం సంబంధిత బిడ్డర్లు నిర్ణీత గడువులో ధాన్యాన్ని మిల్లుల నుంచి తరలించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు పరీక్ష మొదలుకానుంది. టెండర్ పూర్తయినా ధాన్యం మిల్లుల్లోనే ఉండిపోతే ప్రయోజనం ఉండదు. గతంలో టెండర్లు పూర్త యినప్పటికీ మిల్లుల నుంచి ధాన్యం తరలింపులో జాప్యం జరిగిన ఉదంతాలున్నాయి. అందువల్ల జిల్లాలో టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ధాన్యం తరలింపు జరిగేలా అధికారులు పర్యవేక్షిం చాల్సిన అవసరం ఉంది.
మిల్లర్లకూ ఇబ్బందులే..
రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వ ఉండటంతో మిల్లింగ్ సామర్థ్యం వినియోగంపై కూడా ప్రభావం పడు తోంది. ఒకవైపు పాతస్టాక్.. మరోవైపు కొత్తసీజన్ ధాన్యం.. దీంతో మిల్లర్లకు స్థల సమస్య ఎదురవు తోంది. అయితే ప్రభుత్వం టెండర్ ద్వారా మిగులు ధాన్యాన్ని తరలిస్తే మిల్లుల్లో కొంత ఖాళీ ఏర్పడి కొత్త ధాన్యం దిగుమతికి అవకాశం లభించనుంది. మిల్లుల్లో పాతధాన్యం పేరుకుపోవడం వల్ల కొత్త సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.