రాలే చినుకును ఒడిసిపట్టాలి..
ABN , Publish Date - Sep 22 , 2026 | 02:06 AM
- ఆదివారం కరీంనగర్‌లో వర్షం దంచికొట్టింది. అరగంటపాటు కురిసిన వానతో ఏ రోడ్డు చూసినా.. ఏ వీధి చూసినా జలమయంగా మారింది. కొద్దిసేపటికి ఆ వరద నీరంతా మురుగు కాలువల ద్వారా మానేరు నదిలో కలిసింది.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
- ఆదివారం కరీంనగర్‌లో వర్షం దంచికొట్టింది. అరగంటపాటు కురిసిన వానతో ఏ రోడ్డు చూసినా.. ఏ వీధి చూసినా జలమయంగా మారింది. కొద్దిసేపటికి ఆ వరద నీరంతా మురుగు కాలువల ద్వారా మానేరు నదిలో కలిసింది. అదే వాననీటిని సంరక్షించుకునే విధంగా ఇంకుడు గుంతలు ప్రతి ఇంటి వద్ద ఉండి ఉంటే వర్షంగా పడిన ప్రతి నీటి బొట్టు నేలలో ఇంకి నగరంలో భూగర్భజల మట్టం పెరిగేది.
- కరీంనగర్‌లో 80వేలకుపైగా జనావాసాలుంటే అందులో పదోవంతు ఇళ్లలోనూ ఇంకుడు గుంతలు లేవు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా వాననీటిని సంరక్షించే సదుపాయాలు లేవు. కరీంనగర్‌లో ప్రతి నెలలో సగటున 1.5 మీటర్ల లోతుకు నీళ్లు పడిపోతున్నాయి. ఇప్పటికే పలు ఇళ్లల్లో బోర్లు ఇంకిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని వాడుతున్నారు.
ఫ ప్రజల్లో మార్పు వస్తేనే..
వాననీటిని కాపాడే విషయంలో లెక్కలేకపోతే చిక్కులు తప్పేలా లేవు. వాస్తవానికి నగరంలో చాలా ఇళ్లలో ఇంకుడు గుంతలు లేవు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాన్ని చేపట్టే సమయంలో విధిగా ఇంకుడుగుంత నిర్మించుకుంటామని హామీ ఇవ్వాలి. అలా అయితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తారు. కానీ చాలామంది ఈ నిబంధనను విస్మరిస్తున్నారు. ఇక ఇళ్లల్లోనూ ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ వేసవిలో తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి కురిసే ప్రతీ వాన చినుకును ఒడిసిపట్టుకునే విధంగా భూగర్భ జలం పెరగాల్సిన అవసరముంది. దీంతోపాటు బోర్లలో ఉన్న నీటిని పదిలంగా కాపాడుకుంటూ నీటి పొదుపును పాటించాల్సిన అవసరముంది.
ఫ తోడేస్తూ.. వాడేస్తూ...
నగరంలో ఇప్పటికే రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజులో 27 ఎంఎల్‌డీ ( మిలియన్ లీటర్స్ ఫర్ డే) వస్తుండగా ఇవి పూర్తిగా సరిపోవడం లేదు. దీంతో బోర్లతోనే ఇంటి అవసరాల్ని తీర్చుకుంటున్నారు. 37,685 గృహాలకు ఉన్న నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. నగరంలో సగటున రోజుకు ఒక వ్యక్తికి 135 లీటర్ల నీళ్లు అవసరం. అదే గ్రామాల్లో వంద లీటర్లు ఉపయోగించాలి. అంతకన్నా తక్కువగానే జిల్లాలో తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతోంది. సరఫరా అయ్యే జలంతోపాటు ఇళ్లలోని భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడేస్తూ వాడేస్తున్నారు. ప్రతి వ్యక్తి సగటున ఇంట్లో రోజులో 20 నుంచి 30 లీటర్ల నీటిని దుబారా చేస్తున్నారు. నగర శివారులో బోర్ల నుంచి నీటిని ట్యాంకర్లతో విక్రయిస్తున్న వ్యాపారం పెరుగుతోంది. వీటివల్ల భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లిపోతున్నాయి. వీటిపై యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరముంది.
ఫ లీకేజీలను అరికట్టాలి..
భవిష్యత్తులో నగరంతోపాటు జిల్లాలో నీటి అవసరాలు పెరుగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే సరైన ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో లీకేజీల నివారణకు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అక్రమ నల్లాలపై ఉక్కుపాదం మోపాలి. ప్రజలు వాడే నీటి వాడకం విషయంలో మార్పు కనబడాలి. నీటిని పొదుపు చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో పెరగాలి. ఇంట్లో వాడే నీళ్లను మరింత పొదుపుగా వాడితే ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటిలో 20 శాతం ఆదా చేసే వీలుంటుంది. వాహనాలను పదే పదే కడగడం, ఇంట్లో నల్లాల లీకేజీలను అరికట్టకపోవడం, ఇంటిపై ట్యాంక్ నీళ్లను వదిలేయడంలాంటివి అరికట్టాలి. దుస్తులు ఉతకడానికి టాయిలెట్‌కు, స్నానానికి వాడే నీళ్ల విషయంలో పొదుపును పాటించాలి.