పంచాయతీల్లో ఆన్‌లైన్ పన్ను చెల్లింపులు
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:15 AM
గ్రామపంచాయతీల ఆర్థిక పరిపుష్టికి పన్నుల వసూళ్లే కీలకం. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీలు, చెత్త సేకరణతో పాటు చిన్నచిన్న అభివృద్ధి పనులు చేపట్టాలంటే పంచాయతీలకు సొంత ఆదాయం అవసరం. ఇందులో ప్రధానంగా ఇంటిపన్ను, నీటి పన్ను కీలకంగా ఉంటాయి.
పెద్దపల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీల ఆర్థిక పరిపుష్టికి పన్నుల వసూళ్లే కీలకం. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీలు, చెత్త సేకరణతో పాటు చిన్నచిన్న అభివృద్ధి పనులు చేపట్టాలంటే పంచాయతీలకు సొంత ఆదాయం అవసరం. ఇందులో ప్రధానంగా ఇంటిపన్ను, నీటి పన్ను కీలకంగా ఉంటాయి. దీంతో పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయడంతోపాటు ప్రజలు ఆన్‌లైన్‌లోనే చెల్లించేలా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపడుతోంది.
ఫ జిల్లాలో 263 గ్రామపంచాయతీలు
జిల్లాలో 263 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 14 రెవెన్యూ మండలాలు, 13 మండల ప్రజాపరిషత్‌లు ఉండగా, 202 నివాస గ్రామా లున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 2,09,677 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంత కుటుంబాలే సుమారు 62 శాతం ఉన్నట్లు జిల్లా అభివృద్ధి నివేదికలు తెలుపుతున్నాయి.
ఫ ఆన్‌లైన్‌లోనే పన్ను చెల్లింపు
ఇంటి పన్ను లెక్కలు, డిమాండ్, బకాయిలు, చెల్లింపుల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడంతో పంచాయతీల్లో పారదర్శకత పెరుగుతోంది. తెలంగాణలో గ్రామపంచాయతీల ఇంటిపన్ను అంచనా, డిమాండ్, చెల్లింపుల ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో కూడా నిర్వహిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో జరగడం లేదు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సమర్థ్ పంచాయత్ పోర్టల్ ద్వారా కూడా పంచాయతీల పన్ను, పన్నేతర ఆదాయాలను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో వసూలు చేసే విధానాన్ని అమలు చేస్తోంది. పన్ను డిమాండ్ తెలుసుకోవడం, ఆన్‌లైన్‌లో చెల్లించడం, రసీదు పొందడం వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
ఫ వంద శాతం వసూళ్లపై అధికారుల దృష్టి
గ్రామాల్లో వంద శాతం పన్నుల వసూళ్లు సాధించాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది. మార్చి 2026లో నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్రామాల్లో 100 శాతం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పన్నుల డిమాండ్‌ను పరిశీలించడం, బకాయిలను గుర్తించడం, ప్రజలకు ఆన్‌లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు.
ఫ పన్నులే పంచాయతీలకు జీవనాడి
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు సొంతంగా సమకూర్చుకునే ఆదాయం ఎంతో ముఖ్యం. పన్నులు సక్రమంగా వసూలైతే గ్రామాల్లో అత్యవసర పనులకు నిధులు వినియోగించే అవకాశం ఉంటుంది. గతంలో పంచాయతీలకు నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనుల బిల్లులు, సిబ్బంది వేతనాలు తదితర అంశాల్లో ఇబ్బందులు ఎదురైన సందర్భాలు ఉన్నాయి.
ఫ ఆన్‌లైన్‌తో లెక్కలు పక్కా
గతంలో ఇంటిపన్ను వసూలు చేయడానికి పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లాల్సి వచ్చేది. నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాల లెక్కలు, రసీదుల నిర్వహణలో ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్ విధానంతో పన్ను డిమాండ్ ఎంత? ఎంత వసూలైంది? ఎంత బకాయి ఉంది? అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది. ఇది పంచాయతీల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు కూడా ఎక్కడి నుంచైనా పన్ను చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది.
ఫ పన్ను చెల్లిస్తే గ్రామానికే మేలు
గ్రామాల్లో పన్ను చెల్లించే ప్రతి కుటుంబం పంచాయతీ అభివృద్ధిలో భాగస్వామి అవుతుంది. పన్నుల ద్వారా వచ్చిన సొంత ఆదాయాన్ని పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, డైన్రేజీలు, పచ్చదనం, ఇతర స్థానిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుంది. అందువల్ల పన్ను చెల్లింపును భారంగా కాకుండా గ్రామ అభివృద్ధికి మన వంతు సహకారంగా చూడాలని అధికారులు, సర్పంచులు సూచిస్తున్నారు.