సమయపాలన పాటించని అధికారులు
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:11 AM
హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమయపాలన పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. శనివారం హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమయ పాలన పాటించకపోవడంతో భూముల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హుజూరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమయపాలన పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. శనివారం హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమయ పాలన పాటించకపోవడంతో భూముల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలే ఎండకాలం.. ఆపై కార్యాలయంలో వసతులు లేక రైతులు అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం 10:30గంటలకు తక్కువ శాతం సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఒక్కొక్కరుగా నింపాదిగా కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధులకు హాజరు కాకపోవడంతో రైతులు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. స్లాట్ బుక్ చేసుకొని సమయానికి కార్యాయలయానికి వస్తే తహసీల్దార్ లేడని వారు విమర్శించారు. ఈ విషయంపై తహసీల్దార్ నరేందర్‌ను వివరణ కోరగా, ఆర్డీవో కార్యాలయంలో పని నిమిత్తం వెళ్లానని తెలిపారు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్లు చేశానన్నారు.
- వాహనాలను అనుమతించని సిబ్బంది
హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల కార్లు ఇష్టారాజ్యంగా పార్క్ చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే రైతులు, ప్రజల వాహనాలను లోపలికి అనుమతించేవారు. శనివారం అధికారుల కార్లు మాత్రమే లోపలికి అనుమతించి గేట్‌కు తాళం వేశారు. దీంతో కార్యాలయానికి రైతులు, ప్రజలు జమ్మికుంట ప్రధాన రహదారిపైన వాహనాలను పార్కింగ్ చేశారు. దీంతో వచ్చి పోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.