Share News

సామాన్యులే.. సాయుధులై.. తిరగబడ్డ పోరుగడ్డ

ABN , Publish Date - Sep 17 , 2026 | 01:19 AM

‘బాంచెన్‌.. నీ కాల్మొక్త’.. అన్న చేతులు బందూకు పట్టాయి. వెట్టిచాకిరి, భానిసత్వంతో తలదించిన శిరస్సులే తలెత్తి తిరుగుబాటు చేశాయి.

సామాన్యులే.. సాయుధులై..  తిరగబడ్డ పోరుగడ్డ

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

‘బాంచెన్‌.. నీ కాల్మొక్త’.. అన్న చేతులు బందూకు పట్టాయి. వెట్టిచాకిరి, భానిసత్వంతో తలదించిన శిరస్సులే తలెత్తి తిరుగుబాటు చేశాయి. భూమి కోసం, భుక్తి కోసం పోరు సల్పిన ఘన చరిత్ర ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాది. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఊపిరి ఊదిన గడ్డ ఇది. తరతరాలకు పోరాటమనే ముద్ర వేసిన ఘనత మన యోధులది. భావితరాలకు సరికొత్త చైతన్య బావుటాను ఎగురవేసిన తెలంగాణ సాయుధ పోరాటంలో మన జిల్లా ఖ్యాతి ఎనలేనిది.. రజాకార్లపై మన పల్లెలు మర్లవడ్డాయి. వాళ్లను ఉరికించి తరమికొట్టే విధంగా ఇక్కడి ఊళ్లన్నీ తిరగబడ్డాయి. విమోచన, విలీన కలను సాకారం చేసుకున్నాయి.

సంఘటిత స్ఫూర్తితో.. పల్లెలు

భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాంది పలికింది. ముఖ్యంగా పల్లెలు విరోచిత పోరాటానికి ప్రతీకలుగా నిలిచాయి. ఇక్కడి పోరాట యోధుల ప్రాణత్యాగాలు, వారు చూపించిన తెగువ వల్లనే తెలంగాణ విమోచనమనే కల సాకారమైంది. నిజాం పోలీసులు, రజాకార్ల ఆగడాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పల్లెల్లో ఉద్యమ స్ఫూర్తి రగులుకుంది. 1935లో సిరిసిల్ల కేంద్రంగా నిర్వహించిన ఆంధ్రమహాసభను ముందుండి నడపడటంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, పీవీ నర్సింహారావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, సీహెచ్‌.రాజేశ్వర్‌రావు, అనభేరి ప్రభాకర్‌రావు, అమృత్‌లాల్‌ శుక్లా, హన్మంతరావు సహా వందలాది మంది పాల్గొని ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఈ సభ తర్వాతనే ఊళ్లకు ఊళ్లు చైతన్యమై సాయుధ, రైతాంగ గెరిల్లా పోరాట దళాలు ఏర్పాటయ్యాయి. బాలదండుతో పాటు మహిళలు ఆయుధాలు పట్టే విధంగా పోరులో భాగస్వామ్యమయ్యారు. 1946 నుంచి 1948 సెప్టెంబర్‌ వరకు ఊరూరా ఉద్రిక్తత కనిపించింది. సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని, హుస్నాబాద్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌, ధర్మపురి, జగిత్యాల, భీమదేవరపల్లి, కోనారావుపేట, కోహెడలాంటి చోట నిజాం పోలీసులు, రజకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఊళ్లకు ఊళ్లు తిరగబడే పరిస్థితి పెరిగింది.

రక్తంతో తడిసిన గాలిపెల్లి

ఆంధ్ర మహాసభ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి స్వగ్రామమైన గాలిపెల్లి నిజాం పోలీసులతో జరిపిన పోరాటంలో రక్తమోడింది. 10మంది పోరాటయోధులు అక్కడికక్కడే చనిపోగా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల దాదాపుగా 15 గ్రామాల ఉద్యమకారులతోపాటు ముఖ్య నేతలంతా ఈ ఊళ్లో తలదాచుకున్నారనే సమాచారంతో నిజాం పోలీసులు దాదాపుగా 500 మంది ఊరును నలువైపుల నుంచి చుట్టుముట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన ఊరి జనమంతా గ్రామ పొలిమెరలోని కందెనకుంట చెరువు వద్ద పోలీసులకు ఎదురొడ్డి పోరాడారు. వరిసెలు, రాళ్లు, కర్రలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా నిజాం పోలీసుల తుపాకీ తూటాలకు కొందరు బలయ్యారు. బద్దం ఎల్లారెడ్డి, మల్లుగారి బలరాంరెడ్డి ఇళ్లకు నిప్పుబెట్టారు. ముఖ్య నేతల ఆచూకీ తెలుపాలని ఊరి జనాల్ని నిజాం పోలీసులు చిత్రహింసలు పెట్టారు. తుపాకీ తూటాలతో గాయపడిన మల్లుగారి రాఘవరెడ్డి, బద్ధం వెంకయ్యలతో పాటు ఇంకొందరిని పోలీసులు లాక్కెళ్లి కరీంనగర్‌ జైల్లో పెట్టారు. ఈ గ్రామానికి చెందిన మంగలి బుర్రయ్య, బోనింగవగారి నారాయణ, పీసు బక్కయ్య, పుల్లుగారి ఎల్లయ్య, పెరంబుదూరి అనంతయ్య, అయ్యారి అనంతమ్మలతోపాటు యాల్ల రామిరెడ్డి(పారుపెల్లి) ఏలేటి రాజిరెడ్డి(నర్సక్కపేట), సింగిరెడ్డి రాజిరెడ్డి(తాళ్లపల్లి), అల్లెవెంకయ్యలు తుపాకీ తూటలకు నేలకొరిగి ప్రాణాలు కోల్పోయారు.

