Share News

ఆయిల్‌ పామ్‌ సాగు పెంచాలి

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:00 AM

దీర్ఘకాలికంగా లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు.

ఆయిల్‌ పామ్‌ సాగు పెంచాలి

కరీంనగర్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దీర్ఘకాలికంగా లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆయాశాఖల అధికారులతో ఆయిల్‌ పామ్‌ సాగు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం, నిర్ధేశిత లక్ష్యం తెలుసుకున్నారు. రైతు వేదికల ద్వారా గ్రామపంచాయతీల ద్వారా ఆయిల్‌పామ్‌ సాగుతో కలిగే లాభాలు, ప్రభుత్వ రాయితీలను రైతులకు వివరించాలని సూచించారు. గ్రామాల వారీగా ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న, సాగుకు ఆసక్తి ఉన్న రైతుల వివరాలను తయారు చేయాలని ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయిల్‌ పామ్‌ తోటల వద్దకు రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. ఏఈవోలకు 25 ఎకరాల చొప్పున టార్గెట్‌ నిర్ధేశించి చేరుకునేలా పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలో గత నాలుగేళ్లలో 2,640 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటించామని, ఈ ఏడాది వేయి ఎకరాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం, సన్నకారు రైతులకు 80శాతం, సాధారణ రైతులకు 70శాతం సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలి

కరీంనగర్‌ టౌన్‌ : ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథతోపాటు ఇతర తాగునీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలుగకుండా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కొత్తపల్లి, చింతకుంట, బొమ్మకల్‌, విద్యారణ్యపురి, అల్గునూరు ప్రాంతాలతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ సూచించారు. జమ్మికుంట, హుజురాబాద్‌, చొప్పదండి మున్సిపాలిటీలు, గంగాధర, గన్నేరువరం మండలాల్లో నీటి అవసరాలు, వినియోగం, సరఫరా పరిస్థితులను సమీక్షించారు. ఎల్‌ఎండి రిజర్వాయర్‌లో నీటి నిలువలు ప్రతిరోజు పర్యవేక్షించాలని, డెడ్‌ స్టోరేజీ పరిస్థితి ఏర్పడక ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గన్నేరువరం మండలంలోని హన్మాజుపల్లి, జంగపల్లి ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, గంగాధర మండలంలోని నారాయణపూర్‌ చెరువు నీటిని గంగాధర, చొప్పదండి మండలాల తాగు నీటి అవసరాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని అన్నారు. అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించాలని, నీటిని వృధా కాకుండా అరికట్టాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ, ఈఈలు రామ్‌కుమార్‌, సందీప్‌కుమార్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సంపత్‌రావు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:00 AM