Share News

ప్రైవేట్‌కు దీటుగా..

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:48 AM

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది.

ప్రైవేట్‌కు దీటుగా..

కరీంనగర్‌ టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనాన్ని కళాశాల విద్యార్థులకు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి అందించాలని నిర్ణయించింది. కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు డిజిటల్‌ విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రతి కళాశాలకు ప్లాట్‌, డిజిటల్‌ ప్యానల్స్‌ను పంపించింది.

- జిల్లాలో 55 ప్రభుత్వ కళాశాలలు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు 105 ఉన్నాయి. వీటిలో 55 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, మోడల్‌ స్కూల్స్‌, సంక్షేమ గురుకులాలు, 50 ప్రైవేట్‌ కళాశాలలున్నాయి. 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా ఒక్కో కళాశాలకు రెండు ఇంటిగ్రేటెడ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌, రెండు ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ప్యానల్స్‌ను పంపించారు. గత యేడాది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 2,300 మంది విద్యార్థులున్నారు. ఈ యేడు వెయ్యి మంది విద్యార్థులను అదనంగా చేర్పించి విద్యార్థుల సంఖ్యను 3,300కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రెండు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. జూలై 31 వరకు అడ్మిషన్లకు గడువు ఉండడంతో అప్పటి వరకు లక్ష్యం చేరేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రభుత్వం జూనియర్‌ కళాశాల విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కళాశాలల్లోని వసతులు, విద్యాబోధన, ఫలితాలతో కూడిన కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిదుల వద్దకు వెళ్లి గ్రామాల్లోని విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించే విధంగా సహకరించాలని కోరుతున్నారు. దీంతో ఈ సంవత్సరం కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

- ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పెరుగుతున్న అడ్మిషన్లు

- ఆంజనేయరావు, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్య అధికారి

ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. డిజిటల్‌ విద్యా విధానం అమల్లోకి తీసుకురావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. ఈయేడాది నుంచి మధ్యాహ్న భోజనం, అల్పాహారం కూడా అందిస్తోంది. ఈ వివరాలన్నీ విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు వివరించి విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేందుకు సహకరించాలని కోరుతున్నాం. ఈయేడు గత ఏడాది కంటే వెయ్యి అడ్మిషన్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

Updated Date - Jul 10 , 2026 | 12:48 AM