దద్దరిల్లిన.. మహ్మదాపూర్‌ గుట్ట

తెలంగాణ సాయుధపోరాటంలో తొలి ఎన్‌కౌంటర్‌ హుస్నాబాద్‌ సమీపంలోని మహ్మదాపూర్‌ గుట్టల్లో జరిగింది. ఇక్కడ రణరంగాన్ని తలపించే విధంగా నిజాం పోలీసులకు, జిల్లాకు చెందిన పోరాట నాయకులకు ఉవ్వెత్తున ఎగిసిపడే రణమే జరిగింది. తుపాకుల మోతతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పోరాటయోఽధుడు అనభేరి ప్రభాకర్‌రావుతోపాటు సింగిరెడ్డి భూపతిరెడ్డి సహా 12 మంది ఈ గుట్టపైనే అమరులయ్యారు. తిమ్మాపూర్‌ మండలం పోలంపల్లిలోని భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ప్రభాకర్‌రావు పీడిత ప్రజల తరపున తన పోరాటాన్ని కొనసాగించారు. పలుమార్లు నిజాం పోలీసుల్ని, రజకార్లను భయపెట్టి, ముచ్చెమటలు పుట్టించిన ఈయనతోపాటు పలువురిని ఈగుట్ట ప్రాంతంలోనే చుట్టుముట్టి అంతమొందించారు. ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై దాడి చేసి అక్కడి నుంచి తుపాకులను స్వాధీనం చేసుకుని వచ్చిన పభ్రాకర్‌రావు దళం 1948 మార్చి 14న ఇక్కడి గుట్టపై ఆశ్రయం పొందిందనే సమాయారమందుకున్న నిజాం పోలీసులు గుట్టను చుట్టుముట్టి తుపాకుల మోతతో 12మంది ప్రాణాలను తీశారు. అనభేరి ప్రభాకర్‌రావుతో పాటు సింగిరెడ్డి భూపతిరెడ్డి(తాడూరు), దామోదర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇల్లందుల పాపయ్య (గాలిపెల్లి), నల్లగొండ రాజారాం(రేగడి మద్దికుంట), చిక్కుడు సాయిలు, రొండ్ల మాధవరెడ్డి(రేపాక) , ముస్కు చొక్కారెడ్డి (ఓగులాపూర్‌), అయిరెడ్డి భూంరెడ్డి (సోమారంపేట), తూమోజు నారాయణ(బేగంపేట)తో పాటు మరొకరు వీరోచిత పోరులో వారి ప్రాణాలను త్యాగం చేశారు. వీరి పోరాటానికి గుర్తుగా ఈ గుట్ట సమీపంలో స్తూపం ఏర్పాటు చేశారు.

పోరుబాటలో ప్రత్యేకతలు

- అనభేరి దళం 40 గ్రామాల్లో పటేల్‌- పట్వారీ రికార్డులను ధ్వసం చేసింది.

- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జిల్లాలో ఉవ్వెత్తున నడిచింది.

- 1947 ఆగస్ట్‌ 15న స్వాతంత్య్రం వచ్చినా జెండాను ఎగుర వేయనివ్వలేదు.

- ధర్మపురిలో కె.వి కేశవులు, మాణిక్యశాస్ర్తిలు ధైర్యంగా జెండా ఎగురవేశారు.

- జెండాను ఎగురవేసినందుకు పలువురిని జైల్లో పెట్టగా కొందరు పారిపోయారు.

- అమృత్‌ శుక్లాను జైల్లో పెట్టినా బయటకు వచ్చి తన పోరాటాన్ని ఆపలేదు.

Updated Date - Sep 17 , 2026 | 01:19 AM