ఆయిల్‌ఫెడ్ చేతికి ఆయిల్‌పామ్ సాగు
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:52 AM
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నాలుగేళ్లలో 44,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నాలుగేళ్లలో 44,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. జిల్లాలో 2,472 ఎకరాల విస్తీర్ణంలోనే సాగు జరగడంతో ఆయిల్‌పామ్ అమలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న లోహియా ఎడిబుల్ ఆయిల్స్ సంస్థను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ సంస్థకు జిల్లా బాధ్యతలను అప్పగించింది. ఈ సంవత్సరం నుంచి ఆయిల్‌ఫెడ్ సంస్థ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తుంది.
ఫ అనుకూల పరిస్థితులు ఉన్నా..
ఆయిల్‌పామ్ సాగుకు అనువైన భూములు, వాతావరణం ఉన్న నేపథ్యంలో జిల్లాలో నాలుగేళ్లలో 44,500 ఎకరాల్లో సాగును చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం విధించింది. 2022లో లోహియా ఎడిబుల్ ఆయిల్ సంస్థకు సాగు బాధ్యతలను అప్పగించింది. 2022-23లో 608.85 ఎకరాల్లో, 2023-24లో 1133.68 ఎకరాల్లో, 2024-25లో 731 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. నర్సరీలో మొక్కల పెంపకం చేపట్టక, రైతులకు అందుబాటులో ఉంచకపోవడంతోపాటు సాగు కోసం రైతులను చైతన్యవంతం చేయకపోవడంతో ఆయిల్‌పామ్ సాగు అంతంత మాత్రంగానే జరిగింది. ఆయిల్ ఫామ్ గెలల నుంచి నూనె తీయడానికి మిల్లు నిర్మాణం చేపట్టలేదు.
ఫ నాలుగేళ్లలో వంద టన్నుల కొనుగోలు
నాలుగేళ్ల కాలంలో జిల్లా నుంచి 100 టన్నుల ఆయిల్‌పామ్ గెలలను మాత్రమే లోహియా సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం 15 మంది రైతుల ఆయిల్‌పామ్ దిగుబడి అందుబాటులోకి రానున్నది. జిల్లాలో అనుకున్న మేరకు ఆయిల్‌పామ్ సాగును ముందుకు తీసుకవెళ్ళేందుకు నిర్ణయించిన ప్రభుత్వం జీవో ఎంఎస్ 2 ద్వారా లోహియా ఎడిబుల్ ఆయిల్ సంస్థ నుంచి తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు అప్పగించింది. ఆయిల్‌ఫెడ్ సంస్థ జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి దిగుబడులను కొని రైతులను ప్రోత్సహించడానికి సరైన ప్రణాళికతో ముందుకు వస్తున్నది.
ఫ సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ ప్యాక్టరీ
జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట జిల్లా నంగునూరులో ఆయిల్‌ఫెడ్ సంస్థకు ఆయిల్‌పామ్ ప్యాక్టరీ ఉంది. జిల్లాలో వచ్చే దిగుబడిని అక్కడికి రవాణా చేసేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ 120 టీపీహెచ ప్రాసెసింగ్ సామర్థ్యంతో పని చేస్తున్న అతిపెద్ద ప్రాసెసింగ్ ఫ్యాక్టరీగా గుర్తింపు పొందింది. ప్రభుత్వ నర్సరీల ద్వారా నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కలను సరఫరా చేయడంతోపాటు సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పురుగు మందుల వినియోగంపై నిపుణులతో సూచనలిప్పిస్తామని ఆయిల్‌ఫెడ్ ప్రతినిధులు ప్రకటించారు. సేకరణ కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులు ఉత్పత్తిచేసిన ఫ్రెష్ ప్రూట్ బంచలను దళారులు లేకుండా కొనుగోలు చేస్తామని వారు తెలిపారు.
