వంద శాతం లక్ష్యం
ABN , Publish Date - Nov 05 , 2026 | 01:44 AM
ఉన్నత చదువులకు తొలిమెట్టుగా ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఉన్నత చదువులకు తొలిమెట్టుగా ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మార్చి మాసంలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాను 100శాతం ఉత్తీర్ణతతో ప్రథమంగా నిలపడానికి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతులకు విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ప్రత్యేక ప్రణాళికతో చదివించి పది పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం మొదలైంది.
90 రోజుల కార్యాచరణ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 7,512 మంది ఉన్నారు. వీరి కోసం 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక విద్యాశాఖ ప్రకటించింది. మొదటగా 50 రోజుల ప్రణాళికలతో డిసెంబరు 31వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. జనవరి 1వ తేది నుంచి ఉదయం 7.50 నుంచి 8.50 వరకు మళ్లీ సాయంత్రం యథావిధిగా ప్రత్యేక తరగతులు కొనసాగిస్తారు. ప్రత్యేక తరగతులకు సంబంధించి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి పాఠాలను స్వయంగా చదివించడం, ప్రశ్నలకు సమాధానాలు రాసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. 40 నిమిషాల సమయంలో ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నలతో జవాబులు రాయిస్తారు. వర్క్ బుక్స్‌లోని ప్రశ్నలను క్రమం తప్పకుండా అభ్యాసం చేయిస్తారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో ప్రగతి సాధించేలా వ్యక్తిగత శ్రద్ధను చూపుతారు. బోధించిన పాఠ్యాంశాలలో ముఖ్యాంశాలను మరోసారి అర్థం చేయించడం, అవసరమైన సబ్జెక్టులు మరోసారి బోధిస్తారు. విద్యార్థులకు కలిగే సందేహాలు తీరుస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
ఉపాధ్యాయుల వేకప్ కాల్స్
పదో తరగతి పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రజాస్థానంలో నిలబెట్టేందుకు విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలో 15వ స్థానంతో రాజన్న సిరిసిల్ల జిల్లా సరిపెట్టుకుంది. ఈసారి ప్రథమంగా ఉండే విధంగా కృషి చేస్తున్నారు. నిత్యం పర్యవేక్షించే విధంగా విద్యార్థులను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించారు. అంతేకాకుండా ఆయా విద్యార్థుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని ప్రతిరోజు ఉదయం వేళల్లో విద్యార్థులకు ఫోన్ చేసి నిద్ర లేపడం, తల్లిదండ్రులతో మాట్లాడం చేస్తారు. వేక్ అప్ కాల్స్‌తో విద్యార్థులు ఉదయమే లేచి అభ్యాసనం చేయక తప్పదు. విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు అందుకు అనుగుణంగా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపి లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తారు. జనవరి 10 తేదీలోగా సిలబస్ పూర్తి చేస్తారు. ప్రీఫైనల్ పరీక్షల్లో వచ్చే ఫలితాలను బట్టి విశ్లేషణ కూడా చేస్తారు. ఈసారి పకడ్బందీగా వందశాతం ఫలితాలు సాధించే దిశగా జిల్లా విద్యా శాఖ దృష్టి పెట్టింది.
జిల్లాలో పది పరీక్షల ఫలితాలు ఇలా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదో తరగతి పరీక్షల ఫలితాలు కొంత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ముందు వరుసలో నిలవలేకపోతోంది. 2025-26 పది ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో 97.74 శాతం ఉత్తీర్ణతతో 15వ స్థానాన్ని దక్కించుకుంది. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 7310మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కాగా, 7145మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3525 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 3411 మంది ఉత్తీర్ణులయ్యారు. 3785మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా, 3734 మంది ఉత్తీర్ణులయ్యారు. 97.74 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 96.77శాతం, బాలికలు 98.65 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన వారిలో మరోసారి బాలికలే ముందంజలో నిలిచారు. బాలురు 3411 మంది, బాలికలు 3734 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 323 మంది ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు.
సంవత్సరాల వారీగా
విద్యాసంవత్సరం ఉత్తీర్ణత శాతం
2016 - 2017 87.3
2017 - 2018 91.3
2018 - 2019 97.7
2019 - 2020 100
2020 - 2021 100
2021 - 2022 95.76
2022 - 2023 94.37
2023 - 2024 98.27
2024 - 2025 98.15
2025 - 2026 97.74