Share News

అంగనవాడీల్లో ఒంటి పూట

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:53 AM

ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగనవాడీ కేంద్రాలను ప్రభుత్వం ఒంటిపూట నిర్వహిస్తోంది. రోజురోజుకు తీవ్రమవుతున్న ఎండల కారణంగా చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాల పని వేళలను మార్చింది. రానున్న రెండు నెలలను దృష్టిలో ఉంచుకొని ఒంటి పూట ప్రకటించడంతో పాటు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

అంగనవాడీల్లో ఒంటి పూట

- పనివేళల్లో మార్పు చేసిన ప్రభుత్వం

- ఈనెల 30వ తేదీ వరకు కొనసాగింపు

- ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహణ

- మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చిన్నారులకు సెలవులు

- ఎండవేడిమి నుంచి ఉపశమనం

జగిత్యాల, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగనవాడీ కేంద్రాలను ప్రభుత్వం ఒంటిపూట నిర్వహిస్తోంది. రోజురోజుకు తీవ్రమవుతున్న ఎండల కారణంగా చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాల పని వేళలను మార్చింది. రానున్న రెండు నెలలను దృష్టిలో ఉంచుకొని ఒంటి పూట ప్రకటించడంతో పాటు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంచాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి ఐసీడీఎస్‌ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. పాఠశాలలకు మార్చి 16వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కాగా...అంగన వాడీల్లో కూడా ఒంటి పూట నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేసవిలో వడగాల్పులతో చిన్నారులు అవస్థలు పడే అవకాశం ఉండడంతో ఈనెల 30వ తేదీ వరకు అంగన వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జూన ఒకటవ తేదీ నుంచి కేంద్రాలు యథావిధిగా పనిచేయనున్నాయి.

- జిల్లాలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలు..

జిల్లావ్యాప్తంగా నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి, మల్యాలలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలుండగా ఇందులో 1,037 మెయిన్‌ కేంద్రాలు, 28 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. ఇటీవల మినీ అంగన వాడీ కేంద్రాలను సైతం మెయిన కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ ఇందుకు అనుగుణంగా అంగన వాడీ పోస్టులు మంజూరు, భర్తీ చేయలేదు. వీటిల్లో సుమారు 14,086 మంది గర్భిణులు, బాలింతలు, 34,897 మంది ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సులోపు చిన్నారులు, 15,907 మంది మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల్లోపు చిన్నారుల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..

ఎండాకాలం ప్రారంభం కావడంతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు పలు అంగనవాడీలకు సొంత భవనాలు లేక అద్దె ఇళ్లలో ఇరుకైన గదుల్లో నిర్వహిస్తుండగా... ఉక్కపోతతో చిన్నారులు గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంచేవారు. ప్రస్తుతం ఒంటిపూట కేంద్రాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తారు. ఆ తర్వాత మధాహ్నం 12.30 గంటలకు చిన్నారులు ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం తర్వాత టీచర్లు ఆయాలు వార్షిక సర్వే, జనన, మరణాలు, ప్రీ స్కూల్‌ ప్రవేశాలకు విద్యార్థుల నమోదు, బడి మానేసిన పిల్లల వివరాలు సేకరించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

యాప్‌లో అప్‌డేట్‌ నమోదు...

ఒంటి పూట బడి అనంతరం మద్యాహ్నం టీచర్లు, ఆయాలు గతంలో ఇచ్చిన సర్వే జాబితా ప్రకారం ప్రత్యక యాప్‌లో ఫోన ద్వారా అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఈనెలలోనే నమోదు పూర్తి చేయాలని లక్ష్యంగా విధించారు. ఇక మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెలవుల్లో చిన్నారులకు ఇంటికే సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలో పోషణ లోపాన్ని గుర్తించడం, వార్షిక సర్వే, గృహ సందర్శన, పిల్లను అంగనవాడీల్లో చేర్పించడం తదితర పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు జరిగే బాలల భద్రత వారోత్సవాలు, మే 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే మహిళా థీమ్‌, ప్రజాపాలనలో పాల్గొనాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే..

- రాజ్‌కుమార్‌, జిల్లా సంక్షేమ అధికారి

ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగనవాడీ కేంద్రాలు ఒంటి పూట నిర్వహిస్తున్నాము. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని ఇప్పటికే టీచర్లకు ఆదేశాలు ఇచ్చాము. సమయపాలన పాటించి, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలని సూచించాము. వారికి నిర్దేశించిన చాట్‌ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది.

Updated Date - Apr 04 , 2026 | 01:53 AM