‘ఆపరేషన్ స్మైల్’ను విజయవంతం చేయాలి..
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:08 AM
బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే పిలుపునిచ్చారు.
కరీంనగర్ క్రైం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్లో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం జనవరి 1 నుంచి 31 వరకు వివిధ శాఖల సమన్వయంతో పక్కగా నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు లేదా సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100, 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు సమష్టిగా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని, పనిలో పెట్టుకుంటే యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలన్నారు. బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ ధనలక్ష్మి, ఇన్‌చార్జి జిల్లా సంక్షేమ అధికారి సుగుణ, టాస్క్‌పోర్స్ ఏసీపీ సతీష్, డీసీపీవో పర్వీన్, చైల్డ్ హెల్ప్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్, లేబర్ కమిషనర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.