ఫ లాభసాటి సాగు... అంతర పంటలతో అదనపు ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు మొదటి నాలుగు సంవత్సరాలకు ఒక్కో ఎకరానికి అంతర పంటల సాగుకు, కలుపు తీయడం, తదితర నిర్వహణ కోసం 4,200 రూపాయలు అందిస్తున్నది. మార్కెట్‌లో 193 రూపాయలున్న మొక్కను 20 రూపాయల సబ్సిడీ ధరపై రైతులకు సమకూరుస్తున్నది. నర్సరీని నిర్వహిస్తున్న కంపెనీకి మిగితా సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తున్నది. డ్రిప్ కోసం అవసరమయ్యే మొత్తంలో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతర వర్గాలకు 80 శాతం సబ్సిడీగా అందిస్తున్నది. సగటున ప్రభుత్వం ఒక్కో ఎకరాపై 50 వేల రూపాయలకు పైగా భరిస్తున్నది. రైతులు సాగును చేపట్టడానికి మొదటి సంవత్సరం మొక్కలు పెట్టడానికి వీలుగా గుంతలు తవ్వుకోవడం, డ్రిప్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఖర్చులు ఎకరాకు 10 వేల వరకు భరిస్తే సరిపోతుంది. 30 సంవత్సరాల పాటు ఆయిల్‌పామ్ మొక్కలు రైతుకు దిగుబడి ఇస్తాయి. నాలుగో సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుంది. మొదటి నాలుగు సంవత్సరాల వరకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తున్న నేపథ్యంలో రైతులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మొదటి మూడు సంవత్సరాలు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ లాంటి పంటలను అంతర పంటలుగా సాగు చేసుకునే అవకాశాలున్నాయి. నాలుగో సంవత్సరం నుంచి పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీస మొత్తంలో 10 టన్నులకు తక్కువ కాకుండా రైతులు దిగుబడి పొందవచ్చు. ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం సాగు చేస్తున్నవారికి 15 నుంచి 18 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ కంపెనీలు టన్నుకు 20,500 రూపాయలు చెల్లించి ఆయిల్‌పామ్ గెలలను కొనుగోలు చేస్తున్నాయి. 10 టన్నుల దిగుబడి వచ్చినా ఎకరాకు రెండు లక్షలకు తగ్గకుండా రైతుకు ఆదాయం వచ్చే అవకాశముంది. ఎరువులు, హార్వెస్టింగ్ కోసం 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చుచేయాల్సి ఉన్నందున రైతులకు నికరంగా లక్షా 75 వేల రూపాయలు మిగిలే అవకాశమున్నది. అంతరపంటగా కోకో సాగు చేస్తారు. కోకోతోపాటు వక్క (భాగం), జాజికాయ, జాపత్రి సాగును చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కోకోను పండించే రైతులకు తెలుగు రాషా్ట్రల్లో ఎకరాకు 150 నుంచి 200 కేజీల గింజల దిగుబడి వస్తున్నది. కోకో మొక్కలను సరఫరా చేసే చాక్‌లెట్ కంపెనీలు ఆ గింజలను కూడా కొనుగోలు చేస్తున్నాయి. గింజల నాణ్యతను బట్టి కేజీకి వెయ్యి రూపాయల ధర పలుకుతున్నది. కనీస మొత్తంగా కేజీకి 600 రూపాయల ధర పలికినా రైతుకు ఎకరాకు 90 వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం కోకో ద్వారా సమకూరే అవకాశమున్నది. వక్క (భాగం) మొక్కలు సాగు చేస్తే ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల ఆదాయం వచ్చే అవకాశమున్నది. కేరళ రిసర్చ్ సెంటర్ ద్వారా విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అంతర పంటగా జాజికాయ, జాపత్రిని పండించే అవకాశాలు ఉన్నాయని, వీటిని సాగు చేస్తే ఎకరాకు ఐదు లక్షల రూపాయల మేరకు ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. అంతరపంటగా వాణిజ్య పంటలైన కోకో, వక్క, జాజికాయ, జాపత్రిని సాగు చేస్తే ఆయిల్‌పామ్ కంటే కూడా అధిక లాభాలను గడించవచ్చని అధికారులు అంటున్నారు. రైతులకు ఈ విషయంలో సరైన అవగాహన లేక పోవడంతో సాంప్రదాయ వరిసాగు పైనే దృష్టిసారిస్తున్నారు.
ఫ వరివైపే జిల్లా రైతుల మొగ్గు
జిల్లాలో రైతులు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఎకరాకు 65 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్ 2300 వరకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నందున రైతుకు లక్షా 50 వేల రూపాయలు సమకూరుతున్నాయి. 50 నుంచి 60 వేల రూపాయల వరకు నిర్వహణ ఖర్చులు పోగా రైతులకు 90వేల నుంచి లక్ష రూపాయలు మిగులుతున్నాయి. సన్న వరి సాగు చేస్తే బోనస్‌గా క్వింటాల్‌కు మరో 500 రూపాయలు కూడా లభించనున్న నేపథ్యంలో ఎలాంటి సమస్య లేని సాంప్రదాయసాగును చేపట్టక ప్రయోగాలు ఎందుకనే ఆలోచనతో రైతులు వరి సాగువైపే మొగ్గు చూపిస్తున్నారు. వరిసాగును వదిలి వాణిజ్య పంటల వైపు దృష్టిసారిస్తే రెట్టింపు ఆదాయాన్ని పెంచుకోవచ్చనే అవగాహనను వారికి వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ కల్పించాల్సిన అవసరమున్నది. ఆయిల్‌పామ్‌పై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రోత్సహిస్తే ప్రభుత్వం అనుకున్న విధంగా జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి.