ఒకే తోట డబుల్ ఆదాయం..
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:26 AM
జిల్లా రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఒక వైపు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులు అంతర పంటలుగా వాణిజ్య, ఆహార పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు ఆయిల్‌పామ్ సాగును మరింత పెంచడానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. పట్టా భూములు ఉన్న ఒంటరి మహిళా రైతులకు ఆయిల్‌పామ్ సాగు ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ప్రత్యేక రాయితీ సదుపాయాన్ని కల్పించారు.
ఆయిల్‌పామ్‌లో అంతర పంటలు
వాణిజ్య, ఆహార పంటల సాగు
వర్షాభావ పరిస్థితులతో ముందుకు వస్తున్న రైతులు
జిల్లాలో ఇప్పటికే 4వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ఈయేడు 309 ఎకరాల్లో సాగుకు సన్నాహాలు
ఒంటరి మహిళలకు కలెక్టర్ ప్రత్యేక రాయితీ
మంథని, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఒక వైపు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులు అంతర పంటలుగా వాణిజ్య, ఆహార పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు ఆయిల్‌పామ్ సాగును మరింత పెంచడానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. పట్టా భూములు ఉన్న ఒంటరి మహిళా రైతులకు ఆయిల్‌పామ్ సాగు ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ప్రత్యేక రాయితీ సదుపాయాన్ని కల్పించారు. ఈ ప్రయోగం ద్వారా సాగు విస్తీరాన్ని పెంచడంతోపాటు ఒంటరి మహిళలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చటానికి కలెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ఆయిల్‌పామ్ సాగులో ఉన్న రైతులు వాణిజ్య, ఆహార పంటల సాగు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి వరి పంటలు పండే పరిస్థితి పై ఆశలు సన్నగిల్లుతుండటంతో సీజ నల్‌గా ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయిల్‌పామ్ పంట చేతికి రావటానికి 4 ఏళ్ళు పట్టే అవకాశం ఉండటం, వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం కూరగాయలకు, ఆకుకూరలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. పండుగల సీజన్‌లో పూలకు సైతం డిమాండ్ ఉండడంతో రైతులు ఆయిల్‌పామ్‌పై ఆసక్తిగా ముందుకు వస్తున్నారు.
జిల్లాలోని వివిధ మండలాల్లో ఇప్పటి వరకు సుమారు 4 వేలకు పైగా ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేస్తుండగా తాజాగా ఈయేడు 309 ఎకరాల్లో సాగును రైతులు ప్రారంభించారు.రెండేళ్ళుగా జిల్లాలోని 17 వందల ఎకరాల ఆయిల్‌పామ్ తోటల్లో అంతర్ పంటలను సాగు చేశారు. ఆయిల్‌పామ్ పంట చేతికొచ్చే సమయానికన్నా ముందుగానే అదనపు ఆదాయం పొందే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. నీటి సౌకర్యం గల వివిధ రకాల భూముల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. కొన్నిచోట్ల 4 ఏళ్ళ క్రితం సాగు చేయగా మరి కొన్ని చోట్ల గతేడాది సాగు చేపట్టారు. డ్రిప్ సిస్టంతో మొక్కలకు సాగు నీరు అందిస్తూ పలువురు రైతులు యాజమాన్య పద్ధతులు చేపడుతుండగా చెట్లు ఏపుగా ఎదుగుతున్నాయి. జిల్లాలోని పలు చోట్ల ఆయిల్‌పామ్ గెలలు వేయగా అధికారుల సూచనల మేరకు రైతులు మొదటి మూడేళ్లు గెలలను తీసేసి నాలుగో యేట నుంచి ఉత్పత్తి కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల మంచి దిగుబడి సాధించి గెలలను విక్రయించి ఆదాయం పొందారు.
వివిధ రకాల వాణిజ్య పంటల సాగు..
ఆయిల్‌పామ్ తోటల్లో జిల్లాలో సుమారు 17 వందల ఎకరాల్లో వివిధ రకాల వాణిజ్య, ఆహార పంటలను రైతులు సాగు చేశారు. వీటిల్లో ప్రధానంగా కూరగా యలు, ఆకు కూరలు, బంతిపూలు, అరటి, పసుపు, బొప్పాయి, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, పత్తి పంట లను పండిస్తున్నారు. సీజన్‌కు అనుకూలంగా సాగు చేస్తూ రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
జిల్లాలోని ముత్తారం, హరిపురం, గుంజపడుగు, దుబ్బపల్లి, విలోచవరం, అడవిసోమన్‌పల్లి, పెంచికల్ పేట, పెరపల్లి, రత్నాపూర్, బేగంపేట, కల్వచర్ల, రేగడి మద్దికుంట, చిన్నబొంకూరు, సుద్దాల, హన్ముంతునిపేట, రాఘవాపూర్, ధర్మారం, కటికనపల్లి, గంగారం, తుర్కలమద్దికుంట, ఎలిగేడు, దూలికట్ట, జూలపల్లి తోపాటు పలు గ్రామాల్లో ఆయిల్‌పామ్ తోటల్లో అంతర్ పంటలను రైతులు గతేడాది సాగు చేశారు. రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు సూచనలు, సలహాలు ఇచ్చి ప్రోత్సాహిస్తున్నారు.
ఒంటరి మహిళా రైతులకు ప్రోత్సాహం
గడ్డం శ్యాంప్రసాద్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్,
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగులో ఒంటరి మహిళా రైతులను ప్రోత్సహించడానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పట్టా భూమి ఉన్న ఒంటరి మహిళలు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వస్తే ఉద్యాన శాఖ ద్వారా అందించే 4 సంవత్సరాల రాయితీలతో పాటు రైతులకు అయ్యే అదనపు ఖర్చును తన ఆధీనంలోని నిధులు వారికి కేటాయిస్తానని ప్రకటించారు. దీని ద్వారా ఒంటరి మహిళలను ఆర్థికంగా ఆదుకోవటం, జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును విస్తరించడం లక్ష్యంగా ఈ ప్రథకాన్ని ప్రవేశపెట్టారు. అర్హులైన ఒంటరి మహిళా రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలి.