Share News

బాబోయ్‌ దొంగలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 02:17 AM

’పోలీసుల బండికే రక్షణ లేదు.. ఇక మన వాహనాల భద్రత సంగతేంటి’..? అనే ప్రశ్న జిల్లాలోని సగటు పౌరుడిలో తలెత్తుతోంది.

బాబోయ్‌ దొంగలు

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌/ కరీంనగర్‌ క్రైం)

’పోలీసుల బండికే రక్షణ లేదు.. ఇక మన వాహనాల భద్రత సంగతేంటి’..? అనే ప్రశ్న జిల్లాలోని సగటు పౌరుడిలో తలెత్తుతోంది. నగరంలోని రూరల్‌ ఠాణా నుంచి పోలీసుల పెట్రోలింగ్‌ వాహనమే చోరీకి గురైంది. ఈ ఘటన నగరంతోపాటు కమిషనరేట్‌లోని భద్రత వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఇటీవలే నగరంలోని పీఎంజే జ్యూవెలర్స్‌లో భారీ చోరీ జరిగింది..గతంలో జిల్లాలో జరిగిన చోరీల పరిస్థితిని గమనిస్తే.. బైక్‌లు, కార్ల విషయంలో ఎవరికి వారుగా మరింత స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలనేది అవగతమవుతోంది. మరోవైపు పోలీసులు ఇప్పుడున్న నిఘా వ్యవస్థను మరింతగా పెంచాలి. రాత్రివేళ గస్తీని పక్కాగా అమలు చేయాలి.

ఫ కేసులకు వెనకడుగు...

కొన్నేళ్లుగా జిల్లా వ్యాప్తంగా ద్విచక్రవాహనాలు పెద్ద సంఖ్యలో చోరీకి గురవుతున్నాయి. సగటున నెలలో 10 వరకు మాయమవుతున్నా.. కేసులు మాత్రం కొన్నింటికే నమోదు చేస్తున్నారు. వాహనం చోరీకి గురైనట్లు కేసు నమోదు చేస్తే వెంటనే రికవరీ చేయాల్సి ఉంటుంది. లేదంటే పెండింగ్‌ కేసు కింద ఉంటుంది. పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించే నేరసమీక్షల్లో కేసులు, పురోగతి సమయంలో ఇది ఎస్‌హెచవోల పనితీరుకు ఇబ్బందిని సృష్టిస్తుంది. అందుకనే వాహనం చోరీకి గురవగానే కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారు. ఎక్కడైనా ఆచూకీ కోసం చూస్తామని వివరాలను సేకరిస్తున్నారు. వాహనాలు లభిస్తే వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారు. ఇక పోలీసులు వెల్లడించే వార్షిక నివేదికల్లో పేర్కొన్న వాటిలో కనీసం 50 శాతం వాహనాలను రికవరీ చేయలేకపోతున్నారు. మరోవైపు ఇలా మాయమైన వాహనాలను దొంగలు ఇతర నేరాలకు ఉపయోగిస్తున్నారు.

ఫ ఇలా అయితే ఇబ్బందికరమే..

- కరీంనగర్‌ కార్పొరేషనతోపాటు మున్సిపాలిటీలు, గ్రామాల్లో సీసీ కెమెరాల పనితీరు అధ్వానంగా మారింది. నిఘానేత్రాలు చాలాచోట్ల నేలచూపులు చూస్తున్నాయి. 2016-17వ సంవత్సరంలో ప్రజల భాగస్వామ్యంతో వేల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అందులో ఇప్పుడు 70 శాతం పనిచేయడం లేదు. దీంతో ప్రైవేటు దుకాణాదారులు, ఇళ్ల చెంత ఉన్నవే ఆధారమవుతున్నాయి.

- 2023లో 72 చోరీకి గురవగా 2024లో ఈ సంఖ్య దాదాపు రెట్టింపైంది. 133 వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. 2025లో అన్నిరకాల వాహనాలు కలిపి 134 మాయమయ్యాయి. ఈ ఏడాదిలో మొదటి ఆరునెలల్లో 250కిపైగా చోరీ కేసులు నమోదవగా అందులో సుమారుగా 30 వరకు వాహనాలు కనిపించడం లేదనే ఫిర్యాదులు పలు ఠాణాలకు అందాయి.

- అప్పుడప్పుడు బైక్‌ దొంగల ముఠాలు పట్టుబడుతున్నా.. అందులో జిల్లాకు చెందిన వాహనాలు వేళ్లమీద లెక్కపెట్టే విధంగా ఉంటున్నాయి. ఇక్కడ చోరీ చేసిన ద్విచక్రవాహనాలను ఇతరప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. పార్ట్‌లను విడదీసి ఎక్కడిక్కడే తుక్కు కింద విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సా చేస్తున్నారు. అదృష్టవశాత్తు వాహనం దొరికినా దాని రూపమే మారిపోతోంది.

Updated Date - Sep 11 , 2026 | 02:17 AM