Share News

వామ్మో శునకాలు..!

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:42 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీదికుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది.

వామ్మో శునకాలు..!

జగిత్యాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీదికుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు చేపడుతున్న తూతూమంత్రపు చర్యలతో వీటి బెడద ఏమాత్రం తగ్గడం లేదు. జిల్లాలోని ప్రధాన పట్టణాలయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురిలతో పాటు పలు గ్రామ పంచాయతీల్లో సైతం సమస్య తీవ్రంగా ఉంది. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 39,620 కుక్కలు ఉన్నాయి. సగటున రోజుకు 15 నుంచి 20 మంది కుక్క కాట్లకు గురై వివిధ ఆసుపత్రులకు వస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కుక్క కాటుకు సంబంధించి 2,886 కేసులు నమోదయ్యాయి.

ఫపారిశుధ్య నిర్వహణ లోపమే కారణమా..?

జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల కుక్కల సంఖ్య పెరుగుతోందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. హోటళ్లు, చికెన్‌ సెంటర్లు, మాంసపు దుకాణాల వద్ద పడేసే వ్యర్థాలు వీధి కుక్కలకు ఆహారంగా మారుతున్నాయి. దీంతో అవి గుంపులుగా అవే ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. జిల్లాలోని బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, రద్దీ ప్రాంతాలు, జన ఆవాసాల్లో కుక్కల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాటిని షెల్టర్‌ హోంకు తరలించాలని న్యాయ స్థానాలు ఆదేశించినా మున్సిపల్‌, పంచాయతీ అధికార యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదు. ఫిర్యాదు వస్తే కాలనీల్లోకి వెళ్లి 15 నుంచి 20 కుక్కలను పట్టుకోవడం, శస్త్ర చికిత్సలు నిర్వహించడం, ఐదారు రోజుల తర్వాత తిరిగి అదే ప్రాంతాల్లో వదిలివేయడం సర్వ సాధారణమై పోయింది. కుక్కల పట్టివేత కార్యక్రమాలకు వినియోగిస్తున్న వాహనాలకు రోజుకు రూ.వేలల్లో డీజిల్‌ ఖర్చు అవుతున్నట్లు లెక్కల్లో చూపతున్నా ఆచరణలో మాత్రం ఫలితం కనిపించడం లేదు.

ఫకరువైన నియంత్రణ చర్యలు..

జిల్లాలో కుక్కల బెడద ఎక్కువవుతున్నా నియంత్రణకు అవసరమైన చర్యలను అధికారులు నామమాత్రంగానే తీసుకుంటన్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో ప్రతీ నిత్యం పలువురు కుక్క కాటుకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో చేరి రూ.వేలల్లో వ్యయం చేయాల్సి వస్తోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు కుక్క కాటుకు ఎక్కువగా గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఎబీసీ) సెంటర్లు లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.

ఫన్యాయస్థానాలు ఆదేశించినా..

గౌరవ ప్రదమైన జీవన హక్కు అంటే కుక్కల దాడుల భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారింది. వీధి కుక్కలను జనావాసాల నుంచి షెల్టర్‌ జోన్లకు తరలించాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఫలితంగా పట్టణ వాసులు, పల్లె ప్రజలు, వలస కూలీల పిల్లలు కుక్క కాట్ల బారిన పడుతున్నారు.

ఫఇలా చేస్తే మేలు..

జిల్లాలో వీధి కుక్కల సంఖ్య సమగ్ర సర్వే నిర్వహించాలి. స్టెరిటైజేషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేయాలి. చెత్త నిర్వహణను కట్టుదిట్టం చేయాలి. కుక్కల దాడులు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. రేబిస్‌ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

ఇటీవల జరిగిన సంఘటనలు..

ఫఎండపల్లి మండలం గొడిశెలపేట గ్రామంలో బుధవారం పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందులో ఓ మహిళ ముఖాన్ని కుక్క తీవ్రంగా గాయపర్చింది.

ఫసారంగాపూర్‌ మండలం పోతారం గ్రామంలో ఓ పిచ్చికుక్క దాడి చేయగా 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:42 AM