బడ్జెట్‌పై ఆశలు..
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:57 AM
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ఫై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ఫై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో చేపట్టనున్న పత్తిపాక రిజర్వాయర్, పోతారం ఎత్తిపోతల పథకంతో పాటు రామగుండంలో జెన్‌కో ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సహకారంతో చేపట్టనున్న 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలనే డిమాండ్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథని నియోజక వర్గంలో పోతారం ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సైతం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టి నియోజకవర్గం లో చివరి ఆయకట్టు భూములకు సాగు నీటిని అందిస్తామని ప్రకటించారు. అలాగే రామగుండంలో గల బీ పవర్‌హౌస్‌ను 800 మెగావాట్లకు విస్తరిస్తామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం గత ఏడాది డీపీఆర్ తయారీ కోసం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, 800 మెగావాట్ల పవర్‌ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పోతారం ఎత్తిపోతల పథకంపై కూడా డీపీఆర్ రూపొందించారు. కీలక మైన ఈ మూడు ప్రాజెక్టులకు 2026-27 బడ్జెట్‌లో ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా మంత్రి సహ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక వస్తున్నారు.
ఫ పత్తిపాక డీపీఆర్ కోసం రూ. 5 కోట్లు మంజూరు..
జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాక వద్ద నిర్మించనున్న శ్రీలక్ష్మీ నర్సింహా రిజర్వాయర్ నిర్మాణానికి డీపీఆర్ తయారీ కోసం గత ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. 2024 నవంబర్ 24న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ వంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్‌తో కలిసి ప్రతిపా దిత పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. 5 నుంచి 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని భావించారు. దీని కోసం దాదాపు 1500 ఎకరాల భూములు ముంపునకు గురి కానున్నా యని అంచనా వేశారు.. ఇందులో 400 ఎకరాలు అటవీ భూమి కాగా, మిగతా భూమి రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందని 2,400 కోట్ల రూపాయల వరకు వ్యయం కానున్నదని అంచనా వేశారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మించి తీరతామని ఈ రిజర్వా యర్ నిర్మాణానికి 2024 డిసెంబర్ 4వ తేదీన జిల్లాలో జరిగిన సీఎం యువ వికాసం సభకు హాజరైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు హామీ ఇచ్చారు.
ఫ 2.40 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు
జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో గల ఎస్సారెస్పీ లక్షా 80 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని 40 వేల ఎకరాలతోపాటు 10 నుంచి 20 వేల ఎకరాల కొత్త ఆయ కట్టుకు సాగు నీరందనున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతీ సీజన్‌లో సాగు నీటిని వారబంధి పద్ధతిన విడుదల చేస్తున్నారు. కాలువ చివరి భూములైన ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని చివరి ఆయ కట్టు భూములకు సక్రమంగా నీరందక పంటలు ఎండిపోతు న్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పత్తిపాక వద్ద 5 నుంచి 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించినట్లయితే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా చొప్పదండి మండలం రేవెల్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద గల ఎస్సా రెస్పీ కాలువకు లింక్ చేస్తే చివరి ఆయకట్టుకు సాగు నీరు అందనున్నదని ప్రతిపాదించారు. అయితే గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. రిజర్వాయర్‌ను నిర్మించాలని మంత్రితో పాటు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు.
ఫ పోతారం ఎత్తిపోతలతో 30 వేల ఎకరాలు..
మంథని నియోజకవర్గ పరిధిలోని మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లోని 22 వేల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 8 వేల ఎకరాల భూము లకు సాగునీటిని అందించే విధంగా పోతారం ఎత్తి పోతల పథకాన్ని రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌లో కూడా చేర్చారు. సుందిళ్ల బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణానికి 400 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసినప్పటికీ నిధులు మంజూరు. కాలేదు. గోదావరి అవతలి పక్కన చెన్నూరు ఎత్తిపోతల పథకానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎన్నికల సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు సైతం పోతారం పథకాన్ని చేపడతామని హామీ ఇవ్వడంతోపాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక వస్తున్నారు. ఆ మేరకు బడ్జెట్‌లో పోతారం ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని, వీటికే గాకుండా జిల్లా